ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తనదైన శైలిలో అడుగులు ముందుకు వేస్తున్నారు. మూడు నెలలుగా కాకినాడ పోర్టుకు వెళ్లాలని ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. మీరు వెళితే వేల మంది పనివాళ్లకు పొట్టకొట్టినట్లైందంటూ ఆపివేస్తున్నారు. ఇదేమిటని చాలా రోజులు ఆలోచించా. ఇవ్వాళ వెళదామనుకున్నా. ఎవరు చెప్పినా వినలేదు. వచ్చా... చూస్తే కాకినాడ పోర్టు దొంగరవాణాకు కేంద్రంగా మారిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సమయంలో డ్రోన్ కెమెరా పోర్టులోని ఓడలు, వాటిల్లో ఉన్న సరుకు, ఇతర వస్తువులు కళ్లకు కట్టినట్లు చూపించింది. ముందు రోజు ఎక్కడైతే జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ వెళ్లి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారో అక్కడి వరకు ఓడలో వెళ్లి పరిశీలించారు. అక్కడికి వెళ్లేందుకు ముందు అధికారులు వద్దన్నారు. అయినా వెళ్లి రావాల్సిందేనంటే తీసుకెళ్లారు. వెళ్లిన తరువాత ఓడ చుట్టూ తిప్పుతున్నారు. కానీ ఓడలోకి ఎక్కనివ్వడం లేదు. చూడండి ఎంత దారుణంగా ఉందో ఒక ఉప ముఖ్యమంత్రికే ఇక్కడ దిక్కులేకుండా ఉందని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ వెంట సొంత మీడియాతో పాటు ప్రభుత్వ మీడియా, ప్రైవేట్ మీడియా కూడా వెళ్లడంతో ఆయన ప్రతి మాటా మీడియాలో వచ్చింది. వేల టన్నుల సివిల్ సప్లైస్ రైస్, వాటితో పాటు మరికొన్ని సాధారణ రైస్ కల్తీచేసి బస్తాల్లో నింపి పంపిస్తున్నారు. సరుకుకు సరైన అనుమతులు లేవు. సరుకును పరిశీలిస్తూ అక్కడే ఉన్న జాయింట్ కలెక్టర్, ఇతర సివిల్ సప్లైస్ అధికారులను ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే మీరేమి చేస్తున్నారని ప్రశ్నించారు. డిప్యూటీ సూపరింటెన్ డెంట్ ఆఫ్ పోలీస్ అక్కడే ఉండటంతో ఆయనను పిలిచి ఇదంతా చూస్తున్నారా? ఏమిటిదంతా? ఎవరు వారు? ఎక్కడికి సరుకు పోతోంది? కల్తీ ఈ స్థాయిలో జరిగింది. పైగా అక్రమ రవాణా జరుగుతోందని ప్రశ్నించారు. షిప్‌లకు ఎక్కించేటప్పుడు అక్కడే ఉండే అధికారితో మాట్లాడుతూ అనుమతుల్లేని సరుకును ఎలా షిప్‌లోకి ఎక్కించారని ప్రశ్నించారు. ఆయన నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. పైగా బయట చెక్ పోస్టు నుంచి వచ్చిన సరుకును ప్రత్యేకించి తాము చెక్ చేసేది ఏమీ లేదని, అలాగే ఓడల్లోకి లోడ్ చేయిస్తామన్నారు. మరి కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు లోడ్ చేస్తే ఎలాగని ప్రశ్నిస్తే ఆ అధికారి నుంచి సమాధానం లేదు. ఇదంతా మీడియా క్షుణ్ణంగా వింటోంది. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులోకి అడుగు పెట్టింది మొదలు ఏమి జరిగిందనే విషయాన్ని డ్రోన్ విజువల్స్ స్పష్టంగా క్యాచ్ చేశాయి. ఈ వీడియోను జనసేన పార్టీ మీడియాకు రిలీజ్ చేసింది.
