'జగన్ రాక'తో' చిత్తూరు మామిడి 'చిత్రం మారిందా'!

ఆంక్షల మధ్య బంగారుపాలెం వైసీపీ ఎపిసోడ్ సక్సెస్. టీడీపీలో కలవరం.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-10 00:30 GMT
జగన్ కోసం వచ్చని జనంతో కిక్కిరిసిన బంగారుపాలెం. (ఇన్ సెట్య ) రైతులతో మాట్లాడుతున్న జగన్

చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన వైసీపీలో ఉత్సాహం నింపింది. అధికార టిడిపి కూటమిలో ప్రకంపనలు

సృష్టించింది. పోలీసుల ఆంక్షలు వైసిపి వ్యూహాత్మక ఎత్తుగడలు వేయడానికి పాఠాలు నేర్పింది. అంచనాలను పటాపంచలు చేస్తూ, వైసిపి మద్దతుదారులు తరలిరావడం టిడిపికి మింగుడు పడిన పరిస్థితి ఏర్పడింది.

రాయలసీమలో ఒక సామెత ఉంది
"మొండి చేతుల వాడికి నూగులు తినడం నేర్పించినట్లు" భవిష్యత్తులో కూడా ఆటంకాలు ఏర్పడితే ఎలాంటి ఎత్తులు వేయాలనేది ఓ పాఠంగా నాయకులకు నేర్పినట్లు పరిశీలకుల భావిస్తున్నారు. మొత్తానికి టీడీపీ కూటమిని వైసీపీ డిఫెన్స్ లో పడేసిందని చెప్పకతప్పదు.
"మామిడి ధరపై కేంద్రాన్ని ఒప్పించి, రైతులకు మేలు చేసినా.. ఆ విజయం వైసీపీ ఖాతాలోకే" పడే అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు పొలిటికల్ మైలేజ్ కోసం ఏమి చేస్తారు? రైతుల కోసం ఏమి చేయబోతున్నారనే విషయంలో కూడా ఆసక్తి ఏర్పడింది. దీనికి దారితీసిన పరిస్థితిని పరిశీలిద్దాం.

బంంగారుపాలెం మార్కుట్ యార్డు వద్ద వైసీపీ శ్రేణులు

చెన్నై-బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే లో ఉన్న బంగారుపాలెం వద్ద మామిడి మార్కెట్ యార్డులో రైతులను పరామర్శించడానికి వైఎస్. జగన్ బుధవారం వచ్చారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ అంచనాలకు మించి వైసిపి నాయకులు క్యాడర్ తరలివచ్చింది. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేకి సమాంతరంగా ఉన్న సర్వీస్ రోడ్డులో వాహనాలు వెళుతుంటే, ఎన్ హెచ్ తో పాటు బంగారుపాలెం మొత్తం వైసీపీ శ్రేణులతో కిటకిటలాడింది.
ఆంక్షలు ఉన్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో జనం రావడంతో టిడిపి నేతలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది.
బంగారుపాలెం అందులో భాగంగా ఉన్న పూతలపట్టు తో పాటు సమీపంలోని చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, చంద్రగిరి తో పాటు టిడిపికి కంచుకోటలు. కుప్పం ప్రాంతం నుంచి కూడా భారీ స్థాయిలో వైసిపి మద్దతుదారులు తరలివచ్చారు. దీంతో వైసీపీ సత్తా చాటింది. అధికార పార్టీకి ఇది ఇబ్బందికరంగా మారినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఎపిసోడ్లో ధరలు లేక దగా పడిన మామిడి రైతులను జగన్ పరామర్శించడం అనే అంశం వైసిపి బలం చాటడానికి చక్కగా ఉపయోగపడినట్లు కనిపిస్తోంది.
అందుకు నిదర్శనం..

