హైకోర్టు కార్యకలాపాలపైనా వరద ప్రభావం.. కొట్టుకుపోయిన వంతెన
ఆంధ్రప్రదేశ్ అంతటా వరదలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు అన్నీ పొంగిపొర్లుతున్నాయి. రాజధాని ప్రాంతంలో వరద ప్రభావం మరింత అధికంగానే ఉంది.
ఆంధ్రప్రదేశ్ అంతటా వరదలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు అన్నీ పొంగిపొర్లుతున్నాయి. రాజధాని ప్రాంతంలో వరద ప్రభావం మరింత అధికంగానే ఉంది. ఈ వరదల ప్రభావం హైకోర్టు కార్యకలాపాలపైన కూడా భారీగా పడి న్యాయస్థానం కార్యకలాపాలు స్తంభించాయి. ఈ కారణంగానే కోర్టుకు చేరుకున్న గంటకే న్యాయవాదులు, న్యాయమూర్తులు, కోర్టు అధికారులు, సిబ్బంది అంతా కూడా తిరిగి వెళ్లిపోయారు. భారీ వరదల నేపథ్యంలో హైకోర్టుకు సెలవులు ప్రకటించాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కాగా సెలవు ప్రకటించడానికి హైకోర్టు వర్గాలు ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో వాదనలకు ప్రత్యక్షంగా హాజరుకాలేని న్యాయవాదుల కేసులు కొట్టవేయబోమని, వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయబోమని హామ ఇచ్చాయి. దీంతో కాస్త ఆలస్యంగా అందరూ విధులు చేపట్టారు.
ఒకవైపు కేసుల విచారణ జరుగుతుండగా కరకట్ట వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న అంశాన్ని కోర్ట హాళ్లోకి వచ్చి రిజిస్ట్రార్లు నివేదించారు. వీలైనంత త్వరగా కోర్టు నుంచి వెళ్లడం మంచిదని కూడా సూచించారు. దీంతో విచారణలో ఉన్న కేసులను మంగళవారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తులు. అనంతరం హైకోర్టును విడిచి తిరుగు ప్రయాణం ప్రారంభించారు. వరద ఉధృతి మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందన్న సమాచారం మేరకు మంగళ, బుధవారాలు కేసుల విచారణను ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా చేపట్టాలని సీజే నిర్ణయించారు. అంతేకాకుండా హైకోర్టు న్యాయవాదులు నిర్వహించే ‘టీం స్వేచ్ఛ’ ఆధ్వర్యంలో వరద సహాయక చర్యలు చేపట్టారు.
కొట్టుకుపోయిన వంతెన
రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా మున్నేరు వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ వరద ఉధృతి వల్ల ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని లింగాల వంతెన కొట్టుకుపోయింది. దాదాపు కిలోమీటరు పొడవు ఉన్న ఈ వంతెన పలు చోట్ల పగుళ్లు వచ్చి ఉంది. ఇప్పుడు వరద వృధృతికి కాంక్రీట్ స్లాబులు కొట్టుకుపోయాయి. వంతెనపై ఇంకా కొన్ని చోట్ల పెద్ద గోతులు కూడా ఏర్పడ్డాయి. మరమ్మతులకు కూడా ఇది పనికిరాదని స్థానికులు అంటున్నారు. ఈ వంతెన కొట్టుకుపోవడంతో ఖమ్మం, జగ్గయ్యపేట మధ్య రాకపోకలు నిలికిపోయాయి. ప్రస్తుతం మున్నేరుకు 17 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. పోలంపల్లి డ్యామ్ దగ్గర నీటిమట్టం 10 అడుగులకు చేరింది. వరదల దెబ్బకు వత్సవాయి, లింగాల గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్లు కూడా ధ్వంసమయ్యాయి.