ఉచిత బస్ సాధికారతకు మార్గమా? రాజకీయ స్టంట్ గా మిగులుతుందా?
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఆర్థిక భారం అంటోంది ప్రభుత్వం. అయితే ఆర్టీసీ స్థలాలు వేరే వారికి ఎందుకు దారాదత్తం చేస్తోంది?;
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా 'స్త్రీ శక్తి' పథకాన్ని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ లు APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మొత్తం 11,449 బస్సుల్లో 74 శాతం ఈ పథకం పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలోని సుమారు 2.62 కోట్ల మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఇది రోజువారీ ప్రయాణికులకు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ఆదా చేస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విజయవాడలో ప్రారంభమవుతుంది. జీరో ఫేర్ టికెట్ల కోసం సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశారు. ఇది ఎన్నికల హామీల్లో ఒకటిగా, మహిళల ప్రయాణ భారాన్ని తగ్గించి సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
సాధికారత, ఆర్థిక ప్రయోజనాలు
ఈ పథకం మహిళలకు ముఖ్యంగా గ్రామీణ, మధ్య తరగతి మహిళలకు ప్రయాణ స్వేచ్ఛను అందిస్తుంది. కర్ణాటకలో 'శక్తి' పథకం ఒక సంవత్సరంలో మహిళలు ఉద్యోగాల్లో పాల్గొనటాన్ని 5 శాతం పెంచింది. నెలవారీ ఆదా రూ.680 నుంచి 1,300 వరకు ఉండేలా చేసింది. దీనివల్ల GST సేకరణ 309.5 కోట్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇది మహిళలు ఉద్యోగాలు, విద్య, వైద్య సేవలకు సులభంగా చేరుకోవడానికి సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల్లో మహిళలు మెరుగైన అవకాశాలు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను కూడా చేర్చడం సమ్మిళితత్వాన్ని ప్రోత్సహిస్తుంది. కర్ణాటకలో ఈ పథకం KSRTC రెవెన్యూను రూ.3,930 కోట్లకు పెంచింది. రోజువారీ 60 లక్షల మహిళలు ఉపయోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇది మహిళల ఆర్థిక స్వావలంబనను పెంచి, కుటుంబాలకు ఆదా చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
ఆర్థిక సవాళ్లు
ఈ పథకం రూ.1,942 కోట్ల వార్షిక ఖర్చు (నెలకు రూ.162 కోట్లు) ప్రభుత్వంపై భారం వేస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది కష్టమేనని ప్రభుత్వమే అంగీకరిస్తోంది. APSRTC ఇప్పటికే నష్టాల్లో ఉండగా, ఈ ఉచిత సర్వీసులు దాని ఆదాయాన్ని మరింత తగ్గించవచ్చు. ఆటో డ్రైవర్లు, ఇతర చిన్న రవాణా వ్యవస్థలు నష్టపోకుండా వారికి సహాయ పథకాలు పరిశీలించే పనిలో ప్రభుత్వం ఉంది. క్రౌడ్ మేనేజ్‌మెంట్, మహిళల సేఫ్టీ, మర్యాదపూర్వక ప్రవర్తనను నిర్వహించడం సవాలుగా చెప్పొచ్చు. బస్సుల్లో అసౌకర్యాలు రాకుండా చూడాలి. తిరుమల వంటి ఘాట్ రూట్లు, నాన్-స్టాప్, సూపర్ లగ్జరీ, AC బస్సులు ఈ పథకం నుంచి మినహాయించడం సరైనదేనా? అనే ప్రశ్నలు ఉన్నాయి. మరోవైపు కర్ణాటకలో కూడా మహిళలు మాత్రమే ఉచితమని, మెట్రోలో ఖాళీ కోచ్‌లు వృథా అవుతున్నాయని విమర్శలు వచ్చాయి, ఇది ట్యాక్స్ పేయర్ల డబ్బు వ్యర్థమని కొందరు అంటున్నారు. ఇలా ఉంటే ఆర్టీసీకి ఉన్న విలువైన స్థలాలు వేరే వారికి ధారా దత్తం చేస్తూ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఆర్థిక భారం అనటంలో అర్థమేముందనే విమర్శలు ఉన్నాయి.
రాజకీయ కోణం
ఇది సూపర్ సిక్స్ హామీల్లో ఒకటిగా ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చడం ద్వారా ప్రభుత్వం రాజకీయ లాభం పొందుతుంది. కానీ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు (తమిళనాడు, కర్ణాటక) మహిళల సాధికారతకు సహాయపడినప్పటికీ... అమలు సమస్యలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికులు రాష్ట్ర వాసులే అయి ఉండాలి. ఐడీ ప్రూఫ్ చూపించాలి అనే నిబంధనలు మంచివే, కానీ.. అమలు ఎంత సజావుగా జరుగుతుందో చూడాలి. మొత్తంగా ఈ పథకం మహిళలకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా, దీర్ఘకాలంలో RTCని బలోపేతం చేయడం, ఆర్థిక సమతుల్యతను కాపాడడం అవసరం. ఇది నిజమైన సాధికారతకు మార్గమవుతుందా లేక రాజకీయ స్టంట్‌గా మిగిలిపోతుందా అనేది అమలు తీరుపై ఆధారపడి ఉంది.