ఎట్టకేలకు ఏపీకీ సెంట్రల్ యూనివర్సిటీ!

రాష్ట్ర విభజన తర్వాత 12 ఏళ్లకు నెరవేరిన కల;

Update: 2025-07-30 06:03 GMT
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ పరిపాలనా భవనం

ఎట్టకేలకు ఏపీకి సెంట్రల్ యూనివర్శిటీ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ లేదనే లోటు తీరింది. అనంతపురం జిల్లా జంతులూరు వద్ద అన్ని హంగులతో ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కే పరిమితమైన సెంట్రల్ యూనివర్శిటీ రాష్ట్ర విభజన తరువాత ఏపీకి లేకుండా పోయింది. విభజన హామీల్లో భాగంగా యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ప్రారంభం ఆలస్యంగా జరిగింది. 2018లో అధికారికంగా ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయం తొలిసారిగా 100 మంది విద్యార్థులతో విద్యా కార్యకలాపాలను ప్రారంభించింది. 2025 నాటికి విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య 1,600లకు చేరుకుంది. ఏపీకి విద్యా మణిహారంగా మారనుంది.

జ్ఞానసీమ’ నామకరణం

విశ్వవిద్యాలయానికి ‘జ్ఞానసీమ’ అనే పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పేరు రాయలసీమ ప్రాంతంలో జ్ఞాన వ్యాప్తికి కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయం ఉంటుందనే ఆకాంక్షతో పెట్టారు.


ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనాలు

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్శిటీ లేని కొరత ఈ సంస్థ స్థాపనతో తీరింది. ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో ఉన్నత విద్యా అవకాశాలను విస్తరిస్తుంది. స్థానిక యువతకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతుంది. అంతేకాక ఈ విశ్వవిద్యాలయం పరిశోధన, ఆవిష్కరణలకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ స్థాపన కేవలం ఒక కొత్త విద్యా సంస్థ ఏర్పాటు కంటే ఎక్కువ ఎక్కవ ప్రాముఖ్యమైనదని చెప్పొచ్చు. ఇది రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం వంటి లక్ష్యాలతో ఉంటుంది. ఈ విశ్వవిద్యాలయం రాయలసీమలోని అనంతపురంలో స్థాపించబడటం వెనుకబడిన ప్రాంతంలో విద్యా అవకాశాలను విస్తరించడం, స్థానిక యువతకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం ఉద్దేశం.


కేంద్ర పోటీ పరీక్షలకు సంబంధించి సిలబస్

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ కేంద్ర పోటీ పరీక్షలలో (UPSC, SSC, బ్యాంకింగ్, రైల్వే వంటివి) విజయం సాధించేందుకు విద్యార్థులను సిద్ధం చేయడానికి ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ విశ్వవిద్యాలయం రూపొందించే సిలబస్ ఆధునిక అవసరాలకు అనుగుణంగా, ఇండస్ట్రీ 4.0 ఎడ్యుకేషన్ 4.0 సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుంటుంది.

1. సాంకేతికత, సామాజిక శాస్త్రాలు, సహజ శాస్త్రాలలో వివిధ కోర్సులు అందించడం ద్వారా విద్యార్థులు వివిధ రంగాలలో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలు ఉంది.

2. ఇంటరాక్టివ్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్‌పై దృష్టి సారించడం ద్వారా విద్యార్థులకు విశ్లేషణాత్మక నైపుణ్యాలు, సమస్యా పరిష్కార సామర్థ్యాలు అలవడతాయి. ఇవి పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి అవసరం.

3. ఇండస్ట్రీ సహకారంతో స్వల్ప, దీర్ఘకాలిక వృత్తి కోర్సులు అందించడం ద్వారా విద్యార్థులు ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సంపాదించ గలుగుతారు. ఇది పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి అదనపు ప్రయోజనంగా ఉంటుంది.

4. పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి అవసరమైన సామాజిక తెలివి, క్రాస్ కల్చరల్ నైపుణ్యాలు, కంప్యూటేషనల్ థింకింగ్ వంటి నైపుణ్యాలను అందించే కోర్సులు యూనివర్సిటీ వారు రూపొందిస్తారు.


కొత్త భవనాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి

విశ్వవిద్యాలయ నిర్మాణ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 711 కోట్ల రూపాయలను కేటాయించింది. మొదటి విడత భవన నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) మంగళవారం వర్చువల్ విధానంలో ఈ భవనాలను ప్రారంభించారు. ఈ భవనాలలో విద్యా బ్లాక్‌లు, వసతి గృహాలు, పరిపాలనా కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 492 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ ఏర్పాటైంది. 2023లో రూ. 350 కోట్లతో రెండు అకడమిక్ భవనాలు, మూడు వసతీ గృహాలు, పరిపాలనా భవనం, అంతర్గత రోడ్లు, విద్యుత్, తాగునీరు, సౌర శక్తి విద్యుత్ ప్లాంట్స్ పనులు మొదలు పెట్టి నేటికి పూర్తి చేశారు. 2,200 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలు ఉంది. భవిష్యత్ లో తరగతి గదుల సంఖ్య, హాస్టల్ భవనాల సంఖ్య పెంచుతారు. విద్యార్థులకు రెండు హాస్టల్ భవనాలు, విద్యార్థినులకు ఒక భవనం ప్రస్తుతం ఏర్పాటైంది.

