కేటీఆర్ అక్కసంతా బయటపడిందా ?
రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బాగా కోపముందన్న విషయం తెలుసుకాని మరీ ఇంత మంటుందన్న విషయం ఇపుడే బయటపడింది;
రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బాగా కోపముందన్న విషయం తెలుసుకాని మరీ ఇంత మంటుందన్న విషయం ఇపుడే బయటపడింది. విషయం ఏమిటంటే పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్(KTR) మాట్లాడుతు ప్రాజాపాలన అంటే రేవంత్ రెడ్డి(Revanth) దృష్టిలో ఓట్లవేటేనా అంటు ఎద్దేవాచేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel accident) ప్రమాదంలో ఎనిమిదిమంది ప్రాణాలు గాలిలో ఉంటే సమీక్షించకుండా ఎంఎల్సీ ఎన్నికల ప్రచారానికి రేవంత్ వెళ్ళటం ఏమిటని నిలదీశారు. ఓట్లుఅడిగేందుకు రేవంత్ కు టైం ఉందికాని ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆర్తనాదాలతో మిన్నంటుతున్న ప్రాంతానికి వెళ్ళే సమయం మాత్రం రేవంత్ కు లేదా అని ప్రశ్నించారు. టన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ తెలియని పరిస్ధితుల్లో ఉంటే రేవంత్ మాత్రం ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో ముణిగిపోవటం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.
పై ఆరోపణలు, మండిపాటు చూస్తేనే రేవంత్ అంటే కేటీఆర్లో మంట ఏ స్ధాయిలో పెరిగిపోతోందో అర్ధమవుతోంది. ఎందుకంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై రెగ్యులర్ గా రేవంత్ సమీక్షిస్తునే ఉన్నాడు. స్పాట్ కు రేవంత్ వెళ్ళకపోయినా నిరంతరం సహయచర్యలు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తునే ఉన్నాడు. ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క(Bhatti vikramarka), మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam), జూపల్లి కృష్ణారావు(Jupalli) టన్నెల్ దగ్గరే క్యాంపు వేసున్నారు. నిజానికి టన్నెల్ దగ్గర ఇపుడు మంత్రులుండి కూడా చేసేదేమీలేదు. సహాయచర్యలు చేస్తున్న, పర్యవేక్షిస్తున్న వివిధ శాఖల నిపుణులకు మంత్రులు ఒకరకంగా అడ్డంకనే చెప్పాలి. ఎలాగంటే టన్నెల్లోపల చిక్కుకుపోయిన 8మందిని సురక్షితంగా బయటకు తీసుకురావటం అన్నది నూరుశాతం సాంకేతిక అంశంతో కూడిన ప్రయత్నం. ఈ విషయంలో మంత్రులకు ఎలాంటి నాలెడ్జీ లేదు.
అందుకనే మంత్రులు అక్కడ ఉండి చేసేదేమీ లేకపోగా నిపుణులకు అడ్డంకి అన్నది. మంత్రులే అక్కడ అనవసరమని అనుకున్నపుడు ఇక రేవంత్ అక్కడకు వెళ్ళి చేసేదేముంటుంది ? రేవంత్ టన్నెల్ దగ్గరకు వెళ్ళటం వల్ల ఎలాంటి ఉపయోగంలేకపోగా కొద్దిగంటల పాటు సహాయచర్యలకు తీవ్రమైన ఆటకం ఏర్పడుతుంది. రేవంత్ అక్కడకు చేరుకోగానే మొత్తం యంత్రాంగంతో పాటు రాజకీయ యంత్రాగం అంతా రేవంత్ దగ్గరే ఉంటుంది. దీనివల్ల సహాయకచర్యలకు కచ్చితంగా అడ్డంకులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని ఆలోచించే బహుశా రేవంత్ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళకుండా ఫోన్ ద్వారా సమీక్షిస్తున్నారు. మంత్రులు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళారంటే ఘటన జరిగింది నల్గొండ(Nalgonda District)-మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోనే, ఇద్దరు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నల్గొండ జిల్లా వారే కాబట్టి. పైగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏదైనా ఉంటే ఆలస్యం లేకుండా వెంటనే అక్కడినుండే సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకోవటానికి మంత్రులకు తోడు ఉపముఖ్యమంత్రి భట్టి కూడా అక్కడే ఉన్నారు.
ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ పోటీచేస్తున్న మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ సీటును గెలిపించుకోవాల్సిన బాధ్యత రేవంత్ మీదుంది. ఈ సీటులో కాంగ్రెస్ అభ్యర్ధి గెలవటం వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వపరంగా అయినా రేవంత్ కు చాలా కీలకం. అందుకనే ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు. టన్నెల్ ఘటనలో రేవంత్ కే సీరియస్ నెస్ లేకపోతే ఇక యంత్రాంగానికి ఏముంటుందని కేటీఆర్ ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. రేవంత్ దగ్గర లేకపోయినా వివిధ శాఖల నిపుణులంతా నిద్రాహారాలు మానేసి మూడురోజులుగా టన్నెల్ లోపలకు వెళ్ళే మార్గంగురించి ఆలోచిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఇప్పటికే మూడు, నాలుగుసార్లు ప్రమాదం జరిగిన12-14వ కిలోమీటర్ దగ్గరకు వెళ్ళేందుకు, ప్రమాదంలో చిక్కుకుపోయిన వారితో మాట్లాడేందుకు నిపుణుల బృందాలు ప్రయత్నించిన విషయం కూడా అందరికీ తెలుసు. ఈ విషయాలేవీ కేటీఆర్ కు తెలీక కాదు ఏదో మిషతో రేవంత్ మీద ఆరోపణలు గుప్పించాలి, రేవంత్ ను తప్పుపట్టాలన్న అక్కసు మాత్రమే కనబడుతోంది.