హైవేలపై హెవీ వాహనాలు బంద్
మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు, బస్సు సర్వీసులు రద్దుకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది.
మొంథా తీవ్ర తుపాను (Cyclone Montha) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు విధించింది. జాతీయ రహదారులపై భారీ వాహనాలు (ట్రక్కులు, లారీలు) మంగళవారం రాత్రి 7 గంటల నుంచి పూర్తిగా నిలిపివేయాలని సూచించింది. వాహనాలను ముందే సురక్షిత ప్రదేశాల్లో నిలుపుకోవాలని డ్రైవర్లకు హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని APSDMA అధికారులు స్పష్టం చేశారు. గాలులు, వర్షాలు, చెట్లు పడిపోవడం, రోడ్లపై నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
విజయవాడ పండిట్ నెహ్రు బస్టాండ్ లో తగ్గిన ప్రయాణికులు
నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ పండిట్ నెహ్రు బస్టాండ్ మొంథా తుపాన్ ప్రభావంతో ఒక్కసారిగా ప్రయాణికులు లేక వెలవెలబోయింది. మొంథా తుపాను ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో రోజుకు 400 బస్సు సర్వీసులు నడిచేవి. కానీ, మంగళవారం 139 బస్సు సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చింది. టికెట్ బుకింగ్స్ చాలా తగ్గింది. సాధారణ రోజులతో పోలిస్తే సగానికి సగం తగ్గాయి. దీంతో పాటుగా విజయవాడ నుంచి కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వెళ్లే బస్సులు పూర్తిగా రద్దు చేశారు. తుపాను ప్రభావం, భారీ వర్షాలు, రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున ఉన్నతాధికారుల సూచనల మేరకు మాత్రమే బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 1996 తుపాను సమయంలో భారీ గా నష్టం వాటిల్లిన ఈసారి ప్రాణ నష్టం జీరో అనే లక్ష్యంతో ప్రభుత్వం పూర్తి సన్నద్ధమైంది. అన్ని రకాల చర్యలు చేపట్టింది. ప్రజలు అధికారుల ఆదేశాలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.