విశాఖను ముంచెత్తిన అకాల వర్షం
అకాల వర్షంతో విశాఖనగరం కాసేపు అల్లాడిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి.;
By : The Federal
Update: 2025-07-13 12:57 GMT
విశాఖపట్నం నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి కొద్దిసేపు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. 16వ వార్డు కేఆర్‌ఎం కాలనీలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహానికి రెండు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. అక్కయ్యపాలెం వీధులు వర్షం నీటితో పోటెత్తాయి. ఆ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఓ అరగంట సేపు మాత్రమే వర్షం పడినా వీధులన్నీ చిత్తడి చిత్తడిగా తయారయ్యాయి. ప్రస్తుతం పాక్షికంగా మేఘావృతమై ఉంది, ఉష్ణోగ్రత 31°C, తేమ కారణంగా 38°C లాగా అనిపిస్తుంది. గంటకు 5 మైళ్ల వేగంతో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.
రాత్రిపూట ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈవేళ మధ్యాహ్నం వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. పశ్చిమబెంగాల్ వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మెల్లిగా ఉత్తరాంధ్ర వైపు కదులుతోందని, దీనివల్ల అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణకేంద్రం తెలిపింది.