ఈ ఒక్క వీడియో చాలు పవన్ కళ్యాణ్ రేంజ్ ఓ స్థాయికి పెరిగిపోయిందనేందుకు అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలపై కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. ఇంత జరుగుతుంటే ఇన్నేళ్ల నుంచి అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అవినీతికి నిలువెత్తు సాక్ష్యంగా కాకినాడ పోర్టు ఉందంటే మొదట నమ్మలేదు. కానీ ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. నమ్మాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఓడ రేవులు దేశ భధ్రత అంశంపై కూడా దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ఈ ఓడరేవులో చూస్తుంటే దేశంలోకి ఎక్కడి నుంచి ఎవరైనా రావొచ్చని అర్థమైందన్నారు. ముంబైలోకి వచ్చి వారు కూడా ఇలాగే వచ్చి హోటల్‌ను పేల్చి ఉంటారు. మన వద్దకు కూడా రారని గ్యారెంటే ఏంటి? అంటూ ఆయన ప్రశ్నించారు. చూసే వారికి, వినే వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నది నిజమే కదా చూసేవారికి, వినేవారికి అనిపించింది.
ఆయన విశాఖ పోర్టులో గతంలో దొరికిన కొకైన్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇలా విదేశాల నుంచి ఏదైనా రావొచ్చు. మన దగ్గరి నుంచి ఏదైనా వెళ్లొచ్చు. ఇక్కడ చెకింగ్ అంటూ ఏమీ లేదు అంటూ మండిపడ్డారు. ఇవన్నీ నోట్ చేసుకోవాల్సిందిగా తన పీఎస్‌కు డైరెక్షన్ ఇస్తూ ముందుకు సాగారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నంత సేపు మీడియా ఆయన వెంటే ఉంది. ఆయన మాటలు ఇన్ డైరెక్ట్‌గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భధ్రత, మాదక ద్రవ్యాల వ్యవహారంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నాయని తెలిపేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల స్థాయిలో కాకినాడ పోర్టుకు వెళ్లి ఇటువంటి అవినీతిని ఇప్పటి వరకు ఎవ్వరూ బయట పెట్టలేదు. ఎప్పుడైనా ఎవరైనా వెళితే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు మాత్రం వెళతారు. ఆ తరువాత నేరుగా హె డ్ క్వార్టర్‌కు చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ అలా కాకుండా కోటాను కోట్ల విలువైన రేషన్ బియ్యం, సాదారణ మిల్లు బియ్యం ఎటువంటి అనుమతులు లేకుండా ఖండాలు దాటుతుండటాన్ని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.
శుక్రవారం రాష్ట్రంలో మీడియా, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు మారు మోగింది. యూటూబ్ ఛానల్స్ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో జరిగిన తనిఖీపై మాట్లాడిన మాటలు, తనిఖీ వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఆయన ధైర్యాన్ని పలువురు మెచ్చుకుంటూ యూటూబ్ ఛానల్స్‌లో పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రతినెలా ఇలా ఏదో ఒక సంచలనానికి పవన్ కళ్యాణ్ కారణమవుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఏదో విధంగా మీడియాలో ముందు వరుసలో ఉంటున్నారు. నిజానికి ప్రచారంలో చంద్రబాబు నాయుడును మించిన వారు లేరనే ప్రచారం ఉంది. అయితే ఆయన కూడా పవన్ కళ్యాణ్ ముందు ప్రచారానికి సరిపోడని పలువురు మీడియా వారే వ్యాఖ్యానించడం విశేషం. ఇక రాజకీయ పార్టీల వారి గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిసిటీ విషయంలో పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనంగా మారుతుందని రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ డిపార్ట్‌మెంట్స్‌లో జరుగుతున్న లోపాలను సరిదిద్దాల్సింది పోయి ఎత్తిచూపుతూ ముందుకు సాగుతున్నారు. ఎప్పుడైతే మంచో చెడో ఎత్తిచూపుతుండటంతో ఆయన ప్రచారంలో వేగంగా దూసుకు పోతున్నారు.