హైదరాబాద్ శివార్లలో జనం భయం..భయం, ఎందుకంటే...

ఆవాసాలు ధ్వంసం...ఆహారం, నీళ్ల కరువుతో అలమటిస్తున్నాయి...;

Update: 2025-07-29 07:51 GMT
హైదరాబాద్ శివార్లలోని జనవాసాల్లోకి వచ్చిన చిరుతపులి

హైదరాబాద్ నగరం శివార్లలో నలువైపులా ఉన్న ఎతైన చెట్లతో కూడిన అడవులు, కొండలు, గుట్టల్లో చిరుతపులులు, ఇతర వన్యప్రాణుల ఆవాసాలు లెక్కకు మించి ఉండేవి. నగర శివారు ప్రాంతాల్లో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం కొండలు, గుట్టలను డైనమెట్లతో పేలుస్తూ చదును చేస్తుండటంతో ఆ చప్పుళ్లకు చిరుతలు జనవాసాల్లోకి వస్తున్నాయి.(Leopards Enter Hyderabad City) మరో వైపు నగర శివారు ప్రాంతాల్లో కొండలు, గుట్టలను చదును చేసి, చెట్లను కొట్టివేస్తుండటంతో చిరుతలు ఆహారం, నీటి కొరత ఏర్పడింది. చిరుత పులులు వేటాడేందుకు జింకలు, ఇతర వన్యప్రాణులు లేక ఆహారం కోసం జనవాసాల్లోని మేకలు, పశువులపై దాడి చేస్తున్నాయి. శివార్లలో ప్రకృతి విధ్వంసం వల్ల చిరుత పులులు జనవాసాలపై పడటంతో జనం తీవ్ర భయాందోళనలు (Hyderabad People Afraid)చెందుతున్నారు.


శివార్లలో భయం..భయం
హైదరాబాద్ నగర శివార్లలోని మంచిరేవుల జనవాసాలైన గ్రేహౌండ్స్, గండిపేట, రివర్ ఎడ్జ్ విల్లాస్, మంచిరేవుల, నెక్నాంపూర్ ప్రాంతాల్లో ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది.చిరుత సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు బోన్లలో మేకలను ఎరగా వేసి వాటిని బంధించేందుకు సమాయత్తం అయ్యారు. దీంతో చిరుత సంచారాన్ని గుర్తించేందుకు కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు మేకలను ఎరగా వేసి బోన్లు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.



 బాలాపూర్ ప్రాంతంలో...

హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్ ప్రాంతంలో చిరుత పులి సంచారం స్థానికుల్లో కలకలం రేపింది.వెయ్యి ఎకరాల పరిధిలోని డిఫెన్స్ లాబోరేటరీస్ స్కూల్ క్యాంపస్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుందని తేలడంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు బోనులు, కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు.చిరుతపులులే కాదు అడవి పందులు, నెమళ్లు నగర శివార్లలో కీసర, గండిపేట, శామీర్ పేట ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. గతంలో పటాన్ చెరు సమీపంలోని ఇక్రిశాట్ ప్రాంతంలో చిరుతను బోనులో బంధించిన అటవీశాఖ అధికారులు జూపార్కులో వెటర్నరీ అధికారులతో పరీక్షలు చేయించి దాన్ని అమ్రాబాద్ అభయారణ్యంలో వదిలివేశారు.

గోల్కొండ ప్రాంతంలో...
గోల్కొండ ప్రాంతంలో చిరుతపులిని చూసినట్లు స్థానికుడైన కె నర్సింహ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తారామతి బారాదరి రోడ్డు, ఇబ్రహీంబాగ్‌ ప్రాంతాల్లో చిరుతపులి సంచరించడంతో గోల్కొండ వాసులు భయాందోళనలు చెందుతున్నారు.తారామతి బారాదరి ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న పలువురు చిరుతపులి రోడ్డు దాటి మూసీ నది వైపు వెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు.చిరుతపులి రోడ్డు దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వచ్చింది.పులి సంచారం గురించి తాము అటవీ శాఖకు సమాచారం అందించామని, దీంతో అటవీశాఖ అధికారులు వచ్చి చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారని గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫైజ్ చెప్పారు.



 నిజామాబాద్ జిల్లాలో...

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి అడవుల్లో పులి సంచరించిందని తాజాగా పాదముద్రను కనిపించడంతో వెల్లడైంది. నాగారం డంపింగ్ యార్డు గుట్ట ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయి. జానకం పేటలో మేకల మందపై చిరుత దాడి చేసి ఓ మేకను పట్టుకెళ్లింది. ఈ విషయం సీసీకెమెరాలో రికార్డు అయింది. నవీపేట మండలం అబ్బాపూర్ ప్రాంతంలో పశువుల కొట్టంలోకి చిరుత ప్రవేశించి లేగదూడలను చంపింది.నవీ పేట మండలంలోని సిరన్ పల్లి, నందిగామ ప్రాంతాల్లో చిరుత పులి సంచరించింది. గ్రామంలో ఓ మేకను చిరుత ఎత్తుకెళ్లింది.

పలు జిల్లాల్లో చిరుతల సంచారం
నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామ శివారులో చిరుత పులి సంచరించిందిి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో మూడు చిరుతపులులు సంచరించాయి. దుబ్బాక ప్రాంతంలోని అక్బర్ పేట, భూంపల్లి, దౌల్తాబాద్ ప్రాంతాల్లో జనవాసాల్లో చిరుతపులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని అచ్యుతాపూర్ గ్రామంలో చిరుతపులి దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.



