తిరుమల బస్సుల్లో ఉచిత ప్రయాణం
మహిళలు 335 బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి రానున్న ఉత్తర్వులు;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-20 05:30 GMT
తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సదుపాయం అందుబాటులోకి రానుంది. మరో 48 గంటల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల సత్యనారాయణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తిరుమలకు ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు.
తిరుమలకు స్త్రీ శక్తి పథకం అమలు చేయడం ద్వారా 335 సప్తగిరి ఎక్స్ప్రెస్ (APSRTC Sapthagiri Express) బస్సు సర్వీసులో మహిళలను ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం లభిస్తుంది. విజయవాడలో శుక్రవారం రాష్ట్రంలోని ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎంలతో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకాతిరుమలరావు సమావేశం కానున్నారు. దీనిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
"తిరుమల సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీససుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సదుపాయంపై మార్గదర్శకాలు అందలేదు" అని తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జగదీష్ చెప్పారు.
పథకం ఇది
"సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా శ్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని అమలు చేస్తాం" అని సీఎం ఎన్ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు
స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్స్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే కార్యక్రమాన్ని సీఎం ఎన్. చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే.
2024 ఎన్నికల మేనిఫెస్టోను టిడిపి కూటమి ప్రకటించింది. మహిళలు ఉచితంగా ప్రయాణించే సదుపాయం అంతర్రాష్ట్ర సర్వీసుల తోపాటు సప్తగిరి ఎక్స్ప్రెస్ లో అనుమతించరని ప్రకటించారు.
మహిళలు ఉచితంగా ప్రయాణించే సదుపాయం తిరుమలకు ఉండదని చెప్పకుండానే సప్తగిరి ఎక్స్ప్రెస్ పేరును ప్రస్తావించారు.
దీనిపై వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రమంతా ఉచిత ప్రయాణానికి మహిళల అనుమతించినా తిరుమల, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న డిపోల నుంచి పొరుగు రాష్ట్రాల మధ్య తిరిగే ఆర్డినరీ బస్సుల్లో మార్గమధ్యలోని ఆంధ్ర పల్లెలకు కూడా వర్తింప చేయకపోవడంపై టిడిపి కూటమి విమర్శలు ఎదుర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సమీక్షించినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ చైర్మన్ ప్రకటన
ఆ విమర్శలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కొనకళ్ల సత్యనారాయణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, "తిరుమలకు కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తాం" అని ప్రకటన చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు, అలాగే తిరుమల నుంచి తిరుపతికి మహిళలు ఉచితంగా ప్రయాణించే సదుపాయం అందుబాటులోకి రానుంది.
రాష్ట్రంలోని మిగతా మార్గాల మాదిరి కాకుండా తిరుమలకు, అక్కడి నుంచి తిరుపతికి రావడానికి ఒక్కో మార్గంలో 19 కిలోమీటర్లు ప్రమాదకరమైన ఘాట్ రోడ్ లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ రెండు ఘాట్ రోడ్లలో ఆర్టీసీ బస్సులు లేదా ఏ వాహనమైన గమ్యస్థానాన్ని చేరడానికి 30 నిమిషాలు నిర్దిష్ట సమయం నిర్ణయించారు.
తిరుమల, తిరుపతి ఘాట్ రోడ్లలో మలుపులు ఎక్కువ. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ సత్యనారాయణ మరో ఆంక్ష కూడా విధించారు.
"ఘాట్ రోడ్డులో ప్రయాణించే బస్సుల్లో సీట్ల పరిమితి మేరకే ప్రయాణికులను అనుమతిస్తాం. నిలబడి ప్రయాణం చేసేందుకు ఆస్కారం ఇవ్వం" అని కొనకళ్ళ సత్యనారాయణ స్పష్టంగా ప్రకటించారు.
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సుల్లో కూడా మొదటి నుంచి సీటింగ్ కెపాసిటీకి మాత్రమే అనుమతిస్తున్నారు.
"మహిళలు సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక కూడా ఆ పద్ధతే అనుసరిస్తాం" అని తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జగదీష్ స్పష్టం చేశారు.
టీటీడీ సహకారం అవసరం
తిరుమల సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ లో మహిళలను ఉచితంగా ప్రయాణించే సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత టిటిడి సహకారం తప్పనిసరిగా అవసరం అవుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
తిరుపతి శ్రీహరి సెంట్రల్ బస్ స్టేషన్, ఏడుకొండలు బస్ స్టేషన్ తో పాటు టీటీడీ శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, రైల్వే స్టేషన్ సమీపం, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ నుంచి సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు తిరుమల మధ్య నడుపుతున్నారు.
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లడానికి ప్రస్తుతం 335 బస్సులు 1350 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో రోజుకు సగటున 85 వేల మంది ప్రయాణికులు తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు.
"ఉచిత సర్వీస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రద్దీ నియంత్రణకు టీటీడీ సహకారం తీసుకునేందుకు ప్రయత్నిస్తాం" అని తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జగదీష్ చెప్పారు. ఇదిలాఉంటే,
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ మరింత ఎక్కువ అవకాశం ఉంది. జిల్లా నుంచి కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాదిగా యాత్రికులు వస్తూ ఉంటారు. ఆ సమయంలో రద్దీ క్రమబద్ధీకరణకు టీటీడీ సిబ్బంది సహకారం అవసరం ఉంటుందని భావిస్తున్నారు.