ఏపీ 'చెత్త' అయిడియా సూపర్
చెత్త ఇచ్చిన వారికి కూరగాయలు ,పప్పులు ఫ్రీ.. స్వచ్ఛాంధ్ర కోసం సర్కార్ బంపరాఫర్;
By : V V S Krishna Kumar
Update: 2025-08-31 12:33 GMT
భలే మంచి బేరమన్నట్లు ..తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా ఇవ్వడం ,ఇంట్లో పనికిరాని సామాన్లను కూడా పంచాయతీ చెత్త సేకరణ సిబ్బందికి ప్రతిరోజూ అందజేస్తారో , ఆ చెత్తను బట్టి ఉచితంగా కూరగాయలు , పప్పులు అందజేయాలన్నకొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకు వస్తోంది.ఇప్పటికే ఈ విధానాన్ని గుంటూరు జిల్లాలో అమలు చేస్తుండగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల వారీగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చెత్త నుండి సంపద సృష్టించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్ధేశ్యంగా చెబుతున్నారు. తడి చెత్త ను, పొడి చెత్తను వేరు చేసే ఇవ్వడం వల్ల సేంద్రీయ ఎరువులను తయారు చేయనున్నారు. చెత్తకు కూడా విలువ వుందని ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు. అందుకే చెత్తకు కూరగాయలు, పప్పుల పథకం తెస్తున్నారు.
స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ దిశగా
ముఖ్యంగా స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి వినూత్న ఆలోచనతో ముందుకెళుతోంది.చెత్త నుండి సంపద సృష్టి చేయాలని భావిస్తోంది.దీనిలో భాగంగా ప్రజలలో చెత్తపై అవగాహన పెంచడానికి ఈ సరికొత్త కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సంకల్పించింది.దీనికోసం పెద్ద గ్రామపంచాయతీలకు స్వచ్చ రధాలను తీసుకురానున్నారు.అయితే స్వచ్ఛ రథాలను ప్రత్యేకంగా కొనుగోలు చేయాలా , లేక గతంలో వైసీపీ హయాంలో రేషన్ సరఫరాకు వినియోగించిన వాహనాలను వాడాలా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది.
తడి చెత్త -పొడి చెత్తపై అవగాహన
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలోనూ చెత్త సేకరణకు చెత్త డబ్బాలను ఇంటింటికి అందించారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా పారిశుధ్య చెత్త బండ్ల వారికి అందజేయాలని కూడా సూచనలు ఇచ్చారు. అయినా తడి , పొడి చెత్తను కలిపేయడం , చెత్త బండి వాళ్లకు ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ పడవేయడం జరుగుతోంది. కొందరు ప్రభుత్వ నిబంధనలు , సూచనలు పాటిస్తున్నా, చెత్త పై గ్రామీణ మహిళలకు అవగాహన కొరవడుతోంది. పట్టణాలలో కూడా అదే పరిస్థితికి వస్తున్నారు. అందుకే తడి, పొడి చెత్తను వేరు చేయడం , ఇండ్ల లోని పాడై పోయిన మిగిలిన వస్తువులను చెత్త సేకరించే బండి వారికి అందజేయడంపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలలో కూడా చెత్త సేకరణపై ముఖ్యంగా మహిళలలో చైతన్యం నింపడానికి వినూత్న కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుడుతోంది.
సింగపూర్ నమూనా పరిశీలన
జూలై నెలలో సింగపూర్‌లో పర్యటించిన ఏపీ మంత్రి నారాయణ బృందం ఆ దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణపై అధ్యయనం చేసింది. చెత్తసేకరణ వాహనాలు, స్వీపింగ్ మెషీన్లను మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పరిశీలించారు. సింగపూర్ అధికారులను ఘన వ్యర్థాల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో చెత్త సేకరణ చేయడం నుంచి ఘన వ్యర్థాల నిర్వహణ వరకు సింగపూర్ లో ఎలాంటి పద్దతులు అవలంభిస్తున్నారో తెలుసుకున్నారు. సింగపూర్‌లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఆ బృందం పరిశీలించింది. ఏపీలో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.ఇప్పటికే ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించింది.
రోజుకు 6,500 టన్నుల ఘన వ్యర్థాలు
రాష్ట్రంలో రోజుకు 6,500 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నిర్వహణ కోసం 2014-19 మధ్య చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 10 ప్లాంట్లు మంజూరు చేయగా, రెండు పూర్తయ్యాయి. 8 ప్లాంట్లను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరు ప్లాంట్లు ప్రారంభించాలని నిర్ణయించింది. నెల్లూరు, కాకినాడల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ఎల్-1 కింద టెండరు ఎంపిక చేశారు. కర్నూలు, కడపలో ప్లాంట్లకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు కూడా మంత్రి నారాయణ ఇటీవల వెల్లడించారు.కృష్ణా జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు బందరు లేదా ఉయ్యూరులో వెయ్యి టన్నుల సామర్థ్యం కల ప్లాంట్ కోసం స్థలాన్ని చూస్తున్నారు. తిరుపతిలో మరో ప్లాంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్లాంట్లు పెట్టాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై మున్సిపాలిటీలు, అర్బన్ అథారిటీలు ప్రాధాన్యం ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం ఆదేశించారు.పలు రకాల రంగాలలో వచ్చే వ్యర్థాల నిర్వహణకు ఎలాంటి విధానం అమలు చేయాలన్న దానిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది.