గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలి

కేసీ కెనాల్ ఆయకట్టుకు భరోసా కల్పించాలంటే గండ్రేవుల రిజర్వాయర్ తప్పనిసరి.;

Update: 2025-04-20 01:44 GMT
గండ్రేవుల ప్రాజెక్టు కోసం ధర్నా నిర్వహిస్తున్న రాయలసీమ రైతులు

నూటా యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన కేసీ కెనాల్ ఆయకట్టు పరిరక్షణ కొరకు తక్షణమే గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అద్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాయలసీమ సాగునీటి సాధన సమితి అనుబంధ సంస్థ గుండ్రేవుల సాధన, కేసీ కెనాల్ పరిరక్షణ సమితి ఆళ్ళగడ్డ నియోజకవర్గ కన్వీనర్ జాఫర్ రెడ్డి ఆద్వర్యంలో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ శనివారం ఆళ్ళగడ్డ మండల తహశీల్దారు కార్యాలయం దగ్గర పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ డచ్ కంపెనీ వారు జల రవాణా కోసం ఏర్పాటు చేసుకున్న కే సి కెనాల్ (కర్నూలు కడప కాలువ) తదనంతరం బ్రిటిష్ ఇండియాలో సాగునీటి ప్రాజెక్టుగా మారిన విషయం తెలియజేశారు. కేసి కెనాల్ కు తుంగభద్ర నదిపై సుంకేసుల వద్ద ఉన్న 1.2 టిఎంసీల సామర్థ్యంతో ఉన్న బ్యారేజ్ నుంచి నీటి విడుదల జరుగుతోందన్నారు.


కర్నూలు కడప జిల్లాలో సుమారుగా రెండు లక్షల 75 వేల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్, రబీ సీజన్లలో సాగునీరు, లక్షలాది మందికి సాగునీరు అందిస్తున్న కేసీ కెనాల్ కు 39.9 టిఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల వర్ష దినాలు తగ్గడం, కుండపోతగా వర్షాలు పడుతుండటం వలన అధిక సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలిపారు.

రిజర్వాయర్ల సామర్థ్యం తగినంతగా లేకపోవడం వల్ల 15 సంవత్సరాలుగా సాగునీటి సలహా మండలి సమావేశాల్లో కేసీ కెనాల్ కు ఏ రోజు నుంచి నీరు విడుదల చేస్తారో తెలుపుతున్నారు గానీ, ఏ రోజు వరకు నీరు విడుదల చేస్తారో చెప్పడం లేదన్నారు. తుంగభద్ర నదిలో నీరు ఉన్నంతవరకు కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరిస్తామని సాగునీటి సలహా మండలి సమావేశాలలో తీర్మానాలు చేయడం కేసి కెనాల్ ప్రాజెక్టు దుస్థితిని తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి రైతులు ఏ పంటలు వేసుకోవాలో, ఎంతవరకు నీళ్లు వస్తాయో, తమ పంటలు పండుతాయో లేదో అన్న మనోవేదన రైతులకు గురిచేస్తోందన్నారు.

ఈ నేపథ్యంలో కేసీ కెనాల్ ఆయకట్టుకు భరోసా కల్పించడానికి 20 టిఎంసీల సామర్ధ్యంతో గుండ్రేవుల వద్ద రిజర్వాయర్ నిర్మించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అలుపెరుగని పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే సమగ్ర ప్రాజెక్టు నివేదికకు అనుమతులు సాధించిన విషయాన్ని బొజ్జా గుర్తు చేసారు. రాష్ట్ర విభజన అనంతరం 2018 లో కర్నూలు నుంచి గుండ్రేవుల వరకు 2 రోజుల పాదయాత్రను నిర్వహించి ఈ రిజర్వాయర్ నిర్మాణానికి పాలకులపై ఒత్తిడి తేవడం, తదనంతరం ప్రభుత్వం 2019లో ఈ ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చి శంకుస్థాపన కూడా చేసిందనీ, కానీ ప్రాజెక్టు పురోగతిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సంవత్సరం 80 లక్షల ఎకరాల ఆయకట్టుకు సరిపడే కృష్ణా జలాలను సముద్రం పాలు చేసాం. ఇదే సందర్భంలో 80 వేల ఎకరాల కేసీ కెనాల్ ఆయకట్టు పంటలు చివరి దశలో ఎండిపోయే పరిస్థితి వస్తే రైతులు అధికారుల, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ, తమ పంటలను కాపాడండి అంటూ దీనంగా వేడుకున్న పరిస్థితిని చూశాం. కృష్ణా జలాల సంరక్షణ, సద్వినియోగం అత్యంత కీలకం అనే విషయాన్ని ఈ పరిస్థితి తెలియజేస్తోందన్నారు.

ప్రపంచ వారసత్వ సాగునీటి నిర్మాణంగా గుర్తింపబడిన కేసీ కెనాల్ పరిరక్షించకోవడం మనందరి బాధ్యతనీ.. ఈ ప్రాంత ఆర్థిక, సామాజిక, అభివృద్ధికి కీలకమైన కేసీ కెనాల్ పరిరక్షణకు గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతతో ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందనీ, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణ ఆవశ్యకతను గుర్తించి తక్షణమే కార్యాచరణ చేపట్టి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి బొజ్జా దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేసారు.

ధర్నా అనంతరం ఆళ్ళగడ్డ మండల డిప్యూటీ తహశీల్దారు బ్రహ్మయ్య గారికి వినతి పత్రాన్ని అందచేసారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దారు మాట్లాడుతూ రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెల్తామని తెలిపారు.

ఈ ధర్నా కార్యక్రమంలో గుండ్రేవుల సాధన సమితి నాయకులు రంగేశ్వరరెడ్డి, మల్లిఖార్జున రెడ్డి, పెద్ద లక్ష్మిరెడ్డి, బారెడ్డి నారాయణరెడ్డి, బత్తుల నాగేశ్వరరావు, సిద్ది సత్యం, వీరగంధం పూర్ణయ్య, బాలసుబ్బారెడ్డి, చిన్న వలి, జి.వెంకటసుబ్బారెడ్డి మరియు ఆళ్ళగడ్డ నియోజక వర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు

Tags:    

Similar News