బంగారుపాలెం శివారులోని జాతీయ రహదారిపై హెలిపాడ్ నుంచి మామిడి మార్కెట్ యార్డ్ వరకు సుమారు ఏడు కిలోమీటర్ల వరకు వెంటతో కిక్కిరిసింది. జగన్ కాన్వాయ్ వెంట కూడా వేలాదిగా కదిలారు. దారి పొడవున భారీగా జనం బారులు తీరారు. మార్కెట్ యార్డు వద్ద పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది.
బంగారుపాలెం మార్కెట్ యార్డు వద్ద దాదాపు 200 మందితో బందోబస్తు ఏర్పాటు చేసిన కట్టలు తెగిన ఉత్సాహం వైసీపీ శ్రేణులను గోడలు, ముళ్ళకంచెలను దాటుకుని మరీ వెళ్లడం కనిపించింది. వారిని నియంత్రించడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు. దాదాపు 70 ఎకరాల్లో ఉన్న మార్కెట్ యార్డు, వెలుపల రోడ్డుపై జనంతో నిండిపోయింది.
రాష్ట్రంలో మిర్చి, పొగాకు, టమాటా, మామిడి కాయలకు గిట్టుబాటు ధర కల్పించడంలో టిడిపి కూటమి వైఫల్యం చెందిందని వైసిపి నిరసనలకు దిగింది. గుంటూరు, ఒంగోలు పర్యటనలు ఇచ్చిన స్ఫూర్తితో వైఎస్. జగన్ చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరామర్శకు కార్యక్రమం ఖరారు చేశారు.
అప్రమత్తమైన టిడిపి కూటమి ప్రభుత్వం ఆంక్షలకు తెరతీసింది.
"హెలిపాడ్ వద్ద 30 మంది, మార్కెట్ యార్డులో 500 మందిని మాత్రమే అనుమతిస్తాం" అని అనంతపురం రేంజ్ డీఐజీ షేమోషి వాజ్పేయి, చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు, కూడా ప్రకటించారు. దీంతో వైసిపి అధ్యక్షుడు జగన్ పర్యటనలకు మొదటి నుంచి ప్రతిబంధకాలు కల్పిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు భావించారు.
వ్యూహాత్మక కార్యాచరణ
చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరామర్శకు వచ్చే జగన్ పర్యటన కోసం వైసీపీ కీలక నాయకులు కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లా మొత్తంపై నాయకులు తరలివచ్చారు. పార్టీ క్యాడర్ను కూడా అంతర్గతంగా సిద్ధం చేశారు.
పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం వద్ద ఉన్న మార్కెట్ యార్డుకు పార్టీ శ్రేణులను వైసిపి నాయకులు సమీకరించిన తీరు అధికార పార్టీకి మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది.
చిత్తూరు జిల్లాలోని పడమటి తాలూకాల్లో పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకా రెడ్డి మాత్రమే వైసిపి ఎమ్మెల్యేగా గెలిచారు.
కుప్పం, పలమనేరు, చంద్రగిరి, చిత్తూరు, జీడి నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ నియోజకవర్గాలన్నిటికీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమన్వయం చేసే బాధ్యతలు మోస్తున్నారు.
ఇంతకీ ఏం చేశారు..

