ప్రభుత్వ ప్రయారిటీలు పక్కాగా మారాలి

ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరికొన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రయారిటీలు మారాలి. పీపుల్స్ ఎజెండా కావాలి అని పలువురు ఇరిగేషన్ నిపుణులు అభిప్రాయ పడ్డారు.;

Update: 2025-05-21 12:53 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఒక విధంగా, అధికారంలో లేకుంటే ఒక విధంగా వ్యవహరిస్తాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రైతు సంఘ ప్రముఖ నాయకులు కొల్లి నాగేశ్వరరావు వర్థంతిని పురస్కరించుకుని నదుల అనుసంధానం ఆవస్యకత, ప్రతిపాదనలు-సానుకూల-ప్రతికూల అంశాలు అనే అంశంపై బుధవారం విజయవాడలోని హోటల్ ఐలాపురంలో కొల్లి నాగేశ్వరరావు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సభలో విశ్రాంత ఇంజనీర్లు, రైతు, సామాజిక ఉద్యమ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మాట్లాడారు.

రామకృష్ణ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వానికి ప్రయారిటీలు అంటే ఏమిటి? ఎలా ఉండాలి అని ప్రశ్నించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని పోరాడిన వారిలో మేమూ ఉన్నాము. ఇప్పుడు 50వేల ఎకరాల వరకు భూములు అమరావతికి తీసుకుంటాం. అన్నీ ఇక్కడికి రప్పిస్తాం అంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారిపట్ల మిగిలిన ప్రాంతాల వారిలో అసూయ వచ్చేలా ముఖ్యమంత్రి చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే అంతా మారిపోతుందనుకున్నాం. ఏమి మారలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచే విషయంలో చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడటం లేదు. గతంలో జగన్ ఏమి చేసారో చంద్రబాబు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఎత్తు విషయంపై ఎన్నో సార్లు మాట్లాడిన బాబు ఇప్పుడు ఆ విషయం వదిలేశారన్నారు. ఈ విషయంలో నేను, నాడు పీఏసీ చైర్మన్ గా ఉన్న పయ్యావుల కేశవ్ వేరువేరుగా హైకోర్టులో పిటీషన్ లు కూడా వేసినట్లు చెప్పారు.


బనకచర్ల ఎత్తిపోతల పథకం ఎవరు అడిగారు. ఒక పక్క పోలవరం నిర్మాణం జరుగుతుండగా 82వేల కోట్లతో దీనిని నిర్మించేందుకు ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం ఏమిటి? వైఎస్ జగన్ ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపాదించిన ప్రాజెక్టు ఇది. జగన్ ప్రతిపాదించిన వాటిని కొనసాగించడం వెనుక అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పైగా ఈ ప్రజెక్టును ఒక కాంట్రాక్టర్ కు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులను ప్రైవేట్ వారికి అప్పగించడం ఏమిటి? అప్పులు తెచ్చయినా ప్రభుత్వమే నిర్మించాలని పేర్కొన్నారు.

అదానీతో కుదిరిన విద్యుత్ ఒప్పందం రద్దు చేయాల్సిన సీఎం చంద్రబాబు దానిని కొనసాగించడం ఏమిటని ప్రశ్నించారు. ఎక్కడో రాజస్థాన్ లో తయారు చేసే విద్యుత్ ను కొనుగోలు చేసే ఒప్పందం గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కడప జిల్లాలో 80 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు కావాల్సిన ట్యాంకులు ఉన్నాయి. అయితే ఒక్క ప్రాజెక్టు కింద కూడా కాలువలు లేవన్నారు. రాయలసీమలో ఉన్న ఏ ప్రాజెక్టు కు కూడా కృష్ణా జలాలు మళ్లించేందుకు అవసరమైన కాలువలు లేవన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బనకచర్ల ఎవరు కోరారని ప్రశ్నించారు. 1989లో మొదలైన హంద్రీనీవా ప్రాజెక్టు కింద ఒక్క ఎకరాకు కూడా నేటికీ నీరందలేదని, ఇందుకు కాలువలు లేకపోవడమే ప్రధాన కారణమన్నారు.


సభాధ్యక్షులు టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నదుల అనుసంధానం కలగా మిగిలిపోతోందన్నారు. కొల్లి నాగేశ్వరరావు నదుల అనుసంధానంపై ఎన్నో కలలు కన్నారని, పాలకులు వాటిని నీరు గారుస్తూ కేంద్ర పెద్దల అడుగులకు మడుగులొత్తుతున్నరన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రస్తుతం అవసరం లేదన్నారు. పోలవరం నిర్మాణం అనుకున్న ప్రకారం పూర్తి చేసి ప్రతిపాదనలో ఉన్న మిగిలిన నీటి ప్రాజెక్టుల విషయం పరిశీలించాలన్నారు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలోనూ ప్రభుత్వాలు పూర్తి స్థాయి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని విమర్శించారు.


రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, ప్రజలే ప్రతిపక్షంగా మారాలన్నారు. ప్రజెక్టులను అలక్ష్యం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. నీరు చెట్లు ప్రోగ్రాం కింద ఇచ్చిన జీవోలో అన్నీ ఆంక్షలే ఉన్నాయన్నారు. చేస్తున్నామని చెప్పేందుకు మాత్రమే జీవో ఇచ్చారని, పనికి రాని జీవోలు ఎందుకని ప్రశ్నించారు. చెరువులు, కాలువల్లో మట్టి తవ్వుకు పోయే వారు తవ్వుకుపోతూనే ఉన్నారన్నారు. ప్రస్తుత పాలకుల కంటే బ్రిటీష్ వారే నయమనే పరిస్థితిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల అనుసంధానికి ప్రజా ఉద్యమం నడవాలన్నారు. సభలో మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు, మహిళా నాయకురాలు పశ్య పద్మ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, నీటి పారుదల రంగానికి చెందిన పలువురు మేధావులు పాల్గొన్నారు.

Tags:    

Similar News