నాగార్జున సాగర్‌లోకి భారీగా వరద జలాలు

పెద్ద ఎత్తున శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది.;

Update: 2025-07-14 07:05 GMT

ఎగువ ప్రాంతాలలో కురుస్తున వర్షాల కారణంగా గత కొద్ది రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాజెక్టు నుంచి వరద నీరు శ్రీశైలం డ్యామ్‌కు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యామ్‌ నీటి మట్టం పెరుగుతోంది. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుతో పాటు సుంకేశుల ప్రాజెక్టు నుంచి దాదాపు 1,21,873 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీని వల్ల శ్రీశైలం డ్యామ్‌ నుంచి ఔట్‌ ఫ్లోతో పాటు ఇన్‌ఫ్లో కూడా పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి 1,15,611 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా ఉంది.

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి 20వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి మరో 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి మరో 33,047 క్యూసెక్కులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మరో వైపు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే గత కొద్ది రోజులుగా ఈ డ్యామ్‌లోకి వచ్చి చేరుతున్న వరద నీటి ప్రవాహం వల్ల శ్రీశైలం వదర నీటి మట్టం 883.20 అడుగులకు చేరుకుంది. మరో రెండు అడుగులు మాత్రమే మిగిలి ఉంది. దీంతోపాటుగా శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. అయితే వరద నీటి ప్రవాహం వల్ల అది 205.66 టీఎంసీలకు చేరింది.

Tags:    

Similar News