భక్తుల కోరికలు తీర్చే అమ్మవారి సమస్యలు తీరెదెప్పుడు ?

2014లో ప్రత్యేక తెలంగాణా ఏర్పడి పదేళ్ళు దాటిన తర్వాత కూడా తెలంగాణా ప్రభుత్వంలో కూడా బాసర దేవాలయం అభివృద్ధికి నోచుకోకపోవటం విచిత్రమే.

Update: 2024-09-18 07:52 GMT

ప్రతిరోజు వేలాదిమంది భక్తుల కోరికలను తీర్చే అమ్మవారి సమస్యలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో ప్రసిద్ధిచెందిన బాసర అమ్మవారి ఆలయం ఎన్నో సమస్యలతో అవస్తలు పడుతోంది. సంవత్సరాల తరబడి దేవాలయం మరమ్మత్తులకు నోచుకోలేదు. సమైక్య రాష్ట్రంలో పాలకులు బాసర దేవాలయం అభివృద్ధిని పట్టించుకోవటంలేదని అప్పట్లో జరిగిన గోల అందరికీ తెలిసిందే. అలాంటిది 2014లో ప్రత్యేక తెలంగాణా ఏర్పడి పదేళ్ళు దాటిన తర్వాత కూడా తెలంగాణా ప్రభుత్వంలో కూడా బాసర దేవాలయం అభివృద్ధికి నోచుకోకపోవటం విచిత్రమే. దేవాలయంలో అనేక సమస్యలున్నాయి. అవేమిటంటే భక్తుల తాకిడికి అనుగుణంగా ఆలయంలో సౌకర్యాలు లేవు.



 గర్భగుడి చాలా ఇరుకుగా ఉంటుంది. అలాగే ప్రాకారం కూడా ఏమంత విశాలంగా ఉండదు. ఒక్కసారిగా వేలాదిమంది భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తే తొక్కిసలాట తప్పదు. ప్రాకరమండపం కూడా ఎక్కువమంది కూర్చోవటానికి వీలుగా లేదు. గర్భగుడిని వెడల్పుచేస్తే కాని ముగ్గురమ్మలు స్పష్టంగా కనబడరు. దేవాలయంలో సరస్వతీ అమ్మవారితో పాటు మహంకాళి, మహాలక్ష్మి విగ్రహాలున్నాయి. అయితే గర్భగుడి చాల చిన్నది కావటంతో భక్తులకు అమ్మవారు సరస్వతి విగ్రహం తప్ప మిగిలిన రెండు విగ్రహాలు పెద్దగా కనబడవు. రద్దీ తక్కువున్న సమయాల్లో మాత్రం గర్భగుడిలోని పూజారులు ప్రత్యేకంగా చూపిస్తే కాని మహాంకాళి, మహాలక్ష్మి విగ్రహాలు కనబడవు. అందుకనే గర్భగుడిని వెడల్పు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అలాగే వర్షంపడితే చాలు దేవాలయం అంతా కురుస్తుంది. చివరకు గర్భగుడిలో కూడా వర్షపు నీరు కారుతుంది. పెద్ద వర్షంపడితే ఆలయంలోని భక్తులందరు గోదావరిలో ముణిగినట్లుగానే అనుకోవాలి. ఎందుకంటే అంతగా వర్షం లోపలంతా కురుస్తుంది కాబట్టి. వర్షందెబ్బకు భక్తులు ఆలయంలో ఉన్నాసరే తడిసిపోతారు.



 దేవాలయం మొత్తాన్ని పునర్ నిర్మించాలని చాల కాలంగా ప్రణాళికలున్నా ఎందుకనో ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయటంలేదు. దేవాలయం పునర్ నిర్మాణం కోసం 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం రు. 50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విడుదలైన నిధులు మాత్రం కేవలం రు. 8 కోట్లు మాత్రమే. 2023 మార్చిలో దేవాలయం పునర్ నిర్మాణ పనులు మొదలైనా పెద్దగా ముందుకు సాగలేదు. ఎందుకంటే తర్వాత ఎన్నికల కోడ్ ప్రకటించటంతో దేవాలయం పనులు పెద్దగా జరగలేదు.

