ఫెయింజల్ ఉగ్రరూపం..ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌కు తుపాన్ ప్రమాదం పొంచి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి తుపానుగా మారింది. ఈ తుపానుకు ఫెయింజల్‌గా పేరు పెట్టారు. ఫెయింజల్ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. శనివారం మధ్యాహ్నం సమయానికి కరైకల్, పుదుచ్చేరి, తమిళనాడులోని మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 90కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఫెయింజల్ తుపాను ప్రభావం వల్ల ఏపీలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ఫెయింజల్ తుపాను ప్రమాదం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు çకురుస్తాయి. దీంతో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉంది. తుపాన్ నేపథ్యంలో ఏపీలో పోర్టులకు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబర్ హెచ్చరికలు, మచిలీపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.