అల్పపీడనం బలహీనపడినా..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కొనసాగుతోంది. గురువారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి.
By : Admin
Update: 2024-12-23 15:08 GMT
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరానికి సమీపంలోనే కేంద్రీకృతమై ఉండటం వల్ల ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. తీరం వెంబడి 30 కిమీ నుంచి 40కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం వల్ల ఏపీలో పలు ప్రాంతాల్లో గురువారం వరకు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడన ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కాగా ఈ నెల 16 నుంచి సముద్రంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పలుసార్లు విపత్తల నిర్వహణ సంస్థ తెలియజేసింది. సముద్ర తీరంలో చలితో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.