బాంబుపేలుళ్ళ నుండి హైదరాబాద్ ఎలా తప్పించుకున్నది ?

ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్(Counter Intelligence) కు విజయనగరంలో పట్టుబడిన సిరాజ్-ఉర్-రెహ్మాన్, హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ ను అరెస్టుచేయటంతో భాగ్యనగరం క్షేమంగా బయటపడింది;

Update: 2025-05-20 12:22 GMT
Great escape of Hyderabad from bomb blasts

దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా వెంటనే అందరి దృష్టి హైదరాబాద్ మీదే పడుతుంది. దేశంలో ఎక్కడ బాంబులుపేలినా దానిమూలాలు హైదరాబాదులోనే కనబడుతుంది. అయితే ఈసారి అలా జరగకుండా ముందుగానే హైదరాబాద్ బాంబుపేలుళ్ళ నుండి తృటిలో తప్పించుకున్నది. నిజంగా హైదరాబాద్(Hyderabad) ది గ్రేట్ ఎస్కేపనే చెప్పాలి. చివరినిముషంలో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్(Counter Intelligence) కు విజయనగరంలో పట్టుబడిన సిరాజ్-ఉర్-రెహ్మాన్, హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ ను అరెస్టుచేయటంతో భాగ్యనగరం క్షేమంగా బయటపడింది. హైదరాబాద్ కు చెందిన సయ్యద్, విజయనగరంకు చెందిన సిరాజ్ ఇటు హైదరాబాద్ తో పాటు అటు విజయనగరంలో వరుస బాంబుపేలుళ్ళకు చేసిన ప్లాన్ చివరినిముషంలో బెడిసికొట్టడంతో ప్రభుత్వంతో పాటు దర్యాప్తుసంస్ధలు ఊపిరిపీల్చుకున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే సిరాజ్, సయ్యద్ ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు. ఇద్దరికీ హైదరాబాదులోని కాలేజీలో పరిచయం. ఇద్దరు కూడా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) వైపు ఆకర్షితులయ్యారు. బీటెక్ అయిపోయిన తర్వాత సయ్యద్ సికింద్రాబాద్ లో లిఫ్ట్ మెకానిక్కుగా పనిచేస్తున్నాడు. కొంతకాలానికి సౌదీ అరేబియా(Saudi Arabia)లోని ఉగ్రవాదసంస్ధల హ్యండ్లర్ల ద్వారా సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. ఇదేపద్దతిలో సిరాజ్ కూడా ఉగ్రవాదుల హ్యాండ్లర్లతో పరిచయం చేసుకున్నాడు. హ్యండ్లర్లు ఇచ్చిన ఆదేశాలతో ఇద్దరూ అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్(అహీం) అనే సంస్ధను స్ధాపించారు. ఈసంస్ధ తరపున సోషల్ మీడియాలో ‘మ్యాజిక్ లాంతర్’ అనే పేరుతో ఖాతాను తెరిచారు. మ్యాజిక్ లాంతర్ ఖాతా ద్వారా చాలామందిని ఆకర్షించి సభ్యత్వాలిచ్చారు.

తర్వాత కొంతకాలానికి సిరాజ్ రెండుసార్లు సౌదీఅరేబియాకు వెళ్ళివచ్చాడు. ఎందుకు వెళ్ళాడంటే బాంబులు చేయటంలో ట్రైనింగ్ తీసుకోవటానికి. బాంబులుచేయటం బాగా వచ్చింది అన్న సర్టిఫికేట్ అందుకున్న తర్వాత సౌదీ నుండి విజయనగరంకు తిరిగొచ్చాడు. సయ్యద్ ను కలిసి పెద్ద ప్లాన్ వేశాడు. సయ్యద్ కు కూడా వీడియోల ద్వారా బాంబులు తయారుచేయటంలో సిరాజ్ ట్రైనింగ్ ఇచ్చాడు. అలాగే బాంబులతయారీకి అవసరమైర సామగ్రిని ఇతర మార్గాల్లో తెప్పించుకున్నారు. కావాల్సినవాటిని అంటే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్, టిపిన్ బాక్సులు, వైరులు, రిమోట్ సెల్స్ లాంటి వాటిని రకాల అడ్రస్సులతో ఈకామర్స్ సైట్లలో ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. రావాల్సినవి అన్నీ వచ్చినాక బాంబులు తయారుచేసి రంపచోడవరంలోని అడవుల్లో పరీక్షించారు. దట్టమైన అడవుల్లోకి వెళ్ళి బాంబులు పేల్చి ట్రయల్ సక్సెస్ చేసుకున్నారు. ట్రయల్ సక్సెస్ అయిన తర్వాత విజయనగరంతో పాటు హైదరాబాదులో ఎన్నిచోట్ల బాంబులు పేల్చాలి, అందుకు ఎన్ని బాంబులు అవసరమో లెక్కవేసుకున్నారు. పెద్దఎత్తున బాంబుల తయారీకి అవసరమైన పైనచెప్పిన మెటీరియల్ ను రకరకాల ఈ కామర్స్ సైట్ల నుండి రకరకాల అడ్రస్సులతో తెప్పించుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఎలాగ పట్టుబడ్డారు ?

