Artificial Intelligence/ఏఐ ద్వారా శ్రీవారి దర్శనం ఎలా సాధ్యం!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది కంప్యూటర్లు, మెషీన్‌లను రూపొందించడానికి సంబంధించిన విజ్ఞానం.

Update: 2024-11-20 05:46 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రస్తుతం చర్చనియాంశంగా మారాయి. నూతనంగా ఎంపికైన పాలక మండలి తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత వచ్చింది. పాలక మండలిలో అనుభవం ఉన్న వారు, లేని వారు ఉన్నారు. పాలక మండలి నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఒకటి. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మూడు గంటల్లో శ్రీవారి దర్శనం చేయిస్తామని భక్తులకు పాలక మండలి భరోసా ఇచ్చింది. ఇది నిజమా.. అయితే ఎలా చేయిస్తారు అనేది భక్తుల అందరి మదిలో మెదులుతున్న ఆలోచన. దీనికి పాలక మండలి వెంటనే సరైన సమాధానం చెప్పాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

ఏఐ అంటే ఏమిటి? ( Artificial Intelligence )
ఇది సాధారణంగా మానవ మేధస్సుకు అవసరమయ్యే లేదా మానవులు విశ్లేషించగలిగే స్థాయిని మించిన డేటాను కలిగి ఉంటుంది. ఎవరితోనైనా తర్కించి, నేర్చుకోగల సత్తా ఉన్న సాఫ్ట్‌వేర్‌. ఏఐ అనేది కంప్యూటర్‌ సైన్స్, డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, లింగ్విస్టిక్స్, న్యూరోసైన్స్, ఫిలాసఫీ, సైకాలజీతో సహా అనేక విభిన్న విభాగాలను కలిగిన రంగంగా చెప్పొచ్చు.
ఏఐ ద్వారా శ్రీవారి దర్శన సమయం ఎలా తగ్గుతుంది?
ఏఐ టెక్నాలజీ ఉపయోగించి శ్రీవారి దర్శనం త్వరగా పూర్తవ్వాలంటే మెషీన్ల ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఉంటుందనేది పలువురు సాఫ్ట్‌వేర్‌ రంగంలోని నిపుణులు చెబుతున్న మాట. ఒక వ్యక్తి కంప్యూటర్‌ ద్వారా తనకు కావాల్సిన సమాచారాన్ని ఏఐ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక అంశం గురించి ఎంతవరకు కంప్యూటరీకరణ అయిందో అంతవరకు క్షణాల్లో అందించే సత్తా ఏఐకి ఉంది. అంతే కాని తక్కువ సమయంలో ఎక్కువ మంది భక్తులు దేవుడిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించేలా ఏఐ ఎలా పనిచేస్తుందనేది చర్చగా మారింది.
ప్రస్తుతం ఎంతో మంది క్యూలైన్ల ద్వారా వచ్చిన భక్తులకు క్యూ కాంప్లెక్స్‌ల్లో కొంత సమయం వేచి ఉన్న తరువాత శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. దేవాలయంలో వీఐపీ దర్శనాలు, ప్రొటోకాల్‌ దర్శనాల వంటివి ఉదయం ముగిసిన తరువాత సామాన్య భక్తుల దర్శనం మొదలవుతుంది. ఎక్కువగా ఉదయం వేళల్లో సేవలు కూడా ఉంటాయి. ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు సేవా టిక్కెట్లు మూడు నెలల ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు. సేవలకు వచ్చిన భక్తులు సేవలు ముగిసిన తరువాత శ్రీవారిని దర్శనం చేసుకుని బయటకు వస్తారు. దీనికి కూడా కొంత సమయం తీసుకుంటుంది. ఈ దర్శన సమయం తగ్గించడంలోనూ టీటీడీ వారు తగిన చర్యలు తీసుకుంటారు.
