హైదరాబాద్‌లో గోదావరి బోర్డు..అమరావతిలో కృష్ణా బోర్డు
బనకచర్ల–పోలవరం ప్రాజెక్టుపై సోమవారంలోగా కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం.;
By : The Federal
Update: 2025-07-16 13:07 GMT
గోదావరి బోర్డును హైదరాబాద్‌లోను, కృష్ణా బోర్డును అమరావతిలోను ఏర్పాటు చేసేందుకు కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, ముఖ్యకార్యదర్శులు, ఇంజనీర్లు బుధవారం సమావేశం అయ్యారు. ఇరు రాష్ట్రాల నీటి సమస్యలు, బనకచర్ల–పోలవరం ప్రాజెక్టు వంటి పలు అంశాలపైన చర్చలు జరిపారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదుల నీటి కేటాయింపులపైన చర్చలు జరిగినట్లు చెప్పారు. రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి వెళ్లే చోట్ల టెలీమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. అమరావతిలో కృష్ణా బోర్డు, హైదరాబాద్‌లో గోదావరి బోర్డులు ఉండే విధంగా ఇరు రాష్ట్రాల మధ్య నిర్ణయం జరిగిందని వెల్లడించారు. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు రిపేర్లు, రక్షణ వంటి అంశాలపైన కూడా చర్చించామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకునేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు చర్యలు తీసుకునేందుకు నిర్ణయం జరిగిందన్నారు. బనకచర్ల–పోలవరం ప్రాజెక్టు పై సోమవారం లోగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కమిటీని ఏర్పాటు చేయడం వల్ల కృష్ణా, గోదావరి జలాల సమస్యలపైన, వినియోగంపైన రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేందుకు అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రతిపాదనల్లో అనేక సాంకేతిక అంశాలు ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.