YCP | నెల్లూరులో మంటలు రేపిన మాటలు

వైసిపి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-08 06:16 GMT

నెల్లూరు (Nellore) జిల్లాలో నాయకుల మాటలు హద్దులు దాటాయి. చొక్కాలు పట్టుకునే వరకు వెళ్ళాయి. గత సంస్కృతికి భిన్నంగా దాడులు ప్రారంభమయ్యాయి. మహిళా ఎమ్మెల్యేపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారనే ఆగ్రహంతో వైసీపీ (YSR Congress) మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapureddy Prasannakumar Reddy) ఇంటిని టిడిపి (TDP) మద్దతుదారులు ధ్వంసం చేశారు.

నెల్లూరు సంస్కృతిలో మొదటిసారి ఈ తరహా దాడి జరగడం కలకలం రేపింది. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా, జిల్లాలో పెద్దరెడ్లడే రాజకీయ ప్రాబల్యం. వారి మధ్య మాటల తూటాలు, విమర్శలు చమత్కారంగా ఇప్పటివరకు సాగేవి. మళ్లీ తారస పడితే ఆప్యాయంగా పలకరించుకునే సంప్రదాయం నెల్లూరు జిల్లాలోని అన్ని రాజకీయ నాయకుల మధ్య కనిపించేది.

నెల్లూరు జిల్లాలో ఒకనాటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా తిరగబడింది.

ఎన్నికల ముందు నుంచి..

నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల ముందు నుంచి వైసిపి, టిడిపి నాయకుల మధ్య మాట యుద్ధం మాత్రమే కాదు. వ్యక్తిగత దూషణలు ఆరోపణలతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య జరిగిన పరస్పర ఆరోపణలు వారి ప్రతిష్టను వారే దిగజార్చుకున్నారనే  విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ పరిస్థితి నెల్లూరు జిల్లాలో మరింత ఎక్కువైంది. బూతులు తిట్టడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడే చర్యలకు దిగారు.

ఏం జరిగింది?

నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం నెల్లూరులో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. టిడిపి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిత్వ ఖననం చేసే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆమె రెండో పెళ్లి చేసుకున్న వివరిస్తూ,

"ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అనేక విషయాల్లో ఆమె పిహెచ్డి చేశారు. అని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

"ప్రభాకర్ అన్నా.. నీ భార్య ప్రశాంతి రెడ్డితో నీకు ప్రమాదం ఉంది. నిన్ను లేపేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు" అని కూడా మాజీ ఎమ్మెల్యే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో టిడిపి మద్దతుదారులు ప్రధానంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది.

నల్లపురెడ్డి ఇంటి పై దాడి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీలో ప్రధానంగా నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు.

నెల్లూరు నగరం కొండాయిపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై భారీగా వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తన కొడుకుతో కలిసి బయటికి వెళ్లినట్టు సమాచారం. దీంతో ఇంటి ఆవరణలో ఉన్న బెంజి కారుతో సహా, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు సామాగ్రిని కూడా చిందరవందరచేసి చేసి దొరికిన వస్తువులు దొరికినట్లు విధ్వంసానికి పాల్పడ్డారు. కొన్ని వస్తువులను ఇంటి బయటకు తీసుకువచ్చి పడేసి తగలబెట్టారు.

నాయకుల రంగ ప్రవేశం

మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందనే సమాచారంతో వైసిపి శ్రేణులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు వైసిపి నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, పార్టీ నాయకులు మురళి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తో పాటు భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు.

"ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ నాయకుల పనే" అని వారు ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొని, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

చూసుకుందాం..

"మాజీ ఎమ్మెల్యే ప్రసన్నను చంపేస్తారా? దీనికి ఏం భయపడం. ఎంతటికైనా చూసుకుందాం" అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. కొండాయపాలెంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఇంటిని ఆయన పరిశీలించారు. ధ్వంసమైన వస్తువులను కూడా చూసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ,

"నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై" హత్య కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.

"ఇలాంటి దాడులు, బెదిరింపులకు ఏమాత్రం భయపడం అన్నిటికి సిద్ధంగానే ఉన్నాం" అని కూడా ఆయన  అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.

ఘటన స్థలానికి వచ్చిన పోలీసు అధికారులతో కూడా ఆయన వాగ్వాదానికి దిగినట్లు సమాచారం అందింది. ప్రధాన వ్యక్తులపై కేసులు నమోదు చేయడంలో వివక్ష చూపించవద్దని ఆయన డిమాండ్ చేశారు. అలా చర్యలు తీసుకుంటేనే అసలు నిందితులు ఎవరో బయటకి వస్తారని అనిల్ కుమార్ యాదవ్ సూచించారు.

ఈ సంఘటన నేపథ్యంలో నెల్లూరు పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. అధికార టిడిపి, వైసిపి మధ్య యుద్ధం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. గతంలో ఎన్నడు లేని విధంగా చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో నెల్లూరు పట్టణంలో ఇదే ప్రధాన చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు ఏ దిశగా మారుతాయి అని ఆందోళన స్థానికుల్లో వ్యక్తం అవుతుంది.

Similar News