TIRUMALA | 'శేషాచలం'ను చుట్టుముట్టిన కార్చిచ్చు..

తిరుమలగిరులు విస్తరించిన అడవులను అగ్నికీలలు చుట్టుముట్టాయి. మంటలు అదుపు చేయడానికి రెండు జిల్లాల అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు.;

Update: 2025-05-02 10:56 GMT

వేసవికాలం కావడం. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అంతే అగ్నికీలలు దావానలంలా శేషాచలం అడవులను చుట్టుముట్టాయి. దీంతో అన్నమయ్య జిల్లా అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ సమాచారం అందగానే శుక్రవారం తిరుపతి డీఎఫ్ఓ వివేక్ సారధ్యంలోని అటవీశాఖ ఫైర్ ఫైటర్స్ 50 మంది రంగంలోకి దిగారు. తిరుమల వైపు మంటలు విస్తరించకుండా, తీవ్రంగా శ్రమిస్తున్నారు.


2014 మార్చి నెలలో తిరుమల గిరులకు సమీపంలో వ్యాపించిన మంటలు దావానలంగా విస్తరించాయి. ఐదు రోజులపాటు కార్చిచ్చు శేషాచలం అటవీప్రాంతాన్ని బుగ్గి చేసింది. రెండో రోజు టీటీడీ అధికారుల సమాచారంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( Indian Air Force ) దళాలు రెండు హెలికాప్టర్లతో రంగంలోకి దిగి, పరిస్థితి అదుపులోకి వచ్చాయి.


శేషాచలం అడవులు 4,755 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. కాగా, ఇదే విస్తీర్ణంలోని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు తాలూకా బాలపల్లె రేంజ్ పరిధిలోని కందిమడుగు అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందడంతో ఆ ప్రాంత రైల్వే కోడూరు సబ్ డీఎఫ్ఓ సిబ్బందితో రంగంలోకి దిగారు. తిరుమలకు సమీపంలోని కుమారధార తీర్థం వైపు మంటలు వ్యాపిస్తున్నట్లు తెలియగానే తిరుపతి డీఎఫ్ఓ వివేక్ స్పందించారు. వెంటనే గురువారం రాత్రి ఒంటి గంటకు సిబ్బందిని రంగంలోకి దించారు. మంటలు ఆర్పడంతో తీవ్రంగా పోరాడుతున్నారు.
రంగంలోకి ఫైర్ ఫైటర్స్
తిరుపతి రేంజ్ పరిధి నుంచి 50 మంది ఫైర్ ఫైటర్స్ ను రంగంలోకి దించారు. గురువారం రాత్రి నుంచి అటవీశాఖ సిబ్బంది మంటలు అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. శేషాచలం అటవీప్రాంతంలో మంటలు విస్తరిస్తున్న ఘటన స్థలం నుంచే ఆయన తిరుపతి డీఎఫ్ఓ వివేక్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు.

"అన్నమయ్య జిల్లా బాలుపల్లె రేంజ్ లోని కంగిమడుగు, మొగిలిపెంట ప్రాంతాల్లోని అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంత సబ్ డీఎఫ్ఓ సుబ్బురాజ్ బాలుపల్లె రేంజ్ సిబ్బంది మంటలు అదుపు చేయడానికి రంగంలోకి దిగారు. ఈ సమాచారం మాకు గురువారం రాత్రి తెలిసింది. వెంటనే తిరుపతి అటవీశాఖ రేంజ్ సిబ్బందిని అప్రమత్తం చేశాం" అని డీఎఫ్ఓ వివేక్ చెప్పారు.
దీంతో అన్నమయ్య జిల్లా బాలుపల్లె రేంజ్ వైపు నుంచి మంటలు అదుపు చేయడానికి యత్నిస్తుండగా, కంగిమడుగు అటవీప్రాంతంలో మంటలు విస్తరించాయి.
తిరుమల డిఎఫ్ఓ, పాపవినాశం డిప్యూటీ రేంజర్, తిరుపతి ఎఫ్ఆర్ఓ సుదర్శన్ సారధ్యంలో 50 మంది సభ్యుల బృందంతో తిరుపతి వైపు మంటలు విస్తరించకుండా శ్రమిస్తున్నారు.
"తుంబురుతీర్థం వైపు వ్యాపిస్తున్న మంటలు మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా" అని డీఎఫ్ఓ వివేక్ వివరించారు.
చెట్ల కొమ్మలతోనే మంటల అదుపు

అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగితే, ఫైర్ ఫైటర్స్, అటవీశాఖ సిబ్బందికి తిప్పలు తప్పవు. తాజా సంఘటనలో కూడా అదే జరిగింది. అన్నమయ్య జిల్లా వైపు నుంచి వ్యాపించిన మండలు తిరుమల, సమీపంలోని పాపవినాశనం వైపు విస్తరించకుండా 50 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. అడవుల్లో వేసవిలో విస్తారంగా ఎదిగే, ఈత మట్టలు, చెట్ల కొమ్మలు విరిచి, మంటలపై కొడుతూ, ఆర్పడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రోడ్డు పక్కన లేదా, కాస్త సమీప ప్రదేశంలో ప్రమాదం జరిగితే, అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించి, మంటలు ఆర్పడానికి వీలు ఉంటుంది.
పాపవినాశనం సమీప ప్రాంతం, తుంబూరతీర్థం ప్రాంతాలకు కాలినడక మినహా వాహనాలు వెళ్లడానికి వీలు ఉండదు. అగ్నికీలలు ఈ ప్రదేశాల మీదుగా శేషాచలం అడవులకు విస్తరించకుండా, ఇటు తిరుపతి, అటు అన్నమయ్య జిల్లా బాలుపల్లె రేంజ్ సిబ్బంది శ్రమిస్తున్నారు.
పదేళ్ల నాటి చేదు ఘటన
తిరుపతి వాసులకే కాదు. శేషాచలం అటవీప్రాంత ప్రేమికులకు తీవ్ర విషాదం మిగుల్చింది. ఈ తరహా సంఘటన మళ్లీ పురరావృతం కాకుండా, అటవీశాఖాధికారులు ముందుజాగ్రత్తలతో అప్రమత్తం గా వ్యవహరించడంతో శేషాచలం బయోడైవర్సిటీకి ముప్పు తప్పింది.
2014 మార్చి19: తిరుపతికి సమీపంలోని మంగళం ప్రాంతానికి సమీపంలోని అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. సగం రాత్రికి ఆ మంటలు దావానలంలా మారి, శేషాచలం అడవులను చుట్టుముట్టాయి. అరుదైన మొక్కలతో పాటు జంతువులు కూడా కాలిబూడిద అయ్యాయి. ఈ మంటలు తిరుమలకు 10 కిలోమీటర్ల వరకు కనిపించడమే కాదు. కమురు వాసన, పొగ కూడా తిరుపతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. అటవీ, టీటీడీ అటవీ సిబ్బందికి ఆ మంటలు అదుపు చేయడం సాధ్యం కాలేదు.
టీటీడీ అధికారులు స్పందించి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోసం విన్నవించారు. రెండో రోజుకే రెండు హెలికాప్టర్లతో రంగప్రవేశం చేసిన ఐఏఎఫ్ సిబ్బంది విరామం లేకుండా హెలికాప్టర్ కు బారీ గోళం లాంటి లెదర్ బొక్కన వేలాడదీసి, గోగర్భం డ్యాం నుంచి నీళ్లు నింపుకుని, మంటలపై చల్లడం ద్వారా ఐదు రోజులకు పరిస్థితిన అదుపులోకి తెచ్చాయి. అప్పటికే వేలాది హెక్టార్లలో అటవీప్రాంతం దగ్ధమైంది.
తిరుమల శేషాచలం అడవుల్లో వ్యాపించిన మంటలు అదుపు చేయడానికి శ్రమిస్తూనే ఉన్నాం. త్వరలోనే పరిస్థతి అదుపులోకి తీసుకుని వస్తాం. జనవాసాలు ప్రధానంగా అటవీ సంపదకు నష్టం జరగకుండా నివారిండచడానికి తమ సిబ్బంది శ్రమిస్తున్నారని డీఎఫ్ఓ వివేక్ ఘటన స్థలం నుంచి వివరించారు.

Similar News