మాజీ సీఎం జగన్ కలవరం! వినుకొండలో ఏమి చేయబోతున్నారు?

పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులతో మాజీ సీఎం కలవరం చెందుతున్నారా? వినుకొండలో ఆయన ఏమి చేయనున్నారు? కార్యాచరణా? వేచిచూసే ధోరణా?

Update: 2024-07-19 04:11 GMT

మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి గురువారం మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకున్నారు. మోకాలికి శస్త్ర చికిత్స కోసం చేయించుకోవడానికి ఆయన మూడు రోజుల కిందట బెంగళూరు నివాసానికి వెళ్లారు. ప్రచార సమయంలో కాలికి చిన్న దెబ్బ తగలడంతో విశ్రాంతి కోసం వెళుతున్నారని సాక్షి దినపత్రికలో వార్త వచ్చింది. అయితే ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో, సభకు రావడానికి ఇబ్బందికర పరిస్థితి ఉండడం వల్లే ఆయన రోజుల వ్యవధిలోనే తిరిగి బెంగళూరుకు వెళ్లారని వార్తలు వెలువడ్డాయి.

ఉన్నఫళంగా ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకోవడం వెనుక రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో కలవరం చెందుతున్నట్లు కనిపిస్తోంది. అందులో ప్రధానంగా రెండు రోజుల కిందట వినుకొండలో వైఎస్ఆర్ సీపీ మద్దతుదారుడు రషీద్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై పాత మిత్రుడు జిలానీ కత్తితో నరికి హత్య చేసిన సంగతి తెలిసిందే.
"ఈ సంఘటన పాతకక్షల నేపథ్యంలో జరిగింది" అని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రకటించారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. "సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే దర్యాప్తు చేయకుండా" ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా,
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నగర పాలక సంస్థలు, మున్సిపల్ పాలకవర్గాలు చేజారుతున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ సీపీని వీడిన కౌన్సిలర్లు చాలా మంది టీడీపీలో చేరారు. ఇంకా చాలా పాలకవర్గాలు కూడా అదే బాటలో ఉన్నట్లు వెలువడుతున్నాయి. పుంగనూరులోని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. రెడ్డెప్ప నివాసంలో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై టీడీపీ కూటమి మద్దతుదారులు చుట్టుముట్టి 24 గంటల క్రితం దాడులకు పాల్పడిన సంఘటన నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్. జగన్ ఆందోళనకు గురయ్యారని భావిస్తున్నారు. ఎక్స్ వేదికగా మాజీ సీఎం వైఎస్. జగన్ స్పందించారు.

" ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడా కనిపించడం లేదు" అని వైఎస్. జగన్ ఆరోపించారు. "ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది" అని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీని అణగదొక్కడానికే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. "కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలి" అని వైఎస్. జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఆయన లేఖపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

"బాబాయ్ వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు, ఆయన కుమార్తె, మీ చెల్లి (వైఎస్. జగన్) వైఎస్. సునీత రెడ్డి పోరాటం, డాక్టర్ సుధాకర్ ను మానసిక క్షోభకు గురిచేసి, చంపేయడం, జడ్జి రామకృష్ణపై జరిగిన దాడి ఘటలపై దర్యాప్తు చేయడానికి లేఖ రాయండి" అని మాజీ సీఎం వైఎస్. జగన్ కు హోంమంత్రి అనిత సవాల్ చేశారు. " ఐదేళ్ల వైఎస్ఆర్ సీపీ పాలనలో విషపు బీజాల అవశేషాలే కొన్ని సంఘటనలకు కారణం, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం" అని ఆమె గుర్తు చేశారు.

