Fake ticket gang | తిరుమల: నకిలీ టికెట్ల ముఠాగా మారిన ఉద్యోగులు
టిటిడి విజిలెన్స్ ఇంటి దొంగలను అరెస్ట్ చేసింది. నకిలీ టికెట్ల వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతోందనేే విషయం తెరపైకి వచ్చింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-01-15 16:42 GMT
తిరుమలలో అధికారులకు నకిలీ టికెట్ల విక్రయం ఛాలెంజ్ గా మారింది. టికెట్లు ముద్రిస్తున్న అగ్నిమాపక శాఖ ఉద్యోగులు ట్యాక్సీ డ్రైవర్ల సహకారంతో విక్రయిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగి డ్యూటీలో ఉన్నప్పుడు దర్శనానికి పింపిస్తున్నారు. ఇది బుధవారం వెలుగు చూసింది. అయితే,
తిరుమలలో ఇది కొత్తగా జరుగుతున్న వ్యవహారం కాదనే విషయం ఆ ఐదుగురి నెట్ వర్క్ను పరిశీలిస్తే, అర్థం అవుతుంది. ఎన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది? ఈ రోజే నకిలీ టికెట్లపై విజిలెన్స్ విభాగానికి సందేహం రావడానికి కారణం ఏమిటనేది కూడా చర్చకు తెరతీసింది. ఎందుకంటే నకిలీ టికెట్లు ముద్రించడం అంటే, ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ రోజుల వ్యవధిలో అమలు చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. ఇంత జరుగుతుంటే, విజిలెన్స్ విభాగం నిఘా సిబ్బంది దీనిని ఎందుకు పసిగట్టలేకపోయారు? ఇది సమాధానం లేని ప్రశ్నే?!
తిరుమలలో ప్రక్షాళనకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న, అక్రమాలు చేసేవారు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఈసారి ఏకంగా నకిలీ టికెట్ అనే ముద్రించి సొమ్ము చేసుకుంటున్న ఇంటి దొంగల వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. తాజాగా,
తిరుమలలో హైదరాబాద్, పొద్దుటూరు, బెంగళూరుకు చెందిన సుమారు 11 మంది భక్తులకు నకిలీ టికెట్లు విక్రయించారు. వారి నుంచి 19000 వసూలు చేశారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్ వద్ద అనుమానం వచ్చిన విజిలెన్స్ సిబ్బంది టికెట్లను తనిఖీ చేశారు. దీంతో, టికెట్లు ముద్రిస్తున్న అగ్నిమాపక సిబ్బంది, వాటిని విక్రయిస్తున్న దళారులుగా మారిన టాక్సీ డ్రైవర్లు. వీరందరికీ సహకారం అందిస్తున్న 300 రూపాయల కౌంటర్ ఉద్యోగి వ్యవహారం విజిలెన్స్ సిబ్బంది రట్టు చేశారు.
అగ్నివీరుల పాత్ర
తిరుమల అగ్నిమాపక శాఖలో పనిచేసే సిబ్బంది టాక్సీ డ్రైవర్ సహకారంతో నకిలీ టికెట్లు విక్రయిస్తున్న వ్యవహారం వెలుగు చూసింది.. ఈ ఘటనతో టిటిడి అధికారులు నివ్వెర పోయారు. ఈ వ్యవహారంలో అనేక ఆసక్తికర విషయాలు ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి.
టిటిడి ఉద్యోగి సహకారంతో..
తిరుమల అగ్నిమాపక శాఖ లో పనిచేసే మణికంఠ, భాను ప్రకాష్ నకిలీ టికెట్లు ముద్రించే వారిని భావిస్తున్నారు. తిరుమలలోని ట్యాక్సీ డ్రైవర్లుగా ఉన్న తిరుపతికి చెందిన శశి, చెన్నై జగదీష్ ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు మాయమాటలు చెప్పి ఈ టికెట్లు విక్రయించే వారు తెలుస్తోంది. దీనికి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్ వద్ద ఉండే ఉద్యోగి లక్ష్మీపతి సహకారం అందించే వాడని పోలీసుల తెలిసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్ వద్ద లక్ష్మీపతి డ్యూటీలో ఉండగా, దర్శనానికి పంపించేవారిని తెలుస్తోంది.
అందులో భాగంగానే బుధవారం కూడా కొందరు యాత్రికులు తీసుకువచ్చిన ఇక్కట్లపై సందేహించిన విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో తిరుపతికి చెందిన టాక్సీ డ్రైవర్ శశి, చెన్నై జగదీష్, అగ్నిమాపక శాఖ ఉద్యోగి మణికంఠ, భాను ప్రకాష్ టిటిడి ఉద్యోగి లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్న టిటిడి విజిలెన్స్ విభాగం అధికారులు. తిరుమల ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు.
నకిలీ టికెట్లు విక్రయిస్తున్న ఆ ఐదుగురిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎన్ని రోజులుగా నకిలీలు తయారు చేస్తున్నారనేది విచారంలో తేలనుంది. ఇన్నేళ్లుగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, కౌంటర్ల వద్ద పనిచేసే స్కానింగ్ సిబ్బంది కూడా ఈ వ్యవహారాన్ని ఇన్ని రోజులు ఎందుకు కనిపెట్టలేకపోయారు అనేది కూడా వెలుగు చూసే అవకాశం ఉంది.