టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి, బీదా

సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.

Update: 2024-10-09 15:02 GMT

మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌ రావులు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలోనే మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావులు టీడీపీ కండువాను కప్పుకున్నారు. వారి ఇరువురికి టీడీపీ జాతీ అధ్యక్షులు, సీఎం చంద్రబాబే స్వయంగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఇటీవల వారిద్దరు వైఎస్‌ఆర్‌సీపీకి, రాజ్య సభ పదవులకు రాజీనామా చేశారు. టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్‌ను, ఆయన వ్యవహార శైలిని తీవ్రంగానే విమర్శించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన బీదా కుటుంబానికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో మంచి అనుబంధం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడుతోను, ఆ పార్టీలోని సీనియర్‌ నేతలతోను సత్సంబంధాలు ఉన్నాయి. ఇలా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్న బీదా మస్తాన్‌ రావు 2019లో వైసీపీలో చేరారు. నాటి వైసీపీ ప్రభుత్వం 2022లో ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసి పార్లమెంట్‌కు పంపించింది. అయితే మోపిదేవి వెంకటరమణ తొలుత కాంగ్రెస్‌లో ఉన్నారు. మాజీ సీఎం వైఎస్‌ఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. 2012లో వైసీపీలో చేరారు. జగన్‌ కేసుల్లో జైలుకెళ్లిన వారిలో మోపిదేవి కూడా ఉన్నారు. తర్వాత ఆయనను రాజ్యసభకు పంపించారు. అలా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన ఈ ఇద్దరు నేతలు తాజాగా టీడీపీ జెండా కప్పుకున్నారు.


Tags:    

Similar News