TIRUMALA | తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శన కోటా టోకెన్లు ఇంకొన్ని గంటల్లో (సోమవారం వేకువజాము) జారీ చేయనున్నారు. దీనికోసం టీటీడీ మార్గదర్శకాలు జారీ చేసింది.;
By : SSV Bhaskar Rao
Update: 2024-12-01 13:42 GMT
తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనానికి ప్రాధాన్యం ఇచ్చింది. టీడీపీ కూటమి, టీటీడీ పాలక మండలి ఏర్పడిన తరువాత సోమవారం (డిసెంబర్ 2న) వేకువజామున మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు టోకెన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతిలో 2,500 మందికి, తిరుమలలో 500 మందికి ఉచిత దర్శనానికి సంబందించి టోకెన్లు జారీ చేస్తారు. దర్శనం తరువాత యాత్రికుడికి ఒక చిన్నలడ్డూ ఉచితంగా అందిస్తారు.
ఈ టోకెన్లు తీసుకున్న వారికి మంగళవారం (డిసెంబర్ 3న) తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ నెల 18వ తేదీ టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి గతంలో అమలు చేసిన ఈ పద్ధతిని పునరుద్ధరిస్తూ, నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టోకెన్ల కోసం రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల పరిమిత సంఖ్యలో మూడు వేల మందికి టికెట్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.
టోకెన్ల జారీ కేంద్రాలు
1. తిరుపతిలోని మహతి ఆడిటోరియం
2. తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారు.
ఎవరికి ఇస్తారంటే
1. తిరుపతి నగరం
2. తిరుపతి రూరల్ మండలం
3. చంద్రగిరి మండలం
4. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండలాల వారిని టీటీడీ స్థానికులుగా పరిగణించింది.
టోకెన్ల జారీకి మార్గదర్శకాలు
తిరుపతి స్థానికులు శ్రీవారి ఉచిత దర్శనానికి సంబంధించి టోకెన్లు జారీ చేయడానికి టీటీడీ మార్గదర్శకాలు ప్రకటించింది. అందులో టోకెన్లు తీసుకున్న యాత్రికులు..
- తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఫుట్ పాత్ హాల్ (దివ్య దర్శనం) క్యూ నుంచి దర్శనానికి అనుమతిస్తారు.
- తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ లో 500 టోకెన్లు (ఉదయం 3 నుంచి ఉదయం 5 గంటల మధ్య) జారీ చేయనున్నారు.
- ముందుగా వచ్చినవారికి తొలి ప్రాధాన్యతతో టోకెన్లు కేటాయిస్తారు.
- దర్శన టోకెన్ తీసుకోవాడానికి స్థానికులు ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి.
- టోకెన్లు తీసుకున్న భక్తులు దర్శన సమయంలో తిరుమలలో నిర్దేశించిన కౌంటర్ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలి.
- ఇతర దర్శనాల్లో ఇచ్చేవిధంగా దర్శనానంతరం యాత్రికుడికి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు.
- స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదు.