శ్రీవారి యాత్రికులకు స్టార్ రుచులతో అన్నప్రసాదం !

తిరుమలలో ఒక రోజు ఉచిత అన్నదానం ఖర్చు రూ. 38 లక్షలా? వేలాది మందికి స్టార్ హోటళ్లకు దీటుగా ఆహారం అందించడం సాధ్యమా? మొదటిసారి దక్షిణాదిలోని పాకశాస్త్ర నిపుణులను టీటీడీ ఎందుకు పిలిపించింది.

Update: 2024-07-10 08:31 GMT

ప్రపంచ ప్రసిద్ధగాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే యాత్రికులకు రుచి, పరిశుభ్రమైన ఉచిత ఆహారం అందించడానికి అన్నప్రసాద తయారీ విధానం ఆధునీకరించాలని సంకల్పించింది. ఇందుకోసం టీటీడీ చరిత్రలో మొదటిసారి దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాత చెఫ్ లతో పాటు పాకశాస్ర్త నిపుణులతో సంప్రదింపులు సాగించింది.

పరిపాలన తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తా. అని సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఆశయాలకు అనుగుణంగా టీటీడీ ఈఓ జే. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి ఆన్ డ్యూటీలోకి దిగారు. టీటీడీలో 17 ప్రధాన పరిపాలనా శాఖలపై ముమ్మరంగా సమీక్షలు సాగిస్తున్నారు.


 యాత్రికులకు స్టార్ రుచులు...!
తిరుమలలో యాత్రికులు వడ్డిస్తున్న అన్నప్రసాదాల్లో నాణ్యత లోపించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక్కడ విందు భోజనం మాదిరి అరటిఆకులో అన్నం, కూరగాయలతో తయారు చేసిన సాంబార్, పచ్చడి, రసం, మజ్జిగతో పాటు కూరగాయల వేపుడు, తీపి పదార్థం వడ్డిస్తారు. ఇందుకోసం ఒకరోజు అన్నదానానికి రూ. 38 లక్షలు ఖర్చు అవుతుంది. ఉదయం అల్పాహారానికి రూ. ఎనిమిది లక్షలు, మధ్యాహ్నం భోజనానికి రూ. 15 లక్షలు, రాత్రి భోజనానికి మరో రూ. 15 లక్షలు అవుతుందని టీటీడీ అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానుక అందించే దాతలు యాత్రికులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించే అవకాశం తోపాటు, వారి పేరు వెంగమాంబ అన్నదాన సత్రంలో ప్రకటించి, బోర్డుపై రాస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన అన్నదాన సత్రంలో వంటకాలు బాగా లేవు. అనే అసంతృప్తి వ్యక్తం కాకుండా...
నిపుణులతో ఈఓ చర్చలు
దీనిపై కూడా దృష్టి సారించిన ఈఓ శ్యామలరావు ఆ విభాగంపై కూడా సమీక్షించారు. యాత్రులకు రుచి, నాణ్యతతో కూడిన ఆహారం అందించడానికి శ్రద్ధ తీసుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ పాకశాస్ర్త నిపుణులతో సమీక్షించి, సలహాలు తీసుకున్నారు. జీఆర్టీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ సీఈఓ విజయ్ విక్రమ్ కోటా, ప్రఖ్యాత చెఫ్, సౌత్ ఇండియా చెఫ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదరన్, చెఫ్ తిరులోగ చందర్, ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ -తిరుపతి హెడ్ చెఫ్ శ్రీ శీతారామ్ ప్రసాద్, కిచెన్ కన్సల్టెంట్స్, డిజైనర్ శ్రీ రితేష్ చౌదరి, దీపక్, నితీష్ అన్నదాన సత్రాన్ని పరిశీలించడంతో పాటు, వంటశాల తీరును కూడా పరిశీలించి, సూచనలు చేశారు. వారి వెంట టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, స్పెషల్ క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి ఉన్నారు.
"పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని వంటశాలలను ఆధునీకరించాలి" అని పాకశాస్త్ర నిపుణులు సూచించారు.