జరగాల్సిన అభివృద్ధి




 ఆలయం ప్రాకార మండపానికి తూర్పు, పశ్చిమ దిశల్లో ఏండస్తులతో రాజగోపురం నిర్మించాలి. ఉత్తర, దక్షిణ దిశల్లో ఐదంతస్తులతో మరో రెండు రాజగోపురాలు నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న ప్రాకారమండపాన్ని 50 మీటర్లు ముందుకు జరపాలి. గర్భగుడి ప్రస్తుత పొడవు 10 అడుగులు, పది అడుగుల వెడల్పుంది. ఇంత ఇరుకుగా ఉంది కాబట్టే భక్తులకు సరస్వతి అమ్మవారు తప్ప మిగిలిన ఇద్దరు కనబడటంలేదు. ఇంతటి ఇరుకుగా ఉన్న గర్భగుడిని 25.5 అడుగుల వెడుల్పు, 16.5 అడుగుల పొడవుతో విస్తరించబోతున్నారు. 6.5 అడుగుల వెడల్పున్న ఆలయం ముఖద్వారాన్ని 18.5 అడుగులు విస్తరించనున్నారు.

పురాణాలు ఏమి చెబుతున్నాయి ?



బాసర ఆలయంలోని ముగ్గురు అమ్మవార్ల గురించి పురాణాల్లో కూడా ఉంది. బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్టించారని స్ధలపురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాసమహర్షి మనశ్శాంతి కోసం తప్పస్సు చేసుకునేందుకు అనువైన స్ధలం కోసం వెతుకుతు ఇక్కడకు వచ్చారు. ఇక్కడి ప్రశాంత వాతావరణం, పక్కనే గోదావరి నది ఉండటంతో ఈ ప్రాంతం వ్యాసుడుకి నచ్చి ఇక్కడే కొంతకాలం తప్పస్సు చేశారు. ఆ సమయంలోనే వేదవ్యాసుడికి జగన్మాత దర్శనం ఇచ్చి ముగ్గురమ్మలు సరస్వతి, మహాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్లను ప్రతిష్టించమని ఆదేశించింది. జగన్మాత ఆదేశం ప్రకారం గోదావరినదిలోని ఇసుకను మూడు పిడికిళ్ళు తెచ్చి వ్యాసుడు ముగ్గురమ్మలను ప్రతిష్టించారని పురాణాల్లో ఉంది. అంటే ఇసుకతోనే వ్యాసుడు సరస్వతి, మహాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించి ప్రతిరోజు పూజలు చేసేవారు. అందుకనే ఈ ప్రాంతం మొదట వ్యాసపురి అని తర్వాత వ్యాసరగా ప్రాచుర్యం పొందింది. తర్వాత్తర్వాత జనాల నోళ్ళల్లో వ్యాసర కాస్త బాసరగా స్ధిరపడిపోయింది.

ప్రజల విశ్వాసం ఏమిటి ?


 



దేశంలోని ప్రముఖ సరస్వతి దేవాలయాలు రెండే ఉన్నాయి. మొదటి సరస్వతీ ఆలయం కాశ్మీరులో ఉండగా రెండో దేవాలయం బాసరలో ఉంది. బాసర దేవాలయం అక్షరాభ్యాసానికి చాలా ప్రాచుర్యం పొందింది. పురాణాల ప్రకారం సరస్వతీ దేవి చదువుల తల్లి. సరస్వతి దేవిని కొలిచేవారికి అక్షరజ్ఞానానికి ఎలాంటి లోటుండదని పెద్దలు చెబుతుంటారు. అందుకనే తమ పిల్లలకు చదువు బాగా రావాలని చాలామంది పెద్దలు బాసరకు వచ్చి అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. వ్యాసమహర్షి ఇసుకతో ప్రతిష్టించిన మూడు అమ్మవార్లకు పసుపును దిట్టంగా పట్టించి పూజలు చేస్తుంటారు. కాబట్టి పూజల తర్వాత రవ్వంత పసుపును ప్రసాదంలా తీసుకుంటే జ్ఞానానికి లోటుండదని పెద్దలు చెబుతుంటారు.

