జోగి రమేష్ అతడి స్నేహితుడే..
ఇదిగో సాక్ష్యం అంటున్న టీడీపీ, నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
By : The Federal
Update: 2025-10-18 12:16 GMT
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ని నకిలీ మద్యం తయారీ కేసుతో సంబంధం ఉందని నిరూపించేందుకు టీడీపీ వర్గాలు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని సాక్ష్యాధారాలు సేకరించిన పార్టీ నాయకులు తాజాగా మరో ఫోటోను మీడియాకి రిలీజ్ చేశారు.
ఈసారి నకిలీ మద్యం కేసులో ఏ-1 నిందితుడు జనార్ధన్‌రావు, ఆయన సోదరుడు జగన్ మోహన్‌రావులతో కలిసి జోగి రమేష్ ఓ పెళ్లిలో పాల్గొన్న ఫొటోలు బయటకు వచ్చాయి. మొన్న జనార్ధన్‌రావు వాంగ్మూలం, నిన్న వాట్సాప్ చాట్, నేడు ఫొటోలు .. ఇలా నకిలీ మద్యం కేసులో జనార్ధన్‌రావు- జోగి రమేష్ మధ్య లింకులు బయటపడుతున్నాయి.
జోగి రమేష్ ప్రోద్భలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్టు ఇప్పటికే జనార్ధన్‌రావు ఎక్సైజ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
జనార్దన్ ఏమి చెప్పారంటే...
నకిలీ మద్యం వ్యవహారంలో అసలు స్కెచ్ వైసీపీ నాయకుడు జోగి రమేష్ అని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు వెల్లడించాడు. వైసీపీ హయాంలోనే పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం చేశామని.. ఆ సమయంలో ఏమీ కాదని.. పోలీసులు పట్టుకుంటే బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో నిఘా ఎక్కువ కావడంతో నకిలీ మద్యం తయారీ ఆపేశామన్నారు. నకిలీ మద్యం తయారీ వెనుక జరిగిన అన్ని విషయాల్నీ జనార్దన్రావు ఒక వీడియో రూపంలో వెల్లడించారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో మద్యం దుకాణాలను లాటరీలో పొందానని.. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ మళ్లీ నకిలీ మద్యం తయారు చేయమన్నారని జనార్దన్ రావు చెప్పారు.
'కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలే చేసే కుట్రతో.. మళ్లీ నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ నాతో చెప్పారు. ఇబ్రహీంపట్నంలో పెట్టాలని అనుకున్నా కానీ, జోగి రమేష్ ఆదేశాలతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాం. తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే ఒక వేళ దొరికితే.. ప్రభుత్వంపై బురద చల్లవచ్చని.. జోగి రమేష్ సూచించారు. పై వారి ఆదేశాలతోనే తనకు నమ్మకస్తుడిని కాబట్టి ఈ పని అప్పజెప్పుతున్నానన్నారు. నువ్వైతేనే ఈ పని చేయగలవు అని జోగి రమేష్ నాతో అన్నారు. లిక్కర్ తయారీ చెయ్యండి. మంచి సమయం చూసి మీరు ఎవరూ దేశంలో లేనప్పుడు బయటపెట్టి దానిని ప్రభుత్వం మీద రుద్దుదామని జోగి రమేష్ నాతో అన్నారు. వేరేవాళ్ల పేరుమీద రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి అన్ని యంత్రాలు తీసుకొచ్చాం' అని జనార్దన్ గతంలో చెప్పారు.
జనార్దన్ ఇంకా ఏమని చెప్పారంటే...
"ఆర్థిక ఇబ్బందులు నుంచి బయట పడేస్తానని జోగి రమేష్ నాకు హామీ ఇచ్చారు. అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్ దగ్గరకు పంపారు. అ తరువాత జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడని జనార్దన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. దొరికితే అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పిన జోగి ఇప్పుడు పట్టించుకోవడం లేదని" చెప్పారు.
నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ సూత్రధారిగా బయటకు రావడం సంచలనంగా మారనుంది.