 తిరుమల ఘాట్ రోడ్డులో...

తిరుమల శేషాచలం అడవుల సమీపంలోని అలిపిరి బైపాస్ వద్ద చిరుత సంచరిస్తోంది. దీంతో భక్తుల భయాందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు దీన్ని పట్టుకునేందుకు ఆపరేషన్ చిరుతను చేపట్టారు.తిరుమలలో గతంలో పలు సార్లు చిరుతలు భక్తులపై దాడి చేసిన ఘటనలు జరిగాయి.

మంచిర్యాలకు మహారాష్ట్ర పులి వలస
మంచిర్యాలలో పులి దూడను చంపిన ఘటనతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళనలు రేకెత్తాయి.మహారాష్ట్ర నుంచి దారితప్పి వచ్చిన పులి మంచిర్యాలలోని రొట్టేపెల్లి అడవుల్లో మరో దూడను చంపింది.పులి కదలికలను ట్రాక్ చేయడానికి అధికారులు కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక మగ పులి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాసిపేట, తిర్యాణి మండలాల సరిహద్దుల్లో తిరుగుతూ దూడను చంపి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు చెప్పారు.గొండుగూడకు చెందిన కురిసెంగ అచ్యుతరావుకు చెందిన దూడను పులి చంపిందని అటవీ అధికారులు తెలిపారు.పులిని అడవుల్లోకి మళ్లించడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు అటవీ అధికారులను అభ్యర్థించారు.

ఆవాసాల ధ్వంసంతోనే జనవాసాల్లోకి చిరుతలు
ఒక చోట కాదు పలు ప్రాంతాల్లో జనవాసాల్లోకి చిరుతలు వస్తున్నాయి.అడవుల్లో సంచరించాల్సిన చిరుత పులులు జనవాసాల్లోకి వస్తున్నాయి.చిరుతలు జనవాసాల్లోకి రాకతో చిరుతపులులు, మనుషుల మధ్య సంఘర్షణ జరుగుతోంది.చిరుతల ఆవాసాల ధ్వంసంతోనే (Destruction Habitate) జనవాసాల్లోకి చిరుతలు అటవీ ప్రాంతాలను వదిలి జనవాసాల్లోకి వస్తున్నాయని తెలంగాణ అటవీశాఖ వన్యప్రాణుల నిపుణులు ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నగర శివార్లలో గుట్టలు, పొదలు, చెట్లు ఉండేవని, వాటిని రియల్ ఎస్టేట్ కోసం తొలగిస్తుండటంతో చిరుతలు జనారణ్యంలోకి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.



 ఆహారం, నీళ్ల కోసం చిరుతలు జనవాసాల్లోకి...

అడవుల నరికివేత, ఖరీఫ్ సీజనులో అటవీ భూముల్లో పంటలు వేయడంతో అటవీ విస్తీర్ణం తగ్గిందని దీనివల్ల అడవిలోని చిరుతలు ఆవాసాలు దెబ్బతినడంతో దిక్కుతోచక ఆహారం కోసం మేకలు, పశువుల మందలపై పడుతున్నాయని హైదరాబాద్ జూపార్కు వెటర్నరీ డాక్టర్ అయిన డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.అడవుల్లో చిరుతల ఆహారం కొరవడటంతో జనవాసాల్లోని మేకలు, పశువులపై పడేందుకు జనవాసాల్లోకి వస్తున్నాయన్నారు. ఆహారం, నీటి కోసం చిరుతలు అటవీ గ్రామాల్లోకి వస్తున్నాయని చెప్పారు. అటవీ ప్రాంతాల సమీపంలో మైనింగ్, ఇతర పనుల కోసం పేలుళ్లు జరుపుతుండటంతో చిరుతలు భయపడి జనవాసాలపై పడుతున్నాయని డాక్టర్ హకీం వివరించారు.

చిరుత సంచరిస్తోంది...జర జాగ్రత్త
డిఫెన్స్ లాబోరేటరీస్ స్కూల్ క్యాంపస్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుందని డిఫెన్స్ లాబోరేటరీ స్కూల్ ప్రిన్సిపాల్ అలర్ట్ నోట్ జారీ చేశారు.రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డిఫెన్స్ లాబొరేటరీస్ స్కూల్ విజ్ఞానకాంచ ప్రిన్సిపాల్ అత్యవసర సలహా జారీ చేశారు.పాఠశాల ఆవరణలో పిల్లలు ఒంటరిగా బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.అవసరమైతే తప్ప బయట ఒంటరిగా తిరగవద్దని, చిరుతపులి చూసినట్లు కనిపిస్తే వెంటనే అధికారులకు నివేదించాలని కోరారు.

రంగంలోకి అటవీశాఖ ప్రత్యేక బృందాలు
చిరుతపులిని ట్రాక్ చేయడానికి అటవీ శాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. చిరుతల దాడి నుంచి ప్రజలను కాపాడేందుకు సురక్షితంగా చిరుతలను పట్టుకోవడానికి ట్రాంక్విలైజర్లు ఉచ్చులను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలు సహజ ఆవాసాలను ఆక్రమించడంతో చిరుతలు సమీపంలోని అడవుల నుంచి నగర ప్రాంతంలోకి వచ్చాయని అటవీశాఖ అధికారి జి శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.




Tags:    

Similar News