ప్రతి క్యూ కాంపెక్స్‌లోనూ పెద్ద స్క్రీన్‌లతో కూడిన టీవీలు భక్తులు కూర్చున్నప్పుడు చూసేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ ద్వారా దర్శన భాగ్యం తక్కువ సమయంలో ముగించాలంటే దేవుడు నేరుగా నడిచి వచ్చి భక్తులతో మాట్లాడినట్లు కూడా ఏఐ సృష్టిస్తుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం నేరుగా భక్తుల వద్దకు నడిచి వచ్చినట్లు కూడా చూపించ వచ్చు.
తిరుమల కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడ వెలిసారో అక్కడికి వెళ్లి నేరుగా విగ్రహాన్ని దర్శించి భక్తులు తరిస్తారు. అంతే కాని ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ద్వారా అది సాధ్యమయ్యే పనికాదు. 2016లో నాటి పాలక మండలి తక్కువ సమయంలో ఎక్కువ మంది దర్శనం చేసుకోవాలంటే ఎలా అనే అంశాన్ని పరిశీలించి, బంగారు వాకిలి దాటిన తరువాత చెక్కపై భక్తులు అడుగుపెట్టగానే ఒక కన్వేయర్ బెల్ట్‌ వచ్చి భక్తుడిని క్షణాల్లో ఆ బెల్ట్‌పైకి లాక్కుని స్వామి వారిని చూపిస్తూ వెంటనే వెనక్కి తిరిగే విధంగా రూపొందించాలనే ఆలోచన చేశారు. ప్రస్తుతం బంగారు వాకిలి లోపలికి వెళ్లిన తరువాత భక్తుడు తిరిగి బయటకు రావడానికి కనీసం 20 సెకన్ల సమయం పడుతుందని దేవస్థానం వారు చెబుతున్నారు. ఈ సమయాన్ని పది సెకన్లకు తగ్గిస్తే కాని ఎక్కువ మంది తక్కువ సమయంలో దర్శనం చేసుకుందుకు అవకాశం ఉంటుంది. అప్పట్లో చేసిన ఆలోచనను కొందరు పాలక మండలి సభ్యులు వ్యతిరేకించారు. బెల్ట్‌పైకి కాలు పెట్టాలంటే ఆ బెల్ట్‌ వేగానికి అనుగుణంగా అడుగు వేయాల్సి ఉంటుంది. అలా అడుగు వేయలేకపోతే కింద పడిపోతారు. అందువల్ల పిల్లలు, ముసలి వారు, అనారోగ్యంతో ఉన్న వారు దర్శనం చేసుకునే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆ ప్రతిపాన కూడా విరమించుకున్నారు.
ఫైనల్‌గా ఒక్కటే మార్గముందనే విషయం దేవస్థానంలో ఎంతో కాలంగా పనిచేస్తున్న వారు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు, మూడు స్టెప్స్‌లో దేవుడిని దర్శించుకుంటున్నారు. అలా స్టెప్స్‌ పెంచి ఒకేసారి నాలుగైదు స్టెప్స్‌ వేసి లైన్ల ద్వారా దర్శనం చేయించ వచ్చంటున్నారు. అయితే విగ్రం ఎత్తును బట్టి లైన్ల ఏర్పాటు ఉండాలే తప్ప ఇస్టానుసారం లైన్లు ఏర్పాటు చేసినా భక్తులకు దర్శనం సరిగా ఉండదనే వాదన కూడా ఉంది. ఇవన్నీ ఒకెల్తైతే ఏఐ ద్వారా తక్కువ సమయంలో దర్శనం ఎలా చేయిస్తారనే క్లారిటీ కోసం టీటీడీలోని ఐటీ విభాగం వారిని సంప్రదిస్తే వారు చెప్పింది ఒకే మాట. మాకు ఇప్పటి వరకు ఏఐ ద్వారా తక్కువ సమయంలో దర్శనం అవుతుందని తెలియదు. ఎలా అవుతుందో కూడా మాకు క్లారిటీ లేదు. నిదానంగా పాలక మండలి తీసుకున్న నిర్ణయంపై స్టడీ చేయాల్సి ఉంటుందని చెప్పటం విశేషం.
Tags:    

Similar News