సాగర్‌కి భారీగా వరద నీరు
శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు అయితే.. వరద నీటి ప్రవాహం వల్ల అది 882.80 అడుగులకు చేరింది.;
శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన తెలంగాణ రాష్ట్రంలోని జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద ప్రవాహం శ్రీశైలం డ్యామ్‌కు వచ్చి చేరుతోంది. దాదాపు 1,75,233 క్యూసెక్కులు వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో పెరిగింది. సుమారు 1,70,347 క్యూసెక్కులుగా ఔట్ ఫ్లో ఉంది. తెలంగాణలోని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి మరో 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,237 క్యూసెక్కులు వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూడు స్పిల్‌వే గేట్లు ఎత్తి 81,195 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం 882.80 అడుగులకు చేరింది. దీంతో పాటుగా శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. అయితే వరద నీటి ప్రవాహం వల్ల ప్రస్తుతం అది సామర్థ్యానికి దగ్గర దగ్గరా చేరుకుంది. ప్రస్తుతం 203.42 టీఎంసీలకు చేరకోవడం గమనార్హం. శ్రీశైలం జలాశయానికి ఇదే విధంగా వరద నీటి ప్రవాహం కొనసాగితే నీటి మట్టంతో పాటు నీటి నిల్వ సామర్థ్యానికి మించే అవకాశం ఉంది.