శ్రీవారి ఆలయంలో 30న పుష్పయాగం

ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-28 12:57 GMT
మలయప్పస్వామివారికి పుష్పయాగం (ఫైల్)

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణను వసంత మండపంలో నిర్వహించనున్నారు. అంతకు మునుపు మృత్సంగ్రహణం, ఇతర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సువాసనలు వెదజల్లే తొమ్మిది టన్నుల 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహిస్తారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవాన్ని వివరిస్తారు. 

పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.


మధ్యాహ్నం 1 గంట‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రా భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

పుష్పాధిదేవుడు ”పుల్లుడు” ఆవాహన

పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చిస్తారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేస్తారు. పుష్పయాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందిస్తారు.

ఆర్జిత సేవలు ర‌ద్దు

అక్టోబర్ 29న అంకురార్ప‌ణ కార‌ణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది.
అక్టోబర్ 30 పుష్ప‌యాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ర‌ద్ద‌య్యాయి. తోమాల‌, అర్చ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.
Tags:    

Similar News