మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు ఆప్కాబ్ చైర్మన్ పదవి
కూటమి భాగస్వాములైన జనసేన, టీడీపీ నాయకులకు ఈ పదవులను పంచుకున్నాయి.;
By : The Federal
Update: 2025-05-11 12:42 GMT
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తాజాగా కొన్ని నామినేటెడ్ పదువులను భర్తీ చేసింది. ఆప్కాబ్ చైర్మన్ పదవితో పాటు మరి కొన్ని డీసీసీబీ చైర్మన్ పదవులను కూడా భర్తీ చేసింది. వీటిల్లో కొన్ని టీడీపీకి కేటాయించగా, మరి కొన్నింటిని జనసేనకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్) చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును నియమించింది. దీంతో పాటుగా ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(డీసీసీబీ) చైర్మన్‌గా కూడా గన్ని వీరాంజనేయులు బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కామేపల్లి సీతారామయ్యకు డీసీసీబీ చైర్మన్ పదవి దక్కింది. కాకినాడ జిల్లాకు చెందిన జనసేన నాయకుడు తుమ్మల రామస్వామి(బాబు)ను కాకినాడ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నియమించారు. ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్(డీసీఎంఎస్)గా జనసేన పార్టీకి చెందిన చాగంటి మురళీ కృష్ణ(చిన్నా)ను, ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు కసిరెడ్డి శ్యామలను ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గాను, కాకినాడ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పి చంద్రమౌళిని కాకినాడ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గాను కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆదివారం కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆప్కాబ్ చైర్మన్‌గా నియమించిన గన్ని వీరాంజనేయులు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు. గన్ని వీరాంజనేయులు ప్రస్తుతం ఏలూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఉంగుటూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) మీద 8930 ఓట్లతో గన్ని వీరాంజనేయులు గెలుపొందారు. తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో అదే ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు చేతిలో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన గన్ని వీరాంజనేయులు ఓటమి చవిచూశారు. 2024 ఎన్నికల్లో ఉంగుటూరు అసెంబ్లీ నియోజక వర్గం స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఈ ఎన్నికల్లో కూటమి తరపున జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన పట్సమట్ల ధర్మరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు.