చెంబుకు మహిమలున్నాయని మోసపోయిన మహిళా డాక్టర్
జేపీ మోర్గాన్ సంస్థకు చెందిన సైంటిస్టుగా చలామణి అవుతున్న ఓ వ్యక్తి సమక్షంలో ఆ చెంబును మెటల్ డిటెక్టర్‌తో పరీక్షించి మోసం చేశారు.
రైస్ పుల్లింగ్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన వైద్యురాలు డాక్టర్ ప్రియాంకను మోసం చేసి రూ.1.5 కోట్లు కొల్లగొట్టిన ముగ్గురు కేటుగాళ్లను విశాఖ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన ఓ మహిళ, డాక్టర్ ప్రియాంకకు పరిచయమై, విశాఖలో తనకు తెలిసిన వారి వద్ద అద్భుత శక్తులు కలిగిన చెంబు ఉందని, దాని విలువ విదేశాల్లో కోట్ల రూపాయల్లో ఉంటుందని, అత్యవసరంగా అమ్మకానికి ఉందని చెప్పింది. ఈ నమ్మకంతో విశాఖకు వచ్చిన ప్రియాంక, జేపీ మోర్గాన్ సంస్థకు చెందిన సైంటిస్టుగా చలామణి అవుతున్న ఓ వ్యక్తి సమక్షంలో ఆ చెంబును మెటల్ డిటెక్టర్‌తో పరీక్షించగా, అది బియ్యాన్ని ఆకర్షించడంతో ఆమెకు నమ్మకం కుదిరింది. దీంతో ఆమె దఫదఫాలుగా కేటుగాళ్ల బృందానికి రూ.1.5 కోట్లు చెల్లించింది.
చెంబును తీసుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిన ప్రియాంక, దానికి ఎలాంటి ప్రత్యేక శక్తులూ లేవని తెలుసుకుని, తాను మోసపోయానని గుర్తించింది. కేటుగాళ్ల బృందం ఆరిలోవ ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకుని, ఈ నెల 19న ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు నేతృత్వంలోని బృందం కేసును ఛేదించడానికి రంగంలోకి దిగింది.
పెందుర్తికి చెందిన వి.నివాస్, అరకులోయకు చెందిన కొర్రా బంగార్రాజు ఆరిలోవ డంపింగ్ యార్డు వద్ద, విజయవాడకు చెందిన కర్నాటి ప్రసాద్‌ను విమ్స్ ప్రధాన గేటు వద్ద అరెస్టు చేశారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు హరికృష్ణ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. నిందితుల నుంచి రూ.2.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి ఆకర్షణీయమైన ఆఫర్లను అధికారిక సంస్థల ద్వారా పరిశీలించాలని పోలీసులు సూచించారు.