వారు ఇంకా ఏమి చెప్పారంటే..
"అన్నప్రసాద భవనంలో సేవలందిస్తున్న సిబ్బందికి శిక్షణతో పాటు నైపుణ్యం పెంచాలి. ఇన్ హౌస్ ల్యాబ్ ఏర్పాటు చేసి, తనిఖీ చేయాలి" అని గుర్తు చేశారు. "ఆహార పదార్థాల పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వహణ" పై ప్రత్యేక సూచనలు చేశారు. పరికరాల యాంత్రీకరణ, ఆహార పదార్థాలు రుచితో పాటు వేగంగా తయారు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులపై సూచనలు చేశారు. ప్రధానంగా "మూడు నెలలకోసారి ఫుడ్ అనలిస్ట్ సూచనలు ఖచ్చితంగా తీసుకోవాలి" అని ప్రత్యేకంగా గుర్తు చేశారు.
వీటిని పరిగణలోకి తీసుకున్న టీటీడీ ఈవో శ్యామలరావు "నిపుణుల సూచన మేరకు వేగవంతంగా పక్కా ఏర్పాట్లు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలి" అని అధికారులను ఆదేశించారు. మళ్లీ సమావేశమై సామాన్య భక్తల కోసం రుచికరమైన ఆహార పదార్థాల తయారీపై సమీక్షిద్దామని సూచించారు.
ఇంత కసకత్తు ఎందుకు?
తిరుమలలో ఆకలి అనే మాటకు చోటు ఉండకూడదు. అందుకోసమే టీటీడీ మాతృశ్రీ తరిగొండ (చిత్తూరు జిల్లా వాల్మీకిపురం సమీపంలోని పల్లె) వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తోంది. ఈ అన్నదాన సత్రంలో మొదట 2000 మందికి అన్నదానం చేసే లక్ష్యంతో 1985లో ఏప్రిల్ 6న అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీ. రామారావు ప్రారంభించారు. దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే 18వ శతాబ్దం నుంచే ఆమె అన్నదానానికి శ్రీకారం చుడితే, అప్పటి హథీరాంజీమఠం ఇన్‌చార్జి మహంత్ ఆత్మారామ్‌దాస్జీ వెంగమాంబకు ప్రస్తుత రంభగీచా తోటలో ఒక చిన్న గడ్డి గుడిసెను సమర్పించారు. అది దినదినం విస్తరిస్తూ, వేలాది మంది ఆకలిబాధ తీర్చడమే కాదు. అన్నప్రసాదంగా అందుబాటులో ఉంది.


రోజుకు 60 వేల మందికి...
తిరుమలకు పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను పరిగణలోకి తీసుకున్న టీటీడీ అన్నప్రసాద కేంద్రాలను మరింతగా విస్తరించింది. తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు పీఏసీ-1, 2తో సహా తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాల వద్ద కూడా అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు ఒక డిప్యూటీ ఈఓ, పర్యవేక్షణలో ఏఈఓ, సూపరింటెండెండ్, సూపర్ వైజర్లు, సిబ్బందితో పాటు కాంట్రాక్టు సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు.
స్టేట్ ఆఫ్ ఆర్ట్-టెక్నాలజీతో: టీటీడీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అన్నదానసత్రం భవనంలో నిరీక్షణ లేకుండా యాత్రికులు ఒకేసారి వెయ్యి మంది కూర్చుని భోజనం చేయడానికి అనువైన భారీ హాళ్లు నిర్మించారు. మరియు కిరాణా సామాగ్రిని నిల్వ చేయడానికి ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి.
ట్రస్టుకు విరాళాల వెల్లువ
టీటీడీ నిర్వహిస్తున్న తొమ్మిది ట్రస్టులు, ఒక పథకంలో అన్నప్రసాదం ట్రస్టు ముఖ్యమైన వాటిలో ఒకటి గత మూడు దశాబ్దాల కాలంలో విరాళాలు వెల్లువెత్తాయని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 3, 63, 297 మంది దాతలు విరాళాలు అందించారు. రూ. లక్ష నుంచి ఐదు లక్షల వరకు విరాళం ఇచ్చిన వారు 16,671 మంది, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉన్నవారు 1664, రూ.10 లక్షలు ఆపైన 848 మంది, కోటికిపైగా విరాళం ఇచ్చిన వారు 20 మంది సభ్యులు ఉన్నట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు ట్రస్ట్ వివిధ జాతీయ బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ.531.97కోట్లు ఉంది. మొత్తంపై వడ్డీని అన్నప్రసాదం విభాగంలో రోజూ అపరిమిత సంఖ్యలో యాత్రికులకు ఆహారం అందించడానికి ఉపయోగిస్తుంది. అన్నప్రసాదం కోసం వార్షిక వ్యయం రూ.70కోట్లు. ఫిక్సుడ్ డిపాజిట్ వడ్డీ ట్రస్ట్‌పై ఖర్చు చేసిన డబ్బు రూ.45 కోట్లు అయితే, అన్నప్రసాదానికి టీటీడీ మరో రూ.25 కోట్లను మ్యాచింగ్ గ్రాండ్‌గా అందిస్తుంది. ఏడాదిలలో, సగటున 1.25 కోట్ల మంది యాత్రికులకు అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కూరగాయలు కూడా...
రోజు దాదాపు 13 టన్నుల బియ్యం, ఆరు టన్నుల కూరగాయలు వినియోగిస్తున్న భక్తులకు అన్నప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి టీటీడీ బియ్యం కొనుగోలు చేస్తుంది. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని దాతల నుంచి పెద్ద మొత్తంలో కూరగాయలు కానుకగా సమర్పిస్తుంటారు. అందులో అనేక రకాల కూరగాయల్లో.. వంకాయలు, గుమ్మడికాయ, టమోటాలు, క్యాబేజీ, ముల్లంగి ఉంటాయి.
రోజూ 60 వేల మంది ఆకలితీర్చే అన్నదాన సత్రంలో ఆహార పదార్థాలు నాణ్యంగా లేవనే విమర్శలు ఎక్కువయ్యాయి. అన్నదాన సత్రంలోనే అలజడి సృష్టించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన టీటీడీ ఈఓ శ్యామలరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇక్కడ ఆయన ఎలాంటి సంస్కరణలు తీసుకురానున్నారు? ఎప్పుడు అమలులోకి వస్తాయనేది వేచిచూడాలి.
Tags:    

Similar News