Government hospitals Andhra Pradesh |నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు
ప్రధాన ప్రభుత్వాస్పత్రులను సిబ్బంది కొరత పీడిస్తోంది. దీంతో రెఫరల్ తప్పడం లేదు. ఇది కాస్తా 108 సేవలకు ఇబ్బందిగా మారింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-01-30 05:32 GMT
)రాష్ట్రంలోని పీహెచ్‌సీలే కాదు. పట్టణ పరిధిలోని సీహెచ్‌సీ (Primary Health Centers) లకు కూడా డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది సమస్యతో సతమతం అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో యువ వైద్యులు పనిచేయాలనే నిబంధనలు కూడా అమలుకాని పరిస్థితి. దీనివల్ల చిన్నపాటి రోగంతో వచ్చే వారిని కూడా రెఫరల్ పేరిట ప్రధాన ఆస్పత్రులకు పంపించాల్సిన అనివార్యమైన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడింది. దీనివల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రులు కిటకిటలాడుతుంటే, ప్రైవేటు ఆస్పత్రులు కూడా చక్కగా దండుకుంటున్న పరిస్థితి. ఇదిలాఉంటే,
జాతీయ రహదారి పట్టణాల్లో ఉన్న ఆస్పత్రులకు పురుటి నొప్పులతో వచ్చే వారిని కూడా రెఫరల్ (Referral) చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి. రిస్క్ కేసులు ఇక సరేసరి. దీనివల్ల కొత్త కష్టాలు కూడా ప్రారంభమయ్యాయి. రెఫరల్ చేయించుకున్న రోగులు వందల కిలోమీటర్లు పగలనక, రాత్రనక 108 అంబలెన్సులో (Ambulance ) తరలించడం కూడా కష్టంగా మారుతోంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో అత్యసర రోగులకు సేవలు అందని పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం.
వేధిస్తున్న సిబ్బంది సమస్య
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని రాష్ట్రంలో డీఎంఈ, డీఎస్‌హెచ్, డీపిహెచ్, ఆయుష్, ఎన్హెచ్ఎం పరిధిలోని వివిధ విభాగాల్లో 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1,01,125 పోస్టుల్లో దాదాపు 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే రోగులకు మెరుగైన సేవలు అందించడం అనేది ఎంతవరకు సాధ్యం అనేది అర్థం చేసుకోవచ్చు. అంటే మొత్తం పోస్టుల్ల్ 25.97 పోస్టులు ఖాళీ సీట్లతో వెక్కిరిస్తున్నాయి. ఈ ఖాళీల్లో 3,114 డాక్టర్లు పోస్టులే కావడం గమనించతగిన విషయం. పారా మెడికల్ పోస్టులు 23,149 ఖాళీగా ఉన్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల దేవుడెరుగు పట్టణ ప్రాంతాల్లోని సీహెచ్‌సీ (Community Health Center's) తో పాటు ప్రాంతీయ వైద్య శాలల్లో కూడా ఇదే పరిస్థితి.
ఖాళీ కుర్చేలే..
రాష్ట్రంలోని ఖాళీల వివరాలు వైద్య విభాగం సేకరించింది. ఆయుష్ (Ayush ) విభాగం పరిధిలో సేవలు అందించే ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ ఆస్పత్రుల్లో 825 పోస్టులకు గాను 407 ఖాళీలు ఉన్నాయి. కాపౌండర్లు, అటెండర్లతో పాటు ఇతర సేవలు అందించే వారిలో 1,601 పోస్టుల్లో 1,131 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. బోధన ఆస్పత్రుల్లో కూడా ఏమాత్రం సరిపడ వైద్యులు, సిబ్బంది లేరు. విజయవాడ జీజీహెచ్ లో 314 పోస్టులకు 46 ఖాళీలు ఉంటే, గుంటూరులో 65 వైద్యుల పోస్టులే ఖాళీగా ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ పోస్టులు 38, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 78 ఖాళీగా ఉన్నాయి.
పారామెడికల్ కీలకం
వైద్య ఆరోగ్య శాఖలో పారా మెడికల్ సిబ్బంది సేవలే కీలకం. అయితే పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణులకు వైద్య సేవలు అందించడం కష్టంగా మారిందనడానికి నిదర్శనం ఈ శాఖలో వెక్కిరిస్తున్న పోస్టులే. అందులో ప్రధానంగా ..
పీహెచ్సీ (Primary Health Center's), జిల్లా ఆస్పత్రులు (District Hospital's) లోపారా మెడికల్ సిబ్బంది పోస్టులు 9,978 పోస్టులు ఖాళీగా ఉంటే, బోధన ఆస్పత్రుల్లో 10,065 పోస్టుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఐసీయూ (Intensive Care Unit's) లో కూడా నర్సుల సమస్య ఎక్కువగా ఉంది. సిబ్బంది లేక రోగులకు మెరుగైన సేవలు అందించడం వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ముళ్లబాటగా మారింది.
