ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద తాకిడి
శ్రీశైలం జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద నీటి ప్రవహం కొనసాగుతోంది.;
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా నదికి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీని వల్ల విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద తాకిడి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 70 గేట్లను ఎత్తగా వీటిల్లో 39 గేట్లను పూర్తిగాను, మరో 31 గేట్లను 8 అడుగుల మేర ఎత్తిన అధికారులు సుమారు 3,63,438 క్యూసెక్కుల నీటని సముద్రంలోకి వదులుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగినందు వల్ల బుధవారం ఉదయానికి సుమారు 2లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఐదు అడుగుల మేర ఐదు గేట్లను, నాలుగు మేర 64 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వదర నీటి ఉధృతి పెరుగుతున్న క్రమంలో బుధవారం సాయంత్రానికి 3లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి రావచ్చని అధికారులు అంచనా వేశారు. ఆ ప్రకారమే బుధవారం సాయంత్రానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రవాహం క్రమమంగా పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.