టీడీపీ అధికార ప్రతినిధి, మహాసేన రాజేష్ ధీటుగా స్పందించారు. "వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ కాలంలో 600 ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు హత్యకు గురయ్యారు" అని ఆరోపించడంతో పాటు "మాదకద్రవ్యాలు యథేచ్ఛగా దిగుమతి చేసి, గంజాయిని గత ప్రభుత్వం విచ్చలవిడిగా పెంచింది. దీనివల్లే ఘోరాలు, అకృత్యాలు పెచ్చుమీరాయి" అని ఆరోపించారు. "ఎక్కడ హత్యలు, దాడులు జరిగినా, టీడీపీకి అంటగడుతున్నారు" అని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
నాయకుల్లో .. ఆందోళన
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే చోటుచేసుకున్న పరిణామాలతో వైఎస్ఆర్ సీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్. జగన్ పులివెందులలో రెండుసార్లు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ తరువాత ఆయన మోకాలికి చికిత్స పేరుతో బెంగళూరుకు పరిమితం కావాలనే వెళ్లిన నేపథ్యంలో పార్టీ నేతలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా బహిరంగంగా రావడానికి సాహసించడం లేదు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం వైఎస్. జగన్ జనజీవనంలోకి రావాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
పార్టీ శ్రేణులకు భరోసా కోసమేనా?

పల్నాడులోని వినుకొండలో పార్టీ మద్దతుదారుడు హత్యకు గురిరావడం, పుంగనూరులో తమ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఎదుర్కొన్న ప్రతిఘటన తరువాత మాజీ సీఎం వైఎస్. జగన్ బెంగళూరులో విశ్రాంతి తీసుకోవాలనే భావన వీడి, తాడేపల్లికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ శ్రేణులు అధైర్యపడకుండా, వారికి భరోసా ఇవ్వడానికి జనంలోకి రావడానికి సంసిద్ధం అయ్యారని భావిస్తున్నారు. అందులో భాగంగా వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు, అంత్యక్రయలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సామాచారం. శుక్రవారం ఉదయం ఆయన వినుకొండకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆ తరువాత తన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వినుకొండలో జరిగిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో మాట్లాడినట్లు సమాచారం.
మాజీ సీఎం వైఎస్. జగన్ మాటలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ఘాటుగానే స్పందించారు.
"ప్యాలెస్లో కూర్చుని కుట్రలు చేయడం మంచిది కాదు" అని ఆక్షేపణ తెలిపారు. "శవాలతో రాజకీయాలు చేసే మీ (వైఎస్. జగన్) విష సంస్కృతికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పే నెల క్రితం వచ్చిన ఎన్నికల ఫలితాలు" అని గుర్తు చేశారు. "నేరాలు చేసి, ఇతరులపైకి నెట్టే కపట నాటకాలకు కాలం చెల్లింది" అని నారా లోకేష్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో...
కార్యాచరణ ఉంటుందా?
వినుకొండకు రానున్న మాజీ సీఎం వైఎస్. జగన్ ఏమి చేయబోతున్నారు? ఏ నిర్ణయం ప్రకటిస్తారనేది ఆసక్తిగా మారింది. నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తరువాత, దీర్ఘకాలిక కార్యక్రమాల కార్యాచరణ ప్రకటిస్తారని భావించారు. ఆ తరువాత కూడా ఆయన పులివెందులకు మూడు రోజుల పర్యటనకు వెళ్లనప్పడు కూడా రాయలసీయ నేతలతో సమీక్షించి,కార్యాచరణ ప్రకటిస్తారని కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే, పులివెందులలో చేసిన అభివృద్ధి పనల బిల్లులు మంజూరు చేయలేదనే స్థానిక కౌన్సిలర్లు, నాయకులు గగ్గోలు పెట్టడంతో, మాజీ సీఎం వైఎస్. జగన్ పర్యటన రద్దు చేసుకుని బెంగళూరుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన వినుకొండలో ఏమి మాట్లాడతారనేది వేచి చూడాలి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరుకు వచ్చినప్పడు మాజీ సీఎం వైఎస్. జగన్ "సీఎం చంద్రబాబు శిశుపాలుని తరహాలో పాపాలు ప్రారంభం అయ్యాయి" అని వ్యాఖ్యానించారు. దీని ద్వారా ఇంకొంతకాలం వేచిచూసే ధోరణితో వ్యవహరించాలా? అనేది కూడా చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News