మంజీరా, గోదావరి నదీ తీరాల్లో రాష్ట్రకూటుల ఆధ్వర్యంలో నిర్మితమైన దేవాలయాల్లో బాసర దేవాలయం కూడా ఒకటని జనాలు చెప్పుకుంటుంటారు. 6వ శతాబ్దంలో నాదేండును రాజధానిగా చేసుకుని పరిపాలించిన నందగిరి రాజు బిజలుడు బాసరలో ముగ్గురమ్మలకు దేవాలయాన్ని నిర్మించాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.

రవాణా సౌకర్యాలు




 హైదరాబాద్ నుండి బాసర సుమారు 205 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు మార్గం ద్వారా బాసరకు చేరుకోవచ్చు. హైదరాబాద్-మన్మాడ్ రైలుమార్గంలో బాసర స్టేషన్ ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి బాసర సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ప్రస్తుతం నిర్మల జిల్లాలో ఉన్న బాసర నిర్మల పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాసర క్షేత్రంకు దగ్గరలో ఉన్న గోదావరి నది దాటితే మహారాష్ట్రలోకి ఎంటరైనట్లే. ఇన్ని విశిష్టతలుండి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన దేవాలయం అభివృద్ధి, పునర్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో అర్ధంకావటంలేదు.

పునర్ నిర్మాణానికి రు. 110 కోట్లు అవసరం

దేవాలయం పునర్ నిర్మాణం గురించి తెలంగాణా ఫెడరల్ తో ఆలయ ఈవో వావిలకొలను విజయరామారావు మాట్లాడుతు దేవాలయం పునర్ నిర్మాణానికి రు. 110 కోట్లు అవసరం అవుతుందన్నారు. దేవాలయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలన్నా శృంగేరి మఠం సూచనలు తప్పనిసరిగా చెప్పారు. గర్భగుడి, క్యూలైన్లు, అర్ధమండపం విస్తరణ చేస్తే భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నిధులు ఎప్పుడు మంజూరు చేసిన వెంటనే పునర్ నిర్మాణ పనులు మొదలవుతాయని చెప్పారు. శృంగేరి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యానందభారతి సూచనలు, పర్యవేక్షణలోనే పునర్ నిర్మాణం అంతా జరుగుతుందన్నారు.




 వర్షంపడితే దేవాలయంలో కొన్నిచోట్ల కురుస్తుందని అంగీకరించారు. అందుకనే అమ్మవార్ల విగ్రహాలను కదపకుండా పైన, కింద, చుట్టుపక్కల పునర్ నిర్మించబోతున్నట్లు చెప్పారు. గర్భగుడిలోని ముఖద్వారం తలుపులను వెడల్పుచేస్తే భక్తులకు ముగ్గురమ్మలు స్పష్టంగా కనబడతారని ఈవో చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం 42 సూట్లు, 110 గదులున్నాయన్నారు. ప్రతిరోజు అమ్మవార్లను సుమారు 10 వేలమంది భక్తులు దర్శనం చేసుకుంటారని, విశిష్ట దినాలైన పంచమి, పౌర్ణమి లాంటి తిధులతో పాటు పండగు రోజుల్లో ఇంకా ఎక్కువమంది భక్తులు దేవాలయంకు వస్తారని చెప్పారు. పైన చెప్పిన తిధులు, పండుగ రోజులతో పాటు ప్రతి శుక్రవారం సుమారు 500కు తగ్గకుండా అక్షరాభ్యాసాలు జరుగుతాయని రమారావు చెప్పారు.

Tags:    

Similar News