ys జగన్ పర్యటన నేపథ్యంలో ఎక్స్ప్రెస్ హైవే ని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. కుప్పం నుంచి పలమనేరు మీదుగా చిత్తూరుకు వెళ్లి ప్రధాన రహదారి తో పాటు మదనపల్లి మార్గాన్ని కూడా దిగ్బంధం చేశారు. అంతర్గత రోడ్ల వద్ద బారికేడ్లు ఉంచి పోలీసుల పహారా ఉంచారు. జన సమీకరణ చేస్తున్నారనే కారణంగా వైసిపి లో ప్రజలను ప్రభావితం చేయగలిగిన 1200 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకొంతమందికి నోటీసులు జారీ చేశారు.
వైసిపి పైఎత్తు
తమ పార్టీ అధినేత జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి వైసిపి కీలక నాయకులు బాధ్యతలను వికేంద్రీకరించుకున్నారు. కుప్పంలో వైసిపికి సారథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ భరత్, ఆ పార్టీ పలమనేరు నాయకుడు రాకేష్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ, చిత్తూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందిన విజయానంద రెడ్డి, పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచర వర్గం, పూతలపట్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పార్టీ క్యాడర్ను సమీకరించడంలో కీలకంగా వ్యవహరించినట్లు వైసిపి వర్గాల సమాచారం. దీనికి వేలమందిని సమీకరించడం టార్గెట్ పెట్టుకున్నారు. ఆ అంచనాలకు మించి ఐదు నియోజవవర్గాల నుంచి తీవ్ర నిర్బంధం అమలు చేసినా, 40 వేల మందికి పైగానే వచ్చి ఉండవచ్చనేది ఓ అంచనా.
రూట్ మార్చారు..
పార్టీ క్యాడర్, జగన్ అభిమానుల కోసం వాహనాలు ఉంచితే పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పవని భావించిన వైసీపీ నాయకులు బస్సులను రవాణా సాధనంగా వాడుకోవాలని ప్రయత్నించారు. వాహనాలకు పెట్రోల్ డీజిల్ నింపకుండా పెట్రోల్ బంకుల వద్ద పోలీస్ పహారా ఏర్పాటు చేశారు.
పోలీసుల చర్యలను గమనించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాల్లో అడ్డదారుల గుండా పలమనేరుకు చేరుకున్నారు.
మామిడితోటలతో నష్టపోయిన అనేకమంది పూతలపట్టు నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాల నుంచి నడక మార్గంలో కూడా వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నిర్బంధం అమలు చేసినప్పుడు దానిని ఎలా తిప్పి కొట్టాలనేది మొదటిసారి వైసీపీ చిత్తూరు జిల్లాలో అమలు చేసిన తీరు పోలీసులను కూడా నివ్వరపోయేలా చేసింది.
బంగారుపాలెం కు రావడానికి అటు చిత్తూరు, కుప్పం పలమనేరు నుంచి కూడా అడవుల మధ్య ప్రయాణం ఉంటుంది. ఆ మార్గాల్లో అడ్డదారుల్లో కూడా పార్టీ క్యాడర్ బైకులు, నడక మార్గంలో ఎన్హెచ్ పైకి చేరుకున్న తీరు చూసిన పోలీసులు అవాక్కయ్యారు.
"ఆంక్షలు అమలు చేసే కొద్దీ పార్టీ క్యాడర్, జగనన్న అభిమానుల్లో మరింత కసి పెంచుతున్నారు " అని వైసిపి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అనుసరించే విధంగా పార్టీ మరింతగా బలపడుతోంది. సరైన సమయంలో దీటైన సమాధానం చెబుతామని అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో వ్యాఖ్యానించారు.
కర్తవ్యం ఏమిటి
"చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం సరిగా లేదు" అనేది చిత్తూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయం.
ఈ పరిస్థితి వైసీపీకి అనుకూలంగా మారింది అని కూడా ఆ జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు.
ఆంక్షలు మధ్య కూడా వైఎస్. జగన్ పర్యటన ఊహించని విధంగా విజయవంతం కావడంపై టీడీపీ కూటమిలో కలవరం బయలుదేరినట్లు ఆ పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది.
జగన్ పరామర్శ యాత్ర జరిగిన బంగారుపాలెం పూతలపట్టు నియోజకవర్గం లోనే ఉంది. ఈ సెగ్మెంట్ తో పాటు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నీ టిడిపి అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
టిడిపికి ఇంత పట్టు ఉన్న ప్రాంతంలో వైసిపి పరామర్శ కార్యక్రమం విజయవంతం కావడం జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు.
"పార్టీ చీఫ్, సీఎం ఎన్ చంద్రబాబు నుంచి ఎలాంటి అక్షింతలు పడతాయో"? అని కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు టిడిపి వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
వైసీపీకి బంగారుపాలెంలో అలాగే, మామిడి రైతుల నుంచి లభించిన ఆదరణ మద్దతు ధర సమస్య వల్ల ఆధారంగా వచ్చిందా? లేదంటే ఇది టిడిపి కూటమిపై వ్యతిరేకతను మరింతగా ఎత్తిచూపుతోందా? అనే విషయంపై కూడా జిల్లాలో చర్చ ప్రారంభమైంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు లేకపోవచ్చు. కానీ, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి రైతుల ఆవేదన రూపంలో బయటపడినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కు, కీలక నేతగా ఉన్న పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇది మంచి బ్రేకప్ గా భావిస్తున్నారు.

జగన్ పై ఉన్న అభిమానం ఇలా చెట్టెక్కించింది.

జగన్ పర్యటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హుషారు నింపింది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
"మామిడి ధరల విషయమై టిడిపి కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది వైసీపీకి ప్లస్ పాయింట్"గా మారే అవకాశం ఏర్పడింది. ఈ ఉత్సాహంతో మరింతగా వైసిపి క్యాడర్ జోరు పెంచే అవకాశం లేకపోలేదు. చిత్తూరు జిల్లా మామిడి రైతుల ఎపిసోడ్ ఏ పార్టీకి కీలకంగా మారుతుంది అనేది వేసి చూడాలి.

Similar News