టీచర్లకు P4 బలవంతం కాదు
ఉపాధ్యాయ సంఘాల నిరసనతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం;
By : V V S Krishna Kumar
Update: 2025-07-29 08:11 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పీ4 పథకంలో మార్గదర్శులుగా ఉపాధ్యాయులు వుండాల్సిందే నంటూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వెనక్కు తగ్గింది.ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఉపాధ్యాయులలో ఆందోళన మొదలైంది.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు , ఇతర వత్తిడిలతో సతమతమవుతున్న తమపై P4 అంటూ పిడుగు వేయడం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. టీచర్లను అధిక శ్రీమంతుల జాబితాలలోకి ఎలా తెస్తారని ప్రశ్నించాయి. స్వచ్ఛంధంగా తమలో ఎందరో ఉపాధ్యాయులు పేద విద్యార్థులకు సాయం చేస్తూనే వున్నారని ,అలాంటిది బలవంతంగా కుటుంబాలనే దత్తత తీసుకోవాలనడం ఎంత వరకూ భావ్యమని ప్రశ్నించారు.ఫెడరల్ న్యూస్ కూడా ఉపాధ్యాయుల ఆవేదనపై పలు కథనాలు ప్రచురించింది.ఉపాధ్యాయ సంఘాల వాదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది.
ఉపాధ్యాయ సంఘాల వత్తిడి నేపధ్యంలో టీచర్లను పీ4 లో భాగస్వాములను చేసే విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.జిల్లాల వారీగా గతంలో డీఈవో లు జారీ చేసిన ఉత్తర్వులను సవరించుకుంటున్నారు.పీ4 లో టీచర్లు రిజిస్ట్రేషన్ చేయడం కంపల్సరీ కాదని,ఇష్టమున్న వారు ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు ఏలూరు జిల్లా డీఈవో వెంకట లక్ష్మమ్మ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25 న జారీ చేసిన సర్కులర్ ను ఉపసంహరించి కొత్తగా నిన్నఉత్తర్వులు జారీ చేశారు.టీచర్లు పీ4 లో రిజిస్ఠ్రేషన్ తప్పని సరి కాదని ,వారివారి ఇష్టమని పేర్కొన్నారు.