మీడియా హడావిడి తప్ప కష్టాలు తీరిందెక్కడ?
ఒక జర్నలిస్టు విజయవాడ వరద ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్!
టి.వి.నరసింహారావు
విజయవాడ: బుడమేరు వరద వచ్చి వారం రోజులు అయింది. ఇప్పుడు చాలా ప్రాంతాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, అందరికీ ప్రభుత్వ సహాయం అందుతోందని మీడియా ప్రచారాన్ని చూశాక అక్కడ సాధారణ స్థితి ఏర్పడిందని నేనూ భావించాను. అక్కడికి అసలు వాహనాలను అనుమతిస్తున్నారా లేదా అనేది తెలియదు. అయినా ఒక ప్రయత్నంగా వాస్తవ పరిస్థితి ప్రత్యక్షంగా చూడాలనుకున్నాను.
నాకు ఆ ప్రాంతం పరిచయం లేకపోవడంతో ఎంఎల్ మిత్రులతో కలిసి ఈరోజు బయలుదేరాను. వారి టీమంతా ఒక జీపులో బయలుదేరగా వారి వెనక టూ వీలర్ లో గణేష్ అనే మిత్రునితో కలిసి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్లాక వాస్తవ పరిస్థితి బోధపడింది. తొలుత సింగ్ నగర్ లోని ఒక రోడ్డులో నీరు ప్రారంభమయ్యే దగ్గర వాహనాలను పార్కు చేసాము. అక్కడి నుంచి నీళ్లలోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది.
ఛాతిలోతు నీళ్లు దాటి బుడమేరు వంతెన ఎక్కాము. ఆ వంతెన దిగాక ప్రవాహ ఉధృతి వల్ల ఫోను బయటకు తీసే సాహసం చేయలేకపోయాము. కొంత దూరం దాటిన తర్వాత ఫోన్ బయటకు తీసి వీడియో తీయగలిగాము. ఎటు చూసినా నీళ్లే. న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇప్పటికీ ఒకరికొకరు చేతులు పట్టుకోకుండా బుడమేరు ఉధృతికి ఎదురు నడవడం సాధ్యం కావడం లేదు. అక్కడే నీటి మధ్యలో సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది. ఆ ప్రాంతంలో కనుచూపుమేరలో నేల కనిపించదు.
ఇప్పటికీ చాలా వరకు ఇళ్లల్లో నుంచి నీళ్లు బయటకు తోడేశారు. వాళ్లకు మిగిలింది కేవలం వంట గిన్నెలు మాత్రమే. చాలా వీధిలో ఇళ్ల ముందు మాత్రం నీరు అలాగే ఉంది. అది మురిగి కంపు కొడుతోంది. ఆ పేటలో ఎక్కువమంది ఆటో కార్మికులు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, చిన్న చిన్న పనులు చేసుకునే పేద ప్రజలు. అక్కడి ఇళ్ళు కూడా చిన్న చిన్న డాబాలు కొన్నిటికి మాత్రమే పై అంతస్తు ఉంది. హఠాత్తుగా వరద వచ్చినప్పుడు డాబా మీదకి కానీ పై అంతస్తు లోకి కానీ వెళ్లి ప్రాణాన్ని కాపాడుకున్నారు.