అసెంబ్లీలో ఎనిమిది జాయింట్ కమిటీల తొలి సమావేశం
స్పీకర్, ఛైర్మన్లు అసెంబ్లీలో ఎనిమిది జాయింట్ కమిటీల తొలి సమావేశం నిర్వహించారు.
By : The Federal
Update: 2025-09-27 09:59 GMT
జాయింట్ కమిటీ సభ్యులు జిల్లాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, చర్చించి, పరిష్కార మార్గాలను సూచించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శనివారం ఎనిమిది జాయింట్ కమిటీల తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర పాల్గొన్నారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఈ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు జిల్లాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, చర్చించి, పరిష్కార మార్గాలను సూచించాలని సూచించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటనలు చేపట్టాలని తెలిపారు. ‘ఈ కమిటీల వ్యవస్థ శాసనసభలకు ఆయువుపట్టు లాంటిది. సభా సమావేశాలు సంవత్సరం పొడవునా జరపడం సాధ్యం కాదు. ఈ కమిటీలు సభ పనిభారాన్ని పంచుకుని, సంవత్సరం పొడవునా పనిచేస్తాయి,‘ అని ఆయన వివరించారు.
ఈ కమిటీలు శాసనసభ, మండలిలోని ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబిస్తూ, ప్రభుత్వ పాలనను సమీక్షించి, ప్రజలకు న్యాయం జరిగేలా చేయడంలో కీలకంగా ఉంటాయని స్పీకర్ అన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం తీసుకునే చర్యలు నైతిక బాధ్యతతో పాటు రాజ్యాంగబద్ధమైన విధి అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, వెనుకబడిన, అసూచిత, మైనారిటీ వర్గాల అభివద్ధి మరియు వారి సమస్యల పరిష్కారంలో ఈ కమిటీలు అపారమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. కమిటీల ఏర్పాటుతో ప్రజల సమస్యలు మరింత సమర్థవంతంగా చర్చించేందుకు అవకాశం ఉంటుందని, ప్రజాస్వామ్య స్థిరత్వానికి ఇవి తోడ్పడతాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు ఆశాభావం వ్యక్తం చేశారు.