రాయలసీమలో ఎంపికకు కారణాలు

రాయలసీమ ప్రాంతం సాంప్రదాయకంగా వెనుకబడిన ప్రాంతంగా చెబుతుంటారు. ఇక్కడ విద్య, ఆర్థిక అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సెంట్రల్ యూనివర్శిటీ స్థాపన ద్వారా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అనంతపురం జిల్లా ఎంపికకు ప్రధాన కారణం దాని భౌగోళిక స్వరూపం. ఇతర ప్రధాన నగరాలతో కనెక్టివిటీ, భూమి లభ్యత. ఈ విశ్వవిద్యాలయం రాయలసీమ ప్రాంతంలో విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావించింది.

పరిశోధనలకు ఈ ప్రాంతం అనుకూలం..

సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాని నాణ్యమైన విద్య, బహుముఖ విద్యా కార్యక్రమాలు, పరిశోధనా సామర్థ్యంతో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ విశ్వవిద్యాలయం సాంకేతిక, సామాజిక శాస్త్రాలు, సహజ శాస్త్రాలలో విస్తృతమైన కోర్సులను అందిస్తుంది. ఇవి ఆధునిక ఉపాధి అవసరాలకు అనుగుణంగా రూపొందాయి. అంతేకాక ఈ సంస్థ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంలో స్థాపించబడడం వల్ల స్థానిక విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందుబాటులోకి తెచ్చినట్లైంది. దీర్ఘకాలంలో ఈ విశ్వవిద్యాలయం జ్ఞాన ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారి, రాయలసీమను విద్యా హబ్‌గా తయారు చేస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు.

ఉన్నత విద్యలో కొత్త యుగం

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ స్థాపన ఉన్నత విద్యా రంగంలో కొత్త యుగాన్ని తెచ్చింది. సామాజికంగా, సాంస్కృతికంగా సంబంధితమైన నూతన విద్యా కార్యక్రమాలతో ఈ విశ్వవిద్యాలయం రాబోయే సంవత్సరాల్లో వేగవంతమైన వృద్ధిని సాధించేందుకు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. విలువల ఆధారిత విద్య ద్వారా విద్యార్థులను జ్ఞానవంతులైన, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం, ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఆచరణాత్మక అనుభవంపై దృష్టి సారించడం ఈ విశ్వవిద్యాలయం ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ లక్ష్యంతో ఇండస్ట్రీతో సహకరించి డిమాండ్ ఆధారిత వివిధ రకాల కోర్సులను, అనేక స్వల్ప, దీర్ఘకాలిక వృత్తి కోర్సులను అందించాలని విశ్వవిద్యాలయం లక్ష్యంగా పెట్టుకుంది.

స్టడీ ఇండియా ప్రోగ్రాం

రాబోయే కాలంలో విదేశీ విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు అకాడమిక్ గ్రేడ్‌లు/క్రెడిట్‌ల బదిలీ ఎంపికతో కూడిన స్టడీ ఇండియా ప్రోగ్రామ్‌ను కూడా ఈ విశ్వవిద్యాలయం ప్రారంభించనుంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు చెందిన 1,600 మంది విద్యార్థులతో పాటు విదేశాలకు చెందిన 50 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

నిర్మాణంలో ఆలస్యం

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో భాగంగా కేంద్రం ఈ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసినప్పటికీ, భవన నిర్మాణ పనులు ఆలస్యానికి గురయ్యాయి. ఈ ఆలస్యానికి ప్రధాన కారణాలు భూమి సేకరణలో జాప్యం, నిధుల విడుదలలో అడ్డంకులు, సాంకేతిక, పరిపాలనా సమస్యలు. అదనంగా కాంట్రాక్టర్ల ఎంపిక, నిర్మాణ పనుల సమన్వయంలో సమస్యలు కూడా ఆలస్యానికి కారణాలయ్యాయి.


ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ జ్ఞాన విస్తరణకు వేదిక

ఈ విశ్వవిద్యాలయం ను ‘జ్ఞానసీమ’గా పిలుస్తున్నారు. ఈ పేరు ఇక్కడ జ్ఞానం విస్తరించి, సమాజానికి ఉపయోగపడే విద్యను అందించాలనే లక్ష్యాన్ని సూచిస్తుంది. ఎడ్యుకేషన్ 4.0తో ఇండస్ట్రీ 4.0ని అనుసంధానం చేస్తూ, ఆధునిక అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఏ కోరి తెలిపారు. సామాజిక, ఆర్థిక అవసరాలకు తగిన నాణ్యమైన విద్యా కార్యక్రమాలను అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్, కరికులం రూపకల్పన, బోధన, అభ్యాసం, మూల్యాంకనం, ఫలితాలు, ఈ ఐదు దశలపై సమాన శ్రద్ధ చూపిస్తాం. సాంకేతికత ఆధారిత ఉద్యోగాల సృష్టి, నిరంతర విద్య, పరిశోధన, సహకారం సామాజిక సేవల ద్వారా ఆదాయ వనరులను పెంచే కార్యక్రమాలను ప్రోత్సహిస్తాం. సామాజిక తెలివి, సృజనాత్మక ఆలోచన, కంప్యూటేషనల్ థింకింగ్, క్రాస్-కల్చరల్ వంటి నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీ పడే సత్తా...

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ స్థాపన రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే కాక, విద్యార్థులను కేంద్ర పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు సిద్ధం చేస్తుంది. ఆధునిక సిలబస్, ఆచరణాత్మక అనుభవం, ఇండస్ట్రీ సహకారంతో రూపొందిన కోర్సుల ద్వారా విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలరు. ఈ విశ్వవిద్యాలయం రాయలసీమను విద్యా హబ్‌గా మార్చడంతో పాటు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే సామర్థ్యం కలిగి ఉంది.

Tags:    

Similar News