నాగపంచమి వేళ నాగుపాములను హింసించొద్దు...

నాగుల పంచమి నాడు సర్ప విగ్రహాలను పూజించండి: అటవీ శాఖ;

Update: 2025-07-28 09:58 GMT
నాగులపంచమి వేళ బుట్టల్లో బంధించిన కింగ్ కోబ్రా

నాగులపంచమి (Naga panchami)వేళ కొందరు పాములోళ్లు పాములను బుట్టల్లో తీసుకువచ్చి వీధుల్లో వాటిని ఆడిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.కొందరు నాగుపాములను పట్టుకొని వాటి కోరలు తీసి, వాటి నోటిని దారంతో కుట్టేసి, వాటికి ఆహారం, నీరు ఇవ్వకుండా బుట్టల్లో బంధిస్తుండటం నిత్యకృత్యంగా మారింది. కోరలు పీకడంతో బలహీనంగా మారిన నాగు పాములను పాములోళ్లు భక్తులకు చూపించి, వాటిని ఆడిస్తుండగా నాగ భక్తులు వాటికి పాలు పోయడంతోపాటు కుంకుమ, పసుపు చల్లుతూ వాటికి మరింత బాధ పెడుతుంటారు. నాగులపంచమి వేళ కింగ్ కోబ్రాల పట్ల క్రూరత్వం చూపించవద్దని తెలంగాణ అటవీశాఖ అధికారులు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ(Friends of Snakes Society) సభ్యులు కోరుతున్నారు.


నాగుల పంచమి వేళ సర్ప విగ్రహాలను పూజించండి
నాగుల పంచమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో జులై 29వతేదీ మంగళవారం పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసి ఉంటాయి. భక్తులు నాగపంచమి సందర్భంగా నాగుపాములను హింసించకుండా సర్ప విగ్రహాలను పూజించాలని అటవీశాఖ అధికారి ఎ శంకరన్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ కోరారు.నాగులపంచమి పండుగ సందర్భంగా నాగు పాముల పట్ల క్రూరత్వం చూపించవద్దని అవినాష్ సూచించారు.



 పుట్టల్లో పాలు పోయొద్దు

పాములు పాలు తాగవని, పాలు తాగి వాటిని జీర్ణించుకునే శక్తి లేక అవి చనిపోతుంటాయని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పాలు తాగిన పాములు ప్రాణాంతక విరోచనాలకు గురై చనిపోతుంటాయని భక్తి భావంతో దేవాలయాల్లో పూజలు చేయండి కానీ వాటికి పాలు, కుంకుమ, పసుపు పూసి దెబ్బతీయ వద్దని ఆయన కోరారు.నాగుల పంచమి వేళ భక్తి భావంతో పుట్టల్లో పాలు పోస్తే అవి భూమిలో ఇంకిపోతాయి తప్ప పాములు తాగవని ఆయన చెప్పారు.

నాగుపామును హింసిస్తే కేసు
వన్యప్రాణుల రక్షణ చట్టం(Wildlife Protection Act) 1972 ప్రకారం ఇండియన్ కింగ్ కోబ్రా (నాగుపాము) కు పరిరక్షణ కల్పించాలి. కింగ్ కోబ్రాలను అనధికారికంగా పట్టుకోవడం, లేదా పాములను ఆడించడం నేరం. నాగుపాములను హింసించినా, పట్టుకొని ఆడించినా వారికి చట్టప్రకారం మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష, 25వేలరూపాయల జరిమానా విధించచ్చు.



 గాయపడిన పాములకు చికిత్స

పాములోళ్లు బుట్టల్లో బంధించిన పాములను రక్షించి వాటిని హైదరాబాద్ నగర శివార్లలోని బౌరంపేట పాముల రక్షణ, పునరావాస కేంద్రానికి (Snake Rescue and Rehabilitation Centre)తరలించి, వాటికి పశువైద్యాధికారుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. కోరలు పీకిన, నోరు కుట్టేసిన పాములకు చికిత్స చేసి మెరుగైన తర్వాత వాటిని వివిధ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో వదిలి వేస్తున్నామని తెలంగాణ అటవీ శాఖ అధికారి ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఇప్పటి వరకు 19వేల పాములను రక్షించి వాటికి చికిత్స చేయించి అడవుల్లో వదిలివేశామని శంకరన్ వివరించారు.

పాముల కోసం 40 ఎన్‌క్లోజర్లు
పాములు సహజ సిద్ధంగా ఉన్న ఆవాసాలలాగా దుంగలు, రాళ్లు, మొక్కలు, నీటి వనరులతో కూడిన 40 పాముల ఎన్ క్లోజర్లను ఏర్పాట్లు చేశారు. అటవీశాఖ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ రక్షించిన పాములను బౌరంపేట పాముల రక్షణ, పునరావాస కేంద్రానికి తరలించి వాటికి చికిత్స చేసి ఎన్ క్లోజర్ల లో ఉంచి వాటికి ఆహారం అందిస్తున్నారు. పాముల ఎన్ క్లోజర్లలో ఎలుకలను ఆహారంగా అందిస్తున్నారు. పాములోళ్లు, మంత్రగాళ్ల నుంచి రక్షించిన పాములను చికిత్స చేసి వాటిని అడవుల్లోకి వదులుతున్నామని అటవీశాఖ అధికారి శంకరన్ చెప్పారు.

పాముల రక్షణకు 8 బృందాలు
నాగుల పంచమి సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో పాములను పరిరక్షించేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలంగాణ అటవీ శాఖ (Telangana Forest Department) అధికారి ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మంత్రగాళ్లు పాములను ఆడిస్తుంటే వాటిని తాము స్వాధీనం చేసుకొని బౌరంపేట పాముల రక్షణ, పునరావాస కేంద్రానికి తరలించి చికిత్స అందించి అడవుల్లో వదిలివేస్తామని ఆయన చెప్పారు.దీంతోపాటు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి చెందిన 150 మంది వాలంటీర్లతో ప్రత్యేక దాడులు చేసి పాములను హింసించే వారిని పట్టుకుంటామని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పాములను ఆడిస్తున్నారా ? అయితే ఫిర్యాదు చేయండి
నాగుల పంచమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో పాముల మంత్రగాళ్లు పాములను ఆడిస్తుంటే తమకు ఫిర్యాదు చేయాలని అటవీశాఖ సూచించింది.సమీప పోలీస్ స్టేషకు లేదా, తెలంగాణ అటవీ శాఖ టోల్-ఫ్రీ నంబర్: 1800-425-5364కు, లేదా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ: 83742 33366 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని అటవీశాఖ అధికారులు కోరారు.


Tags:    

Similar News