సినిమాలు, టీవీ షోలపై మాజీ మంత్రి రోజా అడుగులు !

ఇటీవల ఎన్నికల్లో ఓడి పోవడంతో మాజీ మంత్రి రోజా మళ్లీ సినిమాలు, టీవీ షోల వైపు చూస్తున్నారు. గ్యాప్‌ను అలా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది.

Update: 2024-06-21 14:34 GMT

ప్రముఖ సినీ నటి, మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా మళ్లీ సినిమాల వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత సన్నిహితులైన నేతల్లో రోజా ఒకరు. జగన్‌ మోహన్‌రెడి రోజమ్మా అని ముద్దుగా పిలుచుకునే నేత. జగన్‌ మంత్రి వర్గంలో ఓ వెలుగు వెలిగారు. అయితే 2024 ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో కొద్ది రోజులు రాజకీయాలకు గ్యాప్‌ ఇవ్వాలనుకుంటున్నట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఇటీవలె కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడటం, ప్రభుత్వ పనితీరుపైన కానీ, పాలసీ నిర్ణయాలపైన కానీ, అజెండా అమలు చేయడంలో కానీ ఇప్పుడే విమర్శల దాడులకు దిగడం బాగుండదని, ఆరు నెలలో, ఏడాదో పోయిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పని తీరును ఎండగట్టం చేస్తే బాగుంటుందని, ఈ గ్యాప్‌లో కొన్ని సినీమాలైనా, టీవీ షోలైనా చేసుకుని, నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సినీమాలు, టీవీఫోలపై దృష్టి సారించినట్లు టాక్‌ నడుస్తోంది.

సినీమాలో డైలాగులు సునాయసంగా చెప్పే రోజా రాజకీయ జీవితంలో కూడా తన ప్రసంగాల్లోను, చర్చల్లో పంచ్‌ డైలాగులు పేల్చడం, ప్రాసలో డైలాగులు వదలడం ఆమె ప్రత్యేకత. సినీ కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆమె రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత, మాజీ ఎంపీ డాక్టర్‌ శివప్రసాద్‌ ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రముఖ హీరో రాజేంద్రప్రసాద్‌ నటించిన ప్రేమ తపస్పు సినిమాలో హీరోయిన్‌గా రోజా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వినోద్‌కుమార్‌తో నటించిన సీతారత్నంగారి అబ్బాయి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాలోని మేఘమా మరువకే అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో బాగా హిట్‌ అయిన పాటల్లో ఇదొకటి. దీంతో రోజా ఇక వెనుదిరి చూడ లేదు. అనతి కాలంలోనే ప్రముఖ హీరోయిన్‌గా మారి పోయారు. తెలుగులో స్టార్‌ హీరోలైన కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలతోను అనేక సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు మళయాళం, కన్నడ, తమిళ బాషల్లో ప్రముఖ నటులతోను రోజా నటించారు. దాదాపు 120పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాలవైపు మొగ్గు చూపారు.
తొలుత తెలుగుదేశం పార్టీతోనే ఆమె రాజకీయ కెరీర్‌ను మొదలు పెట్టారు. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నగరి నుంచి పోటీ చేసి ఓడి పోయారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి మరో సారి ఓటమి పాలయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా నగరి నుంచి పోటీ చేసీ గెలుపొందారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. 2022 ఏప్రిల్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రోజాకు మంత్రి పదవి దక్కింది. పర్యాటక, యూత్‌ సర్వీసెస్‌ శాఖల మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత సినిమాలు, టీవీ షోలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టారు.
అయితే అంతకు ముందు సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించారు. గోలీమార్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలు పెట్టారు. అడపా దడపా సినామాలు వస్తున్నా.. టీవీ షోలపై దృష్టి పెట్టారు. సినిమాల కంటే జబర్థస్త్, బతుకు జట్కాబండి, రంగస్థలం వంటి టీవీ షోలే పాపులర్‌ కావడంతో మంచి పేరు తెచ్చి పెట్టాయి. అన్నింటి కంటే ఈ టీవీ జబర్థస్త్‌ బాగా పాపులర్‌ అయింది.
2024 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో గతంలో మాదిరిగా సినిమాలు, టీవీ షోల్లో బిజీ కావాలనే ఆలోచనలో ఉన్నట్లు చర్చ సాగుతోంది. రాజకీయాల నుంచి ఆటవిడుపుతో పాటు మంచి పాపులారిటీ, మంచి సంపాదన ఉంటుందనే ఉద్దేశంతో వాటిపైన మాజీ మంత్రి ఆర్కే రోజా దృష్టి సారించినట్లు టాక్‌ ఉంది.
Tags:    

Similar News