పీఆర్‌సీపై దద్దరిల్లిన మండలి
ఫిటెం్మట్ ఎంత ఇస్తారు.. పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేస్తారా లేదా అని బొత్స ప్రభుత్వాన్ని నిలదీశారు.
By : The Federal
Update: 2025-09-25 08:45 GMT
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పీఆర్‌సీపైన దద్దరిల్లింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. బకాయిల చెల్లింపులపై పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారని అధికారపక్షంపై ప్రతిపక్షం మండిపడింది. అధికార పక్షం నుంచి మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన రాజకీయ విమర్శలకు ఎల్వోపీ బొత్స సత్యనారాయణకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
శాసన మండలిలో గురువారం పీఆర్‌సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపులపై చర్చ జరిగింది. ప్రతిపక్షం నుంచి వైసీపీ సభ్యులు ఇజ్రాయేలు, కల్పలత రెడ్డిలు తొలుత మాట్లాడుతూ ఉద్యోగులకు నేటి వరకు పీఆర్‌సీ బకాయిలు చెల్లించలేదు. పీఆర్‌సీ చైర్మన్‌ను కూడా నియమించలేదు. దీని గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మంత్రేమో మాటను దాటవేస్తున్నారు. 2024లో కూటమిని నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ప్రతి పండగ నాడు డీఏల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డీఏలను పెండింగ్‌లో పెట్టింది. పెన్షనర్స్ ఒక్కొక్కరికి రూ. 15 లక్షల నుంచి రూ. 20లక్షల వరకు బకాయిలు పెట్టారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి బకాయిలను చెల్లించాలని, ఇప్పటి వరకు ఎంత వరకు చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనికి మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రూ. 21వేల కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మును గత ప్రభుత్వం వాడేసుకుందన్నారు. ప్రభుత్వ మార్పు కోసం 2024ఎన్నికల్లో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. 15వ తేదీ కల్లా జీతాలు వేస్తున్నాం కదా అంటూ గత ప్రభుత్వంలో ఓ మంత్రి మాట్లాడారని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఎల్వోపీ బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఒత్తిడి చేశారో తెలియదు కానీ పీఆర్‌సీ కమిషన్‌ను రద్దు చేశారు. కూటమి అదికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. ఇప్పటి వరకు పీఆర్‌సీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించలేదు. ఉద్యోగుల శ్రేయస్సును కోరే వారే అయితే ఇప్పటికే పీఆర్‌సీ కమిషన్‌ను నియమించే వారు. కానీ అది చేయలేదు. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాజకీయ సమాధానాలు చెబుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ మీద విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలు మారాయి. అటు వాళ్లు ఇటు వచ్చారు. ఇటు వాళ్లు అటు వెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని స్పష్టం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేస్తుందా లేదా, ఫిట్మెంట్ ఇస్తారా లేదా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అప్పులు మీద, ఖర్చుల మీద చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బొత్స మండలిలో సవాల్ విసిరారు. అనంతరం పీఆర్‌సీపై కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.