కేటీఆర్ కు హైకోర్టు బిగ్ షాక్

ఎంఎల్ఏల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం చెప్పటానికి సమయ పరిమితి విధించలేమని స్పష్టంగా ప్రకటించింది.

Update: 2024-11-22 08:42 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఎంఎల్ఏల అనర్హత కేసు విచారణలో శుక్రవారం తీర్పు చెప్పింది. ఎంఎల్ఏల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం చెప్పటానికి సమయ పరిమితి విధించలేమని స్పష్టంగా ప్రకటించింది. నాలుగు వారాల్లోగా స్పీకర్ ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై నిర్ణయం చెప్పాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్(High court) కొట్టేసింది. ఇంత సమయంలోగా ఫిరాయింపు ఎంఎల్ఏలపై నిర్ణయం తీసుకోవాలన్న గడువును కోర్టులు స్పీకర్ కు విధించలేవని చెప్పింది. అనర్హత ప్రకటనకు సంబందించి స్పీకర్ నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోబోమని చెప్పేసింది.

హైకోర్టు తాజా తీర్పుతో కేటీఆర్(KTR) తదితరులపై ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పునే డివిజన్ బెంచ్ కూడా సమర్ధిస్తుందని అనుకున్నారు. అందుకనే తొందరలోనే పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని, ఆ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) కచ్చితంగా గెలుస్తుందంటు కేటీఆర్, హరీష్ రావుతో పాటు చాలామంది నేతలు పదేపదే చెప్పారు. అందుకనే డివిజన్ బెంచ్ తీర్పు కేటీఆర్ ఆశలపై నీళ్ళుచల్లినట్లుగా అయిపోయింది. కోర్టుతీర్పుతో ఉపఎన్నికలు రావని తేలిపోయింది. తాజా తీర్పుతో ఫిరాయింపు ఎంఎల్ఏలు(Defection MLAs) ఫుల్లు ఖుషీగా ఉన్నారు. పదిమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలు కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే.

నిజానికి స్పీకర్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకునేందుకు లేదని కేటీఆర్ కు బాగా తెలుసు. స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయాల్లో కోర్టులు ఎట్టి పరిస్ధితుల్లోను జోక్యం చేసుకునేందుకు లేదు. ఈ విషయం గతంలో చాలాసార్లు నిర్ధారణ అయ్యింది. అంతెందుకు బీఆర్ఎస్ హయాంలో కూడా టీడీపీ(TDP), కాంగ్రెస్(Congress) కు చెందిన సుమారు 25 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలు, 4 ఎంపీలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఎంఎల్ఏల ఫిరాయింపుల మీద టీడీపీ, కాంగ్రెస్ కోర్టుల్లో కేసులు వేసినపుడు ఏమైంది ? ఏమీ కాలేదు.

ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హత విషయంలో అప్పట్లో జోక్యం చేసుకోని కోర్టు ఇపుడు మాత్రం ఎందుకు జోక్యం చేసుకుంటుంది ? ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తునే ఉన్నారు. అయినా సరే ఫిరాయింపుల మీద అనర్హత వేటుపడటం ఖాయం, ఆ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగటం ఖాయమని కేటీఆర్ కొన్ని వందలసార్లు చెప్పుంటారు. ఫిరాయింపుల అనర్హతపై కేటీఆర్ అన్నిసార్లు చెబుతుంటే అందరు ఏమోలే అనుకున్నారు. కోర్టు తీర్పుతో అనర్హత లేదు, ఉపఎన్నికలూ జరగవని స్పష్టంగా తెలిసిపోయింది.

Tags:    

Similar News