ఇదే రెఫరల్ మార్గం
సిబ్బంది కొరత నేపథ్యంలో ప్రధాన ఆస్పత్రుల నుంచి జనరల్ ఆస్పత్రులకు (Government General hospitals ) రెఫర్ చేయడం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితి. జాతీయ రహదారుల్లో ఉన్న సీహెచ్‌సీలకు రోగులకు సేవలు అందడం కష్టంగా మారితే.. ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు అత్యవసర సేవలు అందడం కూడా గగనంగా మారుతోంది. దీంతో సుదూర్గంలోని జనరల్ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. వారిని తరలించడంలో 108 అంబులెన్సులు కీలకంా మారుతున్నాయి. అదే సమయంలో గ్రామాల్లోని అత్యవసర రోగులకు రవాణా సేవలు కష్టం అవుతున్నాయి.
ఇదే సాక్ష్యం...
వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన తరువాత చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ఆస్పత్రిని "సర్వజన బోధనాస్పత్రి" స్థాయికి పెంచారు. మినహా ఇక్కడ వైద్యులను నియమించలేదు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఆస్పత్రిని విస్తరించే పనులు అరకొరగా జరిగాయి. చిన్నపాటి రోగాలతో వెళ్లే వారికి ప్రాథమిక చికిత్స తరువాత అత్యవసర చికిత్స పేరుతో మదనపల్లె నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఇదే రోగులకు శాపంగా మారుతోంది. ఆ రోగులను తరలించడం 108 అంబులెన్స్ పైలట్లకు సంకటంగా మారింది. 120 కిలోమీటర్ల దూరం రావడం వల్ల మిగతా అత్యవసర రోగులకు అంబులెన్స్ సేవలు అందని పరిస్థితి ఏర్పడుతోంది. నడవ గలిగే శక్తిసామర్థ్యం ఉన్న వారిని కూడా రెఫర్ చేయడం వల్ల కొత్త కష్టాలు ఎదురువుతున్నాయి.
ఇదే నిదర్శనం
మదనపల్లె నుంచి ఓ రోగిని తీసుకుని బయలుదేరిన 108 అంబులెన్స్ కింద పడి ఇద్దరు మరణించిన సంఘటనే ఓ ఉదాహరణగా చెప్పవచ్చు.
మదనపల్లె మండలం దుబ్బిగానిపల్లెకు చెందిన హరికృష్ణ అనే ఓ యువకుడు కడుపులో మంటగా ఉందని మదనపల్లె ఆస్పత్రికి వచ్చాడు. పరిశీలించిన డాక్టర్లు అతనికి కడుపు ఎగువ భాగంలో నొప్పితో పాటు గుండె సంబంధ సమస్య ఉందని, తిరుపతి ఎస్వీఆర్ఆర్ ( Sree Venkateswara Ram Narayan Ruya Hospital - SVRR Hospital ) కు ఆదివారం రాత్రి సుమారు 10.15 గంటలకు రెఫర్ చేశారు. అదే సమయంలో నిమ్మనపల్లె మండలంలో జరిగిన దాడుల్లో గాయపడిన వారిని 108 వాహనంలో తీసుకుని వచ్చారు. అప్పుడే...
108 కంట్రోల్ రూం నుంచి అందిన సమాచారంతో అంబులెన్స్ పైలట్ హరికృష్ణను ఫోన్లో కాంటాక్టు చేశాడు. మదనపల్లె ఆస్పత్రి వద్దే ఉన్నాడని తెలుసుకుని వాహనం అక్కడికి తీసుకుని వెళ్లగానే, హరికృష్ణ ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చి వాహనం ఎక్కడని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఆదివారం రాత్రి 10.30 గంటలకు తిరుపతికి బయలుదేరారు. మంచు జోరుగా కురుస్తున్న సమయంలో రోడ్డు కూడా సక్రమంగా కనిపించని స్థితిలో ప్రయాణించడం అంబులెన్స్ పైలెట్లకు ఒక విధంగా పరీక్ష సమయమే. రోగిని సకాలంలో చేర్చాలనే వారి లక్ష్యం ముందు ప్రతికూల వాతావరణాన్ని కూడా జయిస్తూ, సాగుతుంటారు.
ప్రతికూల వాతావరణం..
తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్చడానికి రోగి హరికృష్ణను తీసుకుని వెళుతున్న నిమ్మనపల్లె మండలం నుంచి వెళుతున్న అంబులెన్స్ ఢీకొనడంతో గాయపడ్డారు. దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉన్న ప్రతికూల వాతావరణంలో యాత్రికులు అడ్డంగా దూరడం వల్లే ఈ ప్రమాదం జరగడానికి దారి తీసినట్లు చెబుతున్నారు. ఆ పరిస్థితులో కూడా గాయపడిన వారిని ఆ పైలట్ తన వాహనంలోనే రుయా ఆస్పత్రికి తరలించి బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఈ సంఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
రెఫరల్ కష్టాలు...
