మొంథాపై ముఖ్యమంత్రి మారథాన్..ఎలా సాగిందంటే
మొంథా తుఫాను మీద అలుపెరగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పని చేశారు.
By : Vijayakumar Garika
Update: 2025-10-29 16:06 GMT
మంగళవారం రాత్రి 12 గంటలకు సచివాలయం నుంచి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం 5 గంటల నుంచే తుఫాను సహాయక చర్యలపై ఫోకస్ పెట్టారు. తెల్లవారు జామున ఐదు గంటలకు వివిధ వర్గాల నుంచి, ప్రసార మాధ్యమాల నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు అధికారులను, ప్రభుత్వ విభాగాలను అలెర్ట్ చేస్తూ మొదలైన ముఖ్యమంత్రి చంద్రబాబు మొంథాపై కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.
9:00 AM : ఉదయం 9 గంటలకు తుఫాను ఎఫెక్ట్, రాష్ట్ర వ్యాప్త పరిస్థితిపై సీఎంవో, ఆర్టీజీ అధికారులతో చర్చ.
10:00 AM : ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల మందితో టెలీకాన్ఫరెన్స్ తీసుకున్న సీఎం... ఆయా ప్రాంతాల్లో గ్రామ స్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. తుఫాను సమయంలో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించడానికి తీసుకున్న చర్యలపై అధికారులతో మాట్లాడిన సీఎం... నేటి ప్రణాళికపై అధికారులు, మంత్రులతో చర్చించారు. ఫీల్డ్ లో ఉండి చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారంటూ టెలీకాన్ఫరెన్స్ లో అధికారులు, ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
11:00 AM : తుఫాను బాధితులకు బియ్యం, నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందించే విషయంపై సమీక్ష. బాధిత ప్రజలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశం.
12:30 PM: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్లారు. పల్నాడు, బాపట్ల, కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆయా ప్రాంతాల్లో తుఫాను ప్రభావాన్ని పరిశీలించారు. చిలకలూరిపేట, పరుచూరు, చీరాల, బాపట్ల, నాగాయలంక, మచిలీపట్నం, కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవు వరకు ఏరియల్ విజిట్ చేశారు.
మధ్యాహ్నం2:00 PM: దాదాపు గంటన్నర పాటు ఏరియల్ విజిట్ అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుల హెలిపాడ్ వద్ద ల్యాండ్ అయ్యారు.
2:15 PM: జెడ్ క్యాటగిరీ స్థాయి భద్రత లేకుండా, బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం లేకుండా, సాధారణ వాహనంలో పూర్తి స్థాయి సెక్యూరిటీ లేకుండా పర్యటన చేశారు. ఓడరేవుల సమీపంలోని పునరావాస కేంద్రంలో దాదాపు అరగంట సేపు తుఫాను బాధితులతో మాట్లాడి వారి సాధకబాధకాలు, అందుతున్న సౌకర్యాలను అడిగితెలుసుకున్నారు. తుఫాను బాధిత ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి పిల్లలతో ముచ్చటించారు.
3:00 PM: అరగట్లపాలెం, బెండమూరు లంకలో నీటి మునిగిన పొలాలను స్థానికులతో కలిసి పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టానికి పరిహారంపై హామీ ఇచ్చారు. పొలంలోకి వెళ్లి అన్నదాతలతో చర్చించారు.
4:30 PM: క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం మళ్ళీ హెలికాఫ్టర్ లో తిరుగు ప్రయాణమయ్యారు . తిరుగు ప్రయాణంలో కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన, అమలాపురం, అంబాజీ పేట, మండపేట, రాయవరం, ఏలూరు జిల్లా ముదినేపల్లి గ్రామాల్లో తుఫాను ప్రభావం, పంట నష్టాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
5:30 PM: ఏరియల్ విజిట్ ముగించుకుని నేరుగా సచివాలయం సమీపంలోని హెలిపాడ్ వద్ద ల్యాండ్ అయ్యారు.
6:00 PM: సచివాలయ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ నుంచి మంత్రులు, అధికారులతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, అందించాల్సిన పంట నష్టం, బాధిత కుటుంబాలకు అందుతున్న ప్రభుత్వ సాయంపై సమీక్ష నిర్వహించారు.
సీఎం ఏమన్నారంటే..
అర్ధరాత్రి ఒంటి గంట అయినా విశ్రమించకుండా అప్రమత్తంగా ఉంటూ... ఆర్టీజిఎస్ నుండి నిశితంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ... మొంథా తుఫాను తీరం దాటే వరకు పర్యవేక్షించడం జరిగింది. గతంలో కంటే ఎంతో సమర్థవంతంగా ప్రభుత్వ యంత్రాంగం నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరం కలిసి సమిష్టిగా తుఫానును ఎదుర్కొన్నాం. అంటూ తన సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.