అధికారుల్లో బ్రాండింగ్ భయం
సీఎస్ నుంచి తహశీల్దారు వరకు, డీజీపీ నుంచి ఎస్‌ఐ వరకు బ్రాండింగ్ భయం పట్టుకుంది. ఇప్పుడు సరే రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళనల్లో ఉన్నారు.
Byline : Vijayakumar Garika
Update: 2024-07-09 06:07 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలలో నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్లు రెండుగా చీలి పోయినట్లు అధికారులు కూడా రెండుగా చీలి పోయారు. కొంత మంది టీడీపీ గ్రూపుగాను, మరి కొంత మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుగాను విడిపోయారు. ప్రజల కోసం పని చేసేవారు తక్కువై పోయారు. ఏ గ్రూపుకు చెందకుండా తటస్థంగా ఉంటూ విధులు నిర్వహించే అధికారుల సంఖ్య తగ్గి పోయింది. అలాంటి అధికారులు అక్కడక్కడా కనిపించినా వారిపైన కూడా ఈ రాజకీయ ప్రభావం పడుతుండటంతో వారు కూడా ఏదో గ్రూపునకు కొమ్ముకాయడం తప్పడం లేదనే అభిప్రాయం అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది.
2014 నుంచి 2019 వరకు అలాంటి ప్రభావం పెద్దగా కనిపించక పోయినా, 2019 నుంచి పెరుగుతూ వచ్చింది. టీడీపీ ప్రభుత్వం పోయి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రావడంతో తెరపైకి వచ్చింది. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారులతో పాటు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగిన వారు, ఉన్న వారు, టీడీపీ పార్టీ నేతలతో సఖ్యతగా ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటుగా వారిని టీడీపీ అధికారులుగా ఒక ముద్ర వేసి వారిని దూరం పెడుతూ వచ్చారనే విమర్శలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొంత మంది అధికారులకైతే పోస్టులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెడుతూ వచ్చారు. ఇలాంటి సమస్యల నుంచి బయట పడేందుకు డిప్యుటేషన్‌లపై ఇతర రాష్ట్రాలకు, సెంట్రల్ సర్వీసులకు కొంత మంది వెళ్లగా, మరి కొంత మంది ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్లారు.
తాజాగా ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరిగి పోయింది. గత జగన్ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలకు అంటకాగారనే నెపంతో పక్కన పెట్టడం మొదలు పెట్టారు. పదుల సంఖ్యలో అధికారులను జీఏడీకి అటాచ్ చేశారు. గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం విడిచి వెళ్లిన అధికారులను చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రప్పించే పనిలో నిమగ్నమైంది. ఆ మేరకు కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి ఇప్పటికే చాలా మందిని ఏపీకి రప్పించింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొంత మంది అధికారులు ఇప్పటికే సెలవులో ఉన్నారు. ఈ రకమైన బ్రాండింగ్‌లు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో అధికారుల బదిలీల్లో ఇది ఒక కొలిక్కి వచ్చినా తర్వాత స్థాయిలో అధికారుల్లో ప్రక్రియ ఇంకా జోరందుకో లేదు.
ఇలాంటి కక్ష పూరిత వాతావరణంలో విధులు నిర్వహించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. తటస్థంగా ఉంటూ పని చేద్దామనుకుంటున్న అధికారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. వాటిని అధికమించేందుకు వారు కూడా ఏదో ఒక గ్రూపులోకి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. అలా అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని, లేక పోతే రెండు గ్రూపుల నుంచి కష్టాలు వచ్చి పడుతున్నాయని అధికార వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ఐదేళ్లు ఏదో విధంగా బయట పడాలని ప్రయత్నించినా.. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో అని ఆందోళనలో కొంత మంది ఉండగా, ఈ ఐదేళ్లు గడవడం ముఖ్యం, తర్వాత సంగతి తర్వాత అనే ఆలోచనల్లో మరి కొంత మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రాండింగ్ భయం అధికారులను పట్టి పీడిస్తోందనే చర్చ సాగుతోంది.