FLamingo |ఫ్లెమింగో ఫెస్టివల్ : రెక్కలు విప్పిన ఆనందం

ప్రకృతి, సంస్కృతి, జీవ వైవిధ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవంగా మార్చింది. సూళ్లూరుపేట వద్ద మూడు రోజుల పక్షుల పండగ ప్రారంభమైంది.;

Update: 2025-01-18 08:04 GMT

సైబీరియా నుంచి వలస వచ్చే పక్షుల సందడిని ప్రభుత్వం పండుగగా మార్చింది. ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు నిర్వహించనున్నఫ్లెమింగ్ ఫెస్టివల్ -2025 శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రకృతి, సంస్కృతి, జీవవైవిధ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవంగా మార్చింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingo Festival) ఫెస్టివల్-2025ను సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లాంఛనంగా ప్రారంభించారు.


సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలం సమీపంలోని నేలపట్టు పక్షుల అభయారణ్యం పర్యావరణ విజ్ఞాన కేంద్రంగా పర్యావరణ ప్రేమికులకు పాఠాలు నేర్పుతోంది. వేల కిలోమీటర్ల దూరం నుంచి రెక్కలకు విశ్రాంతి లేకుండా సైబీరియా నుంచి అవిశ్రాంతంగా తరలి వచ్చే పక్షులు ఏటా అక్టోబర్ నుంచి మరుసటి సంవత్సరం ఏప్రిల్ వరకు ఇక్కడ సందడి చేస్తుంటాయి. వీటిని ఈ ప్రాంత వాసులే కాదు. అటవీశాఖ కూడా దేవతా పక్షులుగా పరిగణిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన విదేశీ పక్షులకు రాష్ట్ర ప్రభుత్వం పండుగ నిర్వహణకు నాంది పలికింది. అందులో భాగంగా..

ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 పక్షుల పండుగ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో హోలీ క్రాస్ సర్కిల్ నుంచి అట్టహాసంగా ర్యాలీ నిర్వహించారు. బెలూన్లు ఎగుర వేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తో కలిసి ప్రారంభించారు. తిరుపతి జేసీ శుభం బన్సల్, టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. ప్రదర్శనలో కళారూపాలు, విన్యాసాల ప్రదర్శన ఆకట్టుకుంది

2001లో ఈ ఉత్సవాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మొదట ప్రకృతి ప్రేమికుల సహకారంతో ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా ఈ సీజన్లో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు సీఎం ఎన్. చంద్రబాబు ఆరు కోట్ల రూపాయలు విడుదల చేయడానికి శ్రద్ధ తీసుకున్నారు. దీంతో..
ఐదుప్రాంతాల్లో ఉత్సవాలు

ఫ్లెమింగో ఫెస్టివల్ -2025 ( Flamingo Festival) సూళ్లూరుపేట సమీపంలోని ఐదు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
1. దొరవారిసత్రం మండలం సమీపంలోని నేలపట్టు వద్ద 460 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన ప్రదేశంలో పక్షుల సందర్శన
2. అటకానితిప్ప వద్ద కూడా పక్షులను సందర్శించే ఏర్పాటు చేశారు.
3. బీవీ.పాలెం వద్ద బోటింగ్ సదుపాయం కల్పించారు. ఇక్కడ 35 పడవలు (Boat's) ఏర్పాటు చేశారు. ప్రతి పడకు ఇద్దరు గజఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
4. సూళ్లూరుపేటలో సాంప్రదాయ వంటల పోటీలు నిర్వహించనున్నారు. సాహస కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.
5.శ్రీసిటీ ఎస్ఈజెడ్ (Sircity SEZ) లో పులికాట్ పర్యావరణంపై వర్క్ షాపు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.
దేవతాపక్షులు
నేలపట్టు పక్షుల అభయారణ్యంలోని విలక్షణ, పర్యావరణ వైవిధ్యంతో నిండి ఉంటుంది. ఇక్కడికి విదేశీ గ్రేపెలికాన్ పక్షులు, కార్మోనెట్ బిల్ పక్షులు(నీటి కాకులు), స్పూన్ బిల్ స్టాక్ పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షులు విడిది కోసం వస్తుంటాయి. సుదూర విదేశీ ప్రాంతాల నుంచి వచ్చే ఈ పక్షులు వాటి సంతతిని పెంచుకోవడమే కాదు. వాటి పిల్లలకు ఆహారాన్ని దగ్గరలో ఉన్న పులికాట్ సరస్సు, సముద్ర నీటి నుంచి తీసుకువచ్చి అందించి వాటిని పెంచి స్విమ్మింగ్, ఫ్లయింగ్ నేర్పించి అనంతరం మార్చి, ఏప్రిల్ మాసాలలో వాటి స్వంత ప్రాంతాలకి తిరిగి వెళ్ళిపోతాయి. ఈ విలక్షణ పక్షులను సందర్శించడానికి, విజ్ఞానం కోసం నేలపట్టు అభయారణ్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
దీనిపై వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డీఎఫ్ఓ హారిక ఏమంటున్నారంటే..
"నేలపట్టు పక్షుల అభయారణ్యం సుమారు 460 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ పర్యావరణ వైవిధ్య కారణాలు అనుకూలంగా ఉండడం వల్లే విదేశీ పక్షులు వస్తున్నాయి. గ్రే పెలికాన్, కార్మోనెట్ బిల్ పక్షులు (నీటి కాకులు), స్పూన్ బిల్ స్టాక్ పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ వంటి అరుదైన పక్షులకు నేలపట్టు అభయారణ్యం విడిది కేంద్రంగా మారింది" అని డీఎఫ్ఓ హారిక విశ్లేషించారు. గ్రే పెలికాన్ పక్షులు దేవత పక్షులుగా పరిగణిస్తారని ఆమె వివరించారు.
Tags:    

Similar News