అక్కడ వారు ఆడిందే ఆట, పాడిందే పాట

ఎనిమిది రోజుల ఆంధ్రా అసెంబ్లీ సమావేశాలు హ్యాపీగా ముగిశాయి

Update: 2025-09-28 09:30 GMT

విపక్షం లేదు. అందరూ అధికార కూటమి వారే. వారు ఆడిందే ఆట, పాడిందే పాట. చివరకు సభకు సకాలంలో సభ్యులు అందరూ హాజరు కాని పరిస్థితి. స్పీకర్ జోక్యం చేసుకుని ఫోన్ లు చేసి పిలిపించుకోవాల్సిన దుస్థితి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు ఇదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన సభ సమావేశాలు జరుగుతున్నాయంటే ఏమి జరుగుతుందో, ఎవరు ఏమి మాట్లాడుతున్నారో ఆసక్తిగా ప్రజలు ఎదరు చూసే వారు. ఈ తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వరకు జరిగింది. ఆ తరువాత పరిస్థితులు మారాయి.

ప్రత్యేకించి అమరావతిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణాన్ని ఆనుకుని నిర్మించిన శాసన సభ, శాసన మండలి ప్రాంగణంలో ప్రారంభమైన అసెంబ్లీ, మండలి సమావేశాల్లో వ్యక్తిగత ద్వేశాలు, కక్షపూరిత వ్యాఖ్యలు, కుటుంబ సభ్యులను అవమానించడాలు, ఏకంగా ప్రతిపక్ష నాయకుడిగా గతంలో చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో బోరున విలపిస్తే, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సహచర ఎమ్మెల్యేలు ప్రస్తుత శాసన సభ సమావేశాలను పూర్తిగా బహిష్కరించారు. జనం ఈ విషయంలో ఏవిధంగా స్పందిస్తారని పాలక ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయో కాని, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చట్ట సభ తీరు ఏమాత్రం బాగోలేదనే విమర్శలు మేధావులు, సద్విమర్శకులు, రాజ్యాంగ పరిరక్షకుల నుంచి రావడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ నాల్గవ సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 27 వరకు ఎనిమిది రోజుల పాటు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్‌కాట్‌తో ప్రతిపక్షం లేని ఈ సమావేశాల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పెట్టుబడుల ఆకర్షణ, పాలనా సంస్కరణకు ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం శాసన సభ కార్యకలాపాలు 45.53 గంటలు జరిగాయి. రాజకీయ వివాదాలు, ప్రతిపక్ష డిమాండ్లు లేకపోవడంతో సమావేశాలు 'సాంకేతిక'గా ముగిసాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల ఆలస్యం, డుమ్మా కొట్టే వ్యవహారంపై కఠినంగా వ్యవహరించారు. జనసేన-బీజేపీ భాగస్వాముల ప్రశ్నలు మంత్రులపై కేంద్రీకృతమయ్యాయి.


సమావేశాల మొదటి రోజు నుంచే వైఎస్సార్సీపీ బాయ్‌కాట్‌తో సభ తీరు మారిపోయింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి 11 సీట్లు మాత్రమే లభించడంతో 'ప్రతిపక్ష నేత' పదవి రాకపోవడాన్ని కారణంగా చెప్పుకుని బాయ్‌కాట్ ప్రకటించారు. అసెంబ్లీలో 18 సీట్లు (మొత్తం 175లో 10%) అవసరమనే నియమం ప్రకారం ఈ డిమాండ్ ను స్పీకర్ తిరస్కరించారు. ఫలితంగా ప్రతిపక్ష ధ్వని లేకుండా బిల్లులు, తీర్మానాలు సులభంగా ఆమోదం పొందాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జగన్ రాకపోతే సభ్యత్వం కోల్పోవచ్చని హెచ్చరించారు. కానీ బాయ్‌కాట్‌ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ బాయ్‌కాట్ ప్రభుత్వానికి అవకాశమైనప్పటికీ, డెమోక్రటిక్ చర్చల లోపాన్ని హైలైట్ చేస్తోంది. ఎలాంటి వాకౌట్లు జరగకపోయినా, ప్రతిపక్షం లేకపోవడం సమావేశాలను 'ఏకపక్షం'గా మార్చింది.

ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు, తీర్మానాలు సమావేశాల ముఖ్య ఆకర్షణ. 23 బిల్లులు పాస్ అయ్యాయి. అందులో ఆంధ్రప్రదేశ్ వాహనాల పన్ను (సవరణ) బిల్ 2025. వాహనాలపై గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించి వాణిజ్య వాహనాలకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు ఫీజు నిర్ణయించారు. రెండవది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (సవరణ) బిల్, 3వది షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ (సవరణ) బిల్, 4వది బెగింగ్ ప్రివెన్షన్ (సవరణ) బిల్, కుష్టురోగులకు వివక్ష భాషను తొలగించారు. 5వది ఫ్యాక్టరీస్ (సవరణ) బిల్. పని గంటలు పెంచి మహిళల భద్రతకు ప్రాధాన్యత. మూడు పాత బిల్లులు (2019) ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, లేబర్ లా సవరణలు డ్రాప్ చేశారు.

క్యాబినెట్ 13 కొత్త ప్రతిపాదనలు ఆమోదించింది. భవనాల రెగ్యులరైజేషన్, భూమి మార్పిడి ఆర్డినెన్స్ రద్దు, మున్సిపల్ అబాన్ డెవలప్‌మెంట్ బిల్లులు, ఆక్వాకల్చర్, GST సవరణలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడల వారికి నియామకాలు వంటివి ఉన్నాయి. తీర్మానాల్లో పెట్టుబడులు (రూ.10 లక్షల కోట్లు), విద్య-ఆరోగ్యం, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు. అయితే సమాధానం చెప్పని ప్రశ్నలు ఎక్కువగా జనసేన-బీజేపీ నుంచి వచ్చాయి. మంత్రులపై ప్రశ్నలు (ఉదా. మెడికల్ కాలేజీల PPP మోడల్‌పై కౌన్సిల్ వాకౌట్) ఆలోచనాత్మకంగా లేకపోవడం వివాదాస్పదం.

సభా సమయం, చర్చల తీరు గురించి చూస్తే... చర్చలు ప్రభుత్వ సాఫల్యాలపై కేంద్రీకృతమై, విపక్షం లేకపోవడంతో డిబేట్‌లు పరిమితమయ్యాయి. సభ జరిగిన తీరు 'సామాన్య'గా ఉంది. కానీ ఎమ్మెల్యేలు ఆలస్యంగా వచ్చి మధ్యలో లేచి పోవడం సమస్య. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై సీరియస్‌గా స్పందించారు. "ఎమ్మెల్యేలు సమయానికి రాకపోతే, సభ ముందు లేకుండా వెళ్లిపోతే పార్టీకి నష్టం" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసభాపతి, విప్‌లను తప్పు పట్టి, పూర్తి హాజరు బాధ్యత విధించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ మంత్రులపై సభ్యులు ప్రశ్నలు వేసి కూటమి ఐక్యతను పరీక్షించారు. ప్రధానంగా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారు.

ఈ సమావేశాలు ప్రభుత్వానికి 'ఫ్రీ పాస్'గా మారాయి. 23 బిల్లులు, తీర్మానాలు ఆమోదం కావడం డెవలప్‌మెంట్ ఫోకస్‌ను చూపిస్తుంది. కానీ డెమోక్రటిక్ లోపాలు లేవనెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ బాయ్‌కాట్ ఎలాంటి వాకౌట్లు లేకపోయినా, ప్రతిపక్షం లేకపోవడం చర్చలను బలహీనపరుస్తోంది. చంద్రబాబు కఠినత్వం కూటమి డిసిప్లిన్‌ను బలోపేతం చేస్తుంది. కానీ ఎమ్మెల్యేల 'డుమ్మా' వ్యవహారం భవిష్యత్ సవాళ్లకు సంకేతం. మండలిలో ప్రతి రోజూ బిల్లులపై రచ్చ జరుగుతూనే ఉంది. సమగ్రమైన చర్చ లేకుండా ఏ బిల్లునూ ఆమోదించ లేదు. మొత్తంగా ఈ సమావేశాలు ప్రభుత్వ 'పెర్ఫార్మెన్స్ రిపోర్ట్'గా మారాయి. కానీ వాస్తవ చర్చల లోపం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. రానున్న స్థానిక ఎన్నికల ముందు ఈ 'ఏకపక్షత' ప్రభుత్వానికి ఎంతవరకు లాభదాయకమో చూడాలి.

Tags:    

Similar News