బాంబుల తయారీకి మెటీరియల్ తెప్పించుకోవటంలో ఒకవైపు వీళ్ళు ప్రయత్నాల్లో వీళ్ళు బిజీగా ఉండగానే మరోవైపు కౌంటర్ ఇంటెలిజెన్స్ కు సిరాజ్ పట్టుబడ్డాడు. కౌంటర్ ఇంటెలిజెన్స్ కు సిరాజ్ ఎలాగ పట్టుబడ్డాడు ? ఎలాగంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ పనేమిటంటే వాట్సప్ లాంటి సోషల్ మీడియా ఖాతాలను 24 గంటలూ, 365 రోజులూ పర్యవేక్షిస్తుండటమే. అలాగే ఈ కామర్స్ సైట్లలో అనుమానాస్పద కొనుగోళ్ళు ఏమైనా జరిగితే వెంటనే అలర్టవుతుంది. ఒకసారి అనుమానం వచ్చిందంటే అంతుతేల్చేదాకా కౌంటర్ ఇంటెలిజెన్స్ వదిలిపెట్టదు. ఈపద్దతిలోనే మ్యాజిక్ లాంతర్, ఈ కామర్స్ సైట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ దృష్టిని ఆకర్షించింది. అందుకనే వెంటనే మ్యాజిక్ లాంతర్ పైన నిఘాపెట్టింది. ఈ రెండింటి వ్యవహారాలేమిటనే విషయంలో బాగా లోతుకు వెళ్ళినపుడు సిరాజ్, సయ్యద్ తో పాటు సుమారు 20 మంది యాక్టివ్ సభ్యుల వ్యవహారాలు బయటపడ్డాయి. దాంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఒక ఇంటిమీద దాడిచేసి సిరాజ్ ను అదుపులోకి తీసుకున్నది. సిరాజ్ ను అదుపులోకి తీసుకోగానే కౌంటర్ ఇంటెలిజెన్స్ ముందుచేసిన పనేమిటంటే మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకోవటం.

మొబైల్, ల్యాప్ టాప్ ను విశ్లేషించినపుడు చాలా విషయాలు వెలుగుచూశాయి. దాంతో హైదరాబాద్ లోని సయ్యద్ విషయంతో పాటు గ్రూపులోని ఇతర సభ్యుల వివరాలు కూడా దొరికాయి. సౌదీఅరేబియాలోని ఐఎస్ ముఖ్యులకు, సిరాజ్ కు మధ్య జరిగిన సంభాషణలు కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. దాంతో వెంటనే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్సును అప్రమత్తంచేసింది ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్. హైదరాబాద్ కు వచ్చి సికింద్రాబాదులోని ఇంటిమీదదాడిచేసి సయ్యద్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు రెండు కౌంటర్ ఇంటెలిజెన్సులో పనిచేసే అధికారులు. సిరాజ్, సయ్యద్ అరెస్టు సమాచారాన్ని ఏపీ, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఎన్ఐఏ ఉన్నతాధికారులకు చేరవేశారు. దాంతో ఇపుడు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టింది. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ నిఘాలో మ్యాజిక్ లాంతర్ అని సిరాజ్ ఏర్పాటుచేసిన సోషల్ మీడియా గ్రూప్ ఆకర్షించటంతోనే దానిపైన నిఘాపెట్టి విశ్లేషించారు. దాంతో మొత్తం వ్యవహారాలు, వ్యూహలు అన్నీ బయటపడ్డాయి. ఒక విధంగా మ్యాజిక్ లాంతర్ అనే సోషల్ మీడియా గ్రూపే సిరాజ్, సయ్యద్ ను పట్టించి బాంబుపేలుళ్ళు జరగకుండా అడ్డుకున్నదని చెప్పాలి.

తమ్ముడికి సంబంధంలేదు

తెలంగాణ, ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకు పట్టుబడిన సయ్యద్ సమీర్ అమాయకుడని అతని సోదరి ఆలియా చెబుతోంది. విజయనగరంలోని సిరాజ్ ఎవరో తన తమ్ముడు సయ్యద్ కు తెలియదని వాదిస్తోంది. ఇద్దరి మధ్యా ఉన్న స్నేహం, మొబైల్ చాటింగ్ లాంటి విషయలన్నీ అబద్ధాలే అని కొట్టిపాడేస్తోంది. తన తమ్ముడు లిఫ్ట్ మెకానిక్కుగా పనిచేస్తున్నాడని, అమాయకుడనే ఆలియా గట్టిగా చెబుతోంది.

Tags:    

Similar News