ఎన్నికల పండగ వస్తుంది.. హైదరాబాద్ ఖాళీ అవుతుంది..!
ఎన్నికల ముందర ఓటర్లను తిరిగి ఆంధ్రకు తీసుకెళ్లడానికి ఆంధ్ర రాజకీయ పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. హెల్ప్‌లైన్ నెంబర్స్‌కు కూడా ఇస్తున్నాయి..
దేశమంతా ఎన్నికల పండగ దశలవారీగా జరుగుతోంది. అతి త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండగ జరగనుంది. దీనికోసం ప్రజలతో పాటు పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. దీంతో హైదరాబాద్ ఖాళీ అవుతోంది. ఎప్పుడూ పండగల సమయంలో ఖాళీ అయ్యే హైదరాబాద్ ఈసారి ఎన్నికలకు కూడా ఖాళీ అవుతోంది. ఆఖరికి బస్సు టికెట్ల ధరలు కూడా ఆకాశాన్నంటేస్తున్నాయి. ఇదేంటీ బాస్ అంటే ఎన్నికలు కదా బ్రదర్ అని రిప్లై వస్తోంది. దీంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ప్రతి పార్టీ తమకు ఓటు వేసే వారిని ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మరీ ఆంధ్రకు తరలిస్తున్నాయి. ఓటేస్తామంటే చాలు ప్రయాణం ఫ్రీ.. అంటున్నాయి పార్టీలు. అందుకోసం సదరు పార్టీలు హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా ప్రకటించాయి.
ఇదేందయ్యా ఇది..
‘‘నా పేరు మాధవి.. మా ఊరు విజయవాడ. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. ఎన్నికల వేళ ఓటు వేయడానికి ఊరు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకుందామని.. యాప్ ఓపెన్ చేస్తే దిమ్మతిరిగిపోయింది. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండగలకు పెంచే దానికంటే అధికంగానే ఉన్నాయి టికెట్ ధరలు. ఒక్కో టికెట్ రూ.2నుంచి 3 వేలు చూపుతోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. కాసేపటికి ఏం చేయలేనని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా చూస్తుంటే.. అందులో నాకు కొన్ని పోస్ట్‌లు కనిపించాయి. అందులో పార్టీ వాళ్లే తమకు ఓటేస్తే ఫ్రీ ట్రావెల్ అంటున్నారు. అది చూసినిప్పుడు.. ఇదేందయ్యా.. ఇది.. ఇలా కూడా చేస్తున్నారా అనిపించింది’’ అని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇదే విధంగా తమకు కూడా జరిగిందంటూ మచిలీపట్నం, తెనాలి, గుంటూరు, వినుకొండ సహా అనేక ఇతర ప్రాంతాల వాసులు కూడా వివరించారు.
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న పోస్ట్‌లు..
‘హైదరాబాద్ నుంచి ఆంధ్రలోని పలు ప్రాంతాలకు వెళ్లడానికి అవస్థలు పడుతున్న ఓటర్లకు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ హైదరాబాద్ టీం వారు మార్నింగ్ స్టార్ వారి సౌజన్యంతో ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది. అందుకోసం..
హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వయా విజయవాడ - శశి +91 90004 95959
హైదరాబాద్ నుండి విశాఖపట్నం వయ రాజమండ్రి - కొండయ్య చౌదరి 095504 07777
హైదరాబాద్ నుండి ఒంగోలు వయ నరసరావుపేట - సుధీర్ +91 97018 44438
హైదరాబాద్ నుండి నెల్లూరు - మాచరావు +91 98488 11125
హైదరాబాద్ నుండి అనంతపురం వయ కర్నూల్ - తేజస్విని పొడపాటి 99499 13513’ అంటూ టీడీపీకి ఓటు వేసేవారి కోసం ఈ సౌకర్యం కల్పించినట్లు ప్రచారం జరుగుతున్నాయి.
అదే విధంగా పిఠాపురం నియోజవర్గం ప్రజలకు కూడా ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగినట్లు మరో పోస్ట్ ప్రచారమవుతోంది. అందులో.. ‘‘ హైదరాబాద్‌లో నివసిస్తున్న పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. ఎలక్షన్స్‌కి వెళ్ళే ప్రజలకు జనసేన పార్టీ తరుపున రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రయాణ సేవలను పొందాలి అనుకునే వాళ్ళు ఈ కింది నంబర్‌లలో మీరు ఉంటున్న ప్రాంతానికి సంబంధించిన వారికి ఫోన్ చేసి మీ పేరు, హైదరాబాద్‌లో ఎక్కడ ఉంటున్నది, మీ ఫోన్ నెంబర్, మీ ఐడి కార్డు (పిఠాపురం నియోజకవర్గ ప్రజలది అవునా కాదా అని తెలుసుకోవడానికి), తెలపాలని కోరుతున్నాం.
పిఠాపురం ప్రజలను 11వ తేదీని తీసుకెళ్లనున్నాం.
ప్రయాణానికి నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 09-05-2024
ఈ అవకాశం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మాత్రమే అని గమనించగలరు.
ఈ ప్రయాణంలో వచ్చినవారికి కొణిదెల సునీల్ హైదరాబాద్ మరియు తన మిత్రబృందం వారిచే స్నాక్స్ మరియు మంచినీటి సదుపాయం ఏర్పాటు చెయ్యటం జరగబడును.
మీ
కొనిదెల సునీల్
9885556677
కనుక పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవలసినదిగా కోరుచున్నాము’ అంటూ జనసేన పవన్ కల్యాణ్‌కు ఓటు వేసే వారికి అవకాశం కల్పిస్తుంది.
ఇదే తరహాలో వైసీపీ వారి తరపున కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎవరికీ సంబంధించిన ఫోన్ నెంబర్లు వంటి వివరాలు బయటకు రాలేదు. కానీ వైసీపీ నేతలు అంతర్గతంగా ఈ ప్రయాణ సదుపాయాలను కల్పిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల ప్రజలను వైసీపీ వారు ఆంధ్రకు ఉచితంగా తీసుకెళ్తున్నట్లు సమాచారం. అయితే ట్రావెల్స్ వాళ్లు రేట్లు పెంచేసిన నేపథ్యంలో పార్టీల వారు ఇలా తీసుకెళ్లడంపై మిశ్రమ స్పందన లభిస్తుంది. కొందరు పార్టీలు స్వార్థం కోసం చేసినా.. ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని, ఇలా ఇప్పుడు కాకుండా మరో రెండు టర్మ్‌ల తర్వాత అయినా ప్రజలు తప్పనిసరిగా ఓటు వేయాలన్న భావనను అలవర్చుకుని సరైన నాయకులను ఎన్నుకోవడం ప్రారంభిస్తారని కొందరు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలా తమకు ఓటు వేసే వారిని ప్రయాణానికి తీసుకెళ్లడం వల్ల ఎన్నికల్లో పారదర్శకత లోపిస్తుందని, ఇది ఖండించదగిన అంశమంటూ వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రయాణ సమయంలో ఓటుకు నోటు కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.