ఏపీలో ఫ్రీబస్సు..గైడ్‌లైన్స్ ఇవే
బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు తగిన గుర్తింపు కార్డులు చూపించి ఉచితంగా ప్రయాణించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.;
స్త్రీశక్తి పథకం కింద ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దానికి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఐదు కేటగిరీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేంచాలని నిర్ణయించారు. అయితే కొన్ని సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తిరుమల–తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లోను, నాన్‌స్టాప్ బస్సుల్లోను, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సుల్లోను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించదని స్పష్టం చేసింది. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు కూడా ఈ ఉచిత ప్రయాణ పథకం వర్తించదని తేల్చి చెప్పింది.
ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వీటితో పాటుగా కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమేరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండీని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.