వీళ్ళ గెలుపులో కీలకపాత్ర ఎవరిది ?

అభ్యర్ధులు ముగ్గురూ అరంగేట్రంలోనే మంచి మెజారిటితో గెలిచారు. అంటే పోటీచేసింది వారసులే అయినా గెలుపుకు కష్టపడింది, చక్రంతిప్పిందంతా తండ్రులే కావటం గమనార్హం.

Update: 2024-06-05 07:50 GMT

తెలంగాణాలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తమ వారసులను గెలిపించుకోవటంలో వాళ్ళ తండ్రులే కీలకపాత్ర పోషించారు. తండ్రులకు ఉన్న దశాబ్దాల రాజకీయ అనుభవం, నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు, యువతకు ప్రతినిధులుగా అభ్యర్ధులు పోటీచేస్తుండటం కలిసొచ్చి అభ్యర్ధులు ముగ్గురూ అరంగేట్రంలోనే మంచి మెజారిటితో గెలిచారు. అంటే పోటీచేసింది వారసులే అయినా గెలుపుకు కష్టపడింది, చక్రంతిప్పిందంతా తండ్రులే కావటం గమనార్హం.

అసలు విషయంలోకి వెళితే వరంగల్లో మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్ లో టికెట్ వచ్చినా కాదనిచెప్పి కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోగానే లోకల్ నేతల నుండి కొంచెం వ్యతిరేకత వచ్చింది. అయితే శ్రీహరి తనకున్న పరిచయాలను, చతురతను ఉపయోగించి సర్దుబాటుచేసుకున్నారు. దాంతో పార్లమెంటునియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూతురు కావ్యతో కలిసి శ్రీహరి విస్తృతంగా ప్రచారంచేశారు. కూతురు కాదు తానే అభ్యర్ధి అన్నట్లుగా శ్రీహరి దాదాపు నెలరోజులు విస్తృతంగా ప్రచారంలో కష్టపడ్డారు. డాక్టర్ గా పనిచేస్తున్న కావ్య ప్రత్యక్షరాజకీయాల్లోకి ప్రవేశించటం, ఎంపీగా పోటీచేయటం ఇదే మొదటిసారి. బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన ఆరూరి రమేష్ పై కావ్య 2.20 లక్షల మెజారిటీతో గెలిచారు.

నల్గొండ లోక్ సభ సీటునుండి కందూరు జానారెడ్డి కొడుకు కుందూరు రఘువీర్ రెడ్డి పోటీచేశారు. రాజకీయాల్లో తండ్రిని దగ్గరనుండి చాలాకాలంగా చూస్తున్నా, తండ్రి వ్యవహారాలను తెరవెనుకనుండి నడిపిస్తున్న రఘువీర్ ప్రత్యక్షంగా పోటీలోకి దిగింది మాత్రం మొదటిసారే. కొడుకుల కోసం జానారెడ్డి తన రాజకీయానికి దాదాపు ముగింపు పలికినట్లే. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నకొడుకు జయవీర్ రెడ్డిని గెలిపించుకున్నట్లే తాజా పార్లమెంటు ఎన్నికల్లో రఘువీర్ రెడ్డిని కూడా గెలిపించుకున్నారు. జిల్లాలో తనకున్న విస్తృత పరిచయాలు, రాజకీయ చతురతకు తోడు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉతమ్ కుమార్ రెడ్డి, ఎంఎల్ఏలు పద్మావతి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, తమ్ముడు జయవీర్ రెడ్డి అభ్యర్ధి గెలుపును భుజనవేసుకుని పనిచేశారు. అన్నీ అంశాలు కలిసిరావటంతో ప్రత్యర్ధులు బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డిపై రఘువీర్ ఏకంగా 5.59 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

చివరగా పెద్దపల్లి (ఎస్సీ) నియోజకవర్గంలో గడ్డం వంశీకృష్ణ గెలిచారు. వంశీ ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ చాలా ఘనంగా ఉంది. తాత గడ్డం వెంకటస్వామి అలియాస్ గుడిసెల వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటుకు నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. తండ్రి గడ్డం వివేక్ చెన్నూరు ఎంఎల్ఏ కాగా పెద్దనాన్న గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎంఎల్ఏ. ఈ కుటుంబానికి జిల్లాలో ప్రత్యేకించి నియోజకవర్గంలో ఉన్న విస్తృత పరిచయాల కారణంగా వంశీ సమీప ప్రత్యర్ధులు కారుపార్టీ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్, బీజేపీ తరపున పోటీచేసిన గోమాసె శ్రీనివాస్ ను ఓడించారు. గడ్డం 1.32 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

Tags:    

Similar News