మదనపల్లె సర్వజన బోధనాస్పత్రిలో రోజూ 1,200 మంది అవుట్ పేషంట్ రోగులకు చికిత్స అందుతోంది. ఏపీ విభాగంలో 19 రకాల రోగాలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. 440 పడకలు ఉన్న ఈ ఆస్పత్రికి డాక్టర్లు, నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. మదనపల్లె సర్వజన బోధనాస్పత్రికి సమీపంలో అంటే మదనపల్లె మండలంలో సీటీఎం (చిన్నతి్ప సముద్రం) బొమ్మనచెరువు పీహెచ్‌సీలు, వాల్మీకిపురం, గుర్రంకొండ, ముదివేడు ఆస్పత్రులు కూడా దరిదాపుల్లో అంటే 10 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి మదనపల్లెకు వచ్చే రోగులకు అత్యవసర సేవలు అవసరం అనిపిస్తే చాలు. తిరుపతికి రెఫర్ చేయడం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితి.
భారం తగ్గించండి
రోగులను రెఫర్ చేయడం తగ్గించాలని 108 అంబులెన్స్ పైలట్ల సంఘం కోరుతోంది.
2024 డిసెంబర్ 9 తేదీ మదనపల్లె డివిజన్ అంబులెన్స్ పైలట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గాయత్రిదేవికి ఓ వినతిపత్రం కూడా సమర్పించారు.
"గత పది రోజుల్లో పది కేసులు స్టాఫ్ నర్సులే తిరుపతికి రెఫర్ చేశారు" అని సంఘం ప్రతినిధులు తమ సమస్యలు, రోగుల కష్టాలు కూడా వివరించారు.
"తిరుపతికి వెళ్లిరావడానికి 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఏడు గంటల సమయం పడుతుంది" అని గుర్తు చేసిన వారు ఆ సమయంలో ఎవరైనా అత్యవసర వైద్య సేవలు అవసరం అయితే వారికి సేవలు అందే పరిస్థితి ఉండదు" అని సమస్యను వివరించారు. చిన్న రోగాలకు రెఫర్ చేయవద్దని కూడా మొరపెట్టుకున్నారు. అయినా...
ఒకే రాత్రి ఐదుగురికి రెఫర్
మదనపల్లె ఆస్పత్రి సూపరింటెండెంట్ కు విన్నవించి, నెల కూడా గడవలేదు. తాజాగా ఒకే రాత్రి ఐదుగురిని మదనపల్లె నుంచి తిరుపతికి రెఫర్ చేశారు" దీంతో ఐదు 108 వాహనాలు మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, కలిగిరితో పాటు సమీప ప్రాంతాల్లో అందుబాటులో లేని పరిస్థితి కల్పించారు. వాస్తవంగా రోగికి ప్రాణాపాయం ఉంటే రెఫర్ చేయడం, వారిని 108 వాహనంలో తరలించడంలో తప్పులేదు.
మదనపల్లె ఆస్పత్రిలో నిపుణులైన డాక్టర్ల కొరత, సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలతో రోగ నిర్థారణ తరువాత కూడా రెఫరల్ కేసులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధానంలో అంటే బోధనాస్పత్రికి తగిన వసతులు, సిబ్బందిని నియమించడంలో జరగుతున్న జాప్యం ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై బోధనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గాయత్రీదేవిని 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి పలకరించారు.
"తాజా సంఘటనకు సంబంధించి వివరాలు పూర్తిగా తెలియవు" అని చెప్పారు. "బోధనాస్పత్రిలో నిపుణుల కొరత ఉంది" అని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇలా ఉంటే కష్టమే కదా..?
2025 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు 108 వాహనాల పరుగు ఎలా సాగిందంటే...
మదనపల్లె ఆస్పత్రి నుంచి రోగులను తిరుపతికి రెఫర్లు చేశారు. ఇప్పటికి 28మందిని తిరుపతికి పంపించారు. ఐదు 108 వాహనాలు 6,642 కిలోమీటర్లు మదనపల్లె నుంచి తిరుపతి మధ్య పరుగులు తీశాయి.
1 మదనపల్లె 108 అంబులెన్స్ : 10 ట్రిప్పులు 2,250 కిలోమీటర్లు
2 నిమ్మనపల్లె 108 అంబులెన్స్: 6 ట్రిప్పులు 1,425 కిలోమీటర్లు
3 వాల్మీకిపురం 108 అంబులెన్స్: మదనపల్లె జిల్లా ఆస్పత్రికి వచ్చి రోగిని తిరుపతి రుయాకు ఐదు ట్రిప్పుల్లో 933 కిలోమీటర్లు ప్రయాణించింది.
4 గుర్రంకొండ 108 అంబులెన్స్ 4 ట్రిప్పులు 1,140 కిలోమీటర్లు
5 రామసముద్రం 108 అంబులెన్స్ 3 ట్రిప్పులు 894 కిలోమీటర్లు ఈరోజు వరకు తిరిగింది.
ఈ పరిస్థితిని చక్కదిద్దడం రోగులకు మెరుగైన సేవలు అందించడానికి ఆస్పత్రుల్లో తగినంత మంది సిబ్బందిని నియమించాలి. 108 అంబులెన్స్ సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలు హెచ్చరిస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది వేచి చూడాలి.