ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ప్రవాహం
మధ్యాహ్నం లోపల మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయాలని అధికారులు చూస్తున్నారు.;
భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మళ్లీ విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీ స్థాయిలో వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం పెరగడంతో మూడు రోజుల క్రితం వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. తర్వాత వరద నీటి ప్రవాహం తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. మళ్లీ బుధవారం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో తాజాగా మళ్లీ ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేసేందుకు అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటం, వరద ఉధృతి పెరుగుతున్న క్రమంలో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. దీనికి తోడు సుమారు 3.03 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 69 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సుమారు 2.97లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.