బోనస్ పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందా ?

బోనస్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులు, ఉద్యోగులను మోసం చేసిందని మండిపోయారు.

Update: 2024-09-22 09:11 GMT

సింగరేణి కార్మికులు, ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ అంతా మోసమేనా ? అవునని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు బోనస్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులు, ఉద్యోగులను మోసం చేసిందని మండిపోయారు. సంస్ధకు వచ్చిన లాభాల్లో 33 శాతం బోనస్ రూపంలో పంపిణీ చేసినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన ప్రకటన అబద్ధమన్నారు. ఎందుకంటే లాభాల్లో సంస్ధ యాజమాన్యం బోనస్ రూపంలో పంపిణీ చేసింది 16.2 శాతం మాత్రమే అన్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతు సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు బోనస్ గా తలా రు. 1.90 లక్షలు అందించినట్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. నిజంగానే లాభాల్లో 33 శాతం బోనస్ ఇస్తే ఇవ్వాల్సింది రు. 1.90 లక్షలు కాదని రు. 3.70 లక్షలన్నారు. రు. 4701 కోట్లు లాభాలు వచ్చినట్లు భట్టి చెప్పిందే నిజమైతే 33 శాతం బోనస్ అంటే తలా రు. 3.7 లక్షలు పంపిణీ జరగాలి కదా అని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు రు. 102 కోట్లు బోనస్ పంచినట్లు చెప్పారు. 2018-19లో సంస్ధకు రికార్డుస్ధాయిలో లాభాలు వస్తే ప్రతి కార్మికుడికి ప్రభుత్వం లక్ష రూపాయలు బోనస్ ఇచ్చిందన్నారు.

2023లో సంస్ధలోని ఉద్యోగులు, కార్మికులకు రు. 1.6 లక్షలు బోనస్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ప్రకటించిందే అసలైన బోనస్ అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇపుడు ప్రకటించింది బోనస్ కాదని బోగస్ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ ను సింగరేణి బెల్ట్ గెలిపిస్తే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదేనా అని నిలదీశారు. సింగరేణిని బీజేపీ ప్రైవేటీకరించాలని చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోందని మండిపోయారు. కార్మికులకు అండగా నిలిచేది ఎప్పటికైనా బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ చెప్పారు